ప్లాంట్లను సీజ్ చేస్తున్న అధికారులు
సాక్షి, ఖమ్మం అర్భన్ : ఖమ్మంలోని వాటర్ ప్లాంట్లపై కార్పోరేషన్, రెవెన్యూ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు. 31 ప్లాంట్లను సీజ్ చేశారు. హైకోర్ట్ ఆదేశాలతో ఈ దాడులు చేసినట్టు ప్లాంట్ల యజమానులతో చెప్పారు.
ఇదీ నేపథ్యం
ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని నిబంధనల ప్రకారంగా వాటర్ ప్లాంట్లు నడుపుతున్న తాము.. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటైన ప్లాంట్ల కారణంగా నష్టపోతున్నామంటూ కొందరు (ప్లాంట్ల యజమానులు) గతంలో ఆందోళనకు దిగారు. దీనిపై సంబందిత అధికారులు స్పందించనట్టయితే తామంతా ప్లాంట్లు బంద్ చేస్తామన్నారు. ప్లాంట్ల యజమానుల సంఘం నాయకులతో ఆర్డీఓ చర్చించారు. అనుమతి లేని ప్లాంట్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సంఘం ఆధ్వర్యంలో ప్లాంట్ల యజమానులు ఆందోళన విరమించారు.
ఈ దాడులు ఎందుకంటే...
అనుమతి, ట్రేడ్ లైసెన్స్ లేని, నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లు నగరంలో 31 ఉన్నట్టుగా గుర్తించి, వాటిని సీజ్ చేసినట్లు ఖమ్మం కార్పోరేషన్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణఫర్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో నగరంలోని ఖానాపురం, బల్లేపల్లి, పాండురంగాపురం, కైకొండాయిగూడెం, బైపాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లోని ప్లాంట్లపై దాడులు చేశారు. సీజ్ చేయడానికి ముందుగానే వీటి యజమానులకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు.
కొన్ని ప్లాంట్లలో నిర్వహణ లోపాలను, అపరిశుభ్రతను చూసిన అధికారులు నివ్వెర పోయారు. ‘‘శుద్ధ జలం పేరుతో జనానికి అంటగడుతున్నది ఈ నీళ్లా..?’’ అనుకుంటూ అవాక్కయ్యారు. ఆ ప్లాంట్ల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో ఏసీపీ రాంచందర్‌రావు, అర్భన్ డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌బాబు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు వెంకటరమణ, భాస్కర్, వీఆర్‌ఓలు బాలయ్య, ఆర్.వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ నాగరాజు, హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment