చెంచులకు ఇచ్చిన భూముల్లో మైనింగ్ మాఫియా జరిపిన తవ్వకాలు
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్న అధికార పార్టీ నేతలు, మైనింగ్ మాఫియా చివరకు.. రెక్కాడితే కానీ డొక్కాడని చెంచుల సాగు భూముల్నీ వదల్లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే నేతృత్వంలో దౌర్జన్యంగా ఆ భూములను లాగేసుకుని అందులో అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. అడ్డు వస్తే చంపుతామని అమాయక గిరిజనాన్ని బెదిరిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 4.50 ఎకరాల్లో 12 అడుగుల లోతు తవ్వకాలు జరిపి కోట్ల రూపాయల విలువ చేసే తెల్లరాయిని దోచుకున్నారు. అప్పటికీ ధన దాహం తీరకపోవడంతో మిగతా భూముల్లోకి సైతం చొరబడుతూ తవ్వకాలు జరుపుతున్నారు.
తమకు న్యాయం చేయమంటూ చెంచులు ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా వారి గోడు విన్ననాథుడే లేకుండా పోయారు. ఇటీవల అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, అధికారులు ఆ భూముల్లో హడావుడిగా సర్వేలు నిర్వహిస్తున్న వైనాన్ని చూసి ఇప్పటికైనా తమ భూములను తమకు ఇప్పించాలని చెంచులు వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గిరిజనులు సాగు చేసుకునే భూములకు సంబంధించి వారికే పట్టాలు ఇవ్వాలంటూ దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జీవో జారీ అయ్యింది.
ఆ జీవో ఆధారంగా కొండమోడు చెంచుకాలనీ వాసులు 18 మంది 36 ఎకరాల సాగు భూములకు పట్టాలు పొందారు. రాళ్లు రప్పలు ఉన్న భూములను బాగుచేసుకుని పంటలు వేశారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు వారి చేతికందే సమయానికి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు బుల్లి అబ్బాయి, అంజిబాబు, కోటి అనే వ్యక్తులు చెంచులు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై చెంచులు స్థానిక తహసీల్దారు నుంచి ఉన్నతాధికారుల వరకు ఎంతమందిని కలిసినా ఫలితం లేకుండా పోయింది.
అధికారులకు ఫిర్యాదులు చేయడం, ఆందోళనలకు దిగడం వంటివి చేస్తే మా ఎమ్మెల్యే ప్రస్తుతం సాగుచేసుకుంటున్న భూములు కూడా మీకు మిగలకుండా చేస్తారంటూ మైనింగ్ మాఫియా బెదిరింపులకు దిగడంతో ఆ అభాగ్యులు జీవనోపాధి కోల్పోయి కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో అధికారులు ప్రస్తుతానికి అక్రమ మైనింగ్‌ను నిలిపివేయించారు. ఇప్పటికైనా తమ భూములు తమకు దక్కేలా చూడాలని చెంచులు వారిని కోరుతున్నారు.
అడ్డు వస్తే ట్రాక్టర్‌తో తొక్కిస్తామన్నారు
మాకు ప్రభుత్వం 2013లో పట్టాలు ఇచ్చింది. అందులో పంటలు సాగు చేసుకుంటున్నాం. టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే యరపతినేని అనుచరులు అంజిబాబు, బుల్లి అబ్బాయిలు మా భూములు లాక్కొని అందులో క్వారీ కోసం తవ్వకాలు జరిపారు. ఇదేమని ప్రశ్నిస్తే.. అడ్డు వస్తే ట్రాక్టర్‌తో తొక్కించి చంపడానికి కూడా వెనుకాడమంటూ బెదిరింపులకు దిగారు. మా వద్ద నుంచి పట్టాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు లాక్కున్నారు. – కందుకూరి చెంచుబాబు
డబ్బులు తీసుకుని భూములిచ్చి ఉంటే ఏం చేయలేం
కొండమోడు చెంచుకాలనీ వాసులు సాగు చేసుకునేందుకు గతంలో పట్టాలు ఇచ్చాం. వారిలో కొంతమంది పక్కనే మైనింగ్‌కు పాల్పడుతున్నవారి వద్ద డబ్బు తీసుకుని భూములు ఇచ్చేశారు. మిగతా వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. డబ్బు ఆశతో మైనింగ్‌కు భూములు ఇచ్చి ఉంటే మేము ఏమీ చేయలేం. – రవిబాబు, తహసీల్దారు, పిడుగురాళ్ళ
ఎమ్మెల్యే తవ్వుకోమన్నారట..
మాకు పట్టాలు ఇచ్చిన భూముల్లో దౌర్జన్యంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే యరపతినేని తవ్వుకోమ న్నారని చెబుతున్నారు. మీరు ఏ అధికారికి చెప్పినా ఎవరూ పట్టించుకోరని కోటి అనే వ్యక్తి బెదిరించాడు. అతను చెప్పినట్టే ఎవరూ మమ్మ ల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నేను పొలం వదిలేసి కూలికి వెళుతున్నా. – చేవూరి అలివేలు
వైఎస్ పెట్టిన భిక్షను లాగేశారు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన జీవో ఆధారంగా మేము అప్పటి కలెక్టర్‌ను కలిశాం. ఆయన స్పందించి 18 మందికి 36 ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. – వెంకటేశ్వర్లు, చెంచుకాలనీ పెద్ద
Comments
Please login to add a commentAdd a comment