‘ఘనుడు’ సేఫ్‌ బడుగులే బలి | Conspiracy to file a high court in illegal mining | Sakshi
Sakshi News home page

‘ఘనుడు’ సేఫ్‌ బడుగులే బలి

Published Mon, Aug 13 2018 3:53 AM | Last Updated on Fri, Aug 31 2018 8:57 PM

Conspiracy to file a high court in illegal mining - Sakshi

ఎమ్మెల్యే యరపతినేనితో మైనింగ్‌ మాఫియాలో ముఖ్య సూత్రధారి ఘట్టమనేని నాగేశ్వరరావు (అతడిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు)

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: అక్రమంగా దోచేసిన సొమ్ముతో ఇతరుల పేరిట ఇళ్లు, పొలాలు, ఇంటి స్థలాలు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసి, అసలు దోషులు తప్పించుకోవడం చూస్తుంటాం. అయితే, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మరింత బరితెగించారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు రాకుండా అమాయకులను బలి చేస్తున్నారు. వారిపైనే కేసులు నమోదు చేయించారు. తనకు బదులుగా కేసులు మీద వేసుకుంటే ప్రభుత్వానికి కట్టాల్సిన జరిమానాలు తానే చెల్లిస్తానని, కేసుల నుంచి బయటపడేందుకు సహకరిస్తానని యరపతినేని ముందుగానే బేరం మాట్లాడుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే సూచన మేరకు అనామకుల నుంచి ముందుగానే ఆధార్‌ కార్డులు సేకరించిన మైనింగ్‌ అధికారులు పిడుగురాళ్ల, దాచేపల్లి పోలీసులకు మొత్తం 17 మందిపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే డైరెక్షన్‌లో కేసులు నమోదు చేసిన పోలీసులు సదరు ‘నిందితులను’ అరెస్టు చేయకుండా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారు. ఈ కేసుల్లో బలిపశువులుగా మారిన వారంతా చిన్నాచితక కూలీలు, పేద కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం. కేసులు నమోదైన 17 మందిలో 13 మంది ఎమ్మెల్యే బినామీలు కాగా, మిగిలిన నలుగురు ఎమ్మెల్యే యరపతినేని అవినీతి అక్రమాలపై పోరాడుతున్న వ్యక్తులు ఉన్నారు. 

న్యాయస్థానం కళ్లకు గంతలు కట్టే యత్నం 
మైనింగ్‌ మాఫియా ఆగడాలపై ఇటీవల సాక్షాత్తూ హైకోర్టులు, లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో అక్రమ మైనింగ్‌ జరిగే ప్రాంతాల్లో అధికారులు సర్వే నిర్వహించారు. పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం కేసానుపల్లి, నడికుడి గ్రామాల పరిధిలోని క్వారీల్లో 28 లక్షల టన్నుల మొజాయిక్‌ చిప్స్‌ను(తెల్లరాయి) అక్రమంగా దోచుకున్నట్లు నిర్ధారించారు. మైనింగ్‌ ఏడీ జగన్నాథరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మైనింగ్‌ మాఫియా సూత్రధారి, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేరు, ఈ మాఫియాలో ముఖ్యులైన బుల్లెబ్బాయి, ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు పేర్లు లేవు. అక్రమ మైనింగ్‌పై ఈ నెల 21న హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో గనులను దోచుకున్నవారిపై చర్యలు తీసుకున్నామంటూ కోర్టుకు నివేదించి, న్యాయస్థానం కళ్లకు గంతలు కట్టేందుకు అమాయక కూలీలపై కేసులు పెట్టి, అసలు దోషులను క్షేమంగా పక్కకు తప్పిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేసులు నమోదైన వ్యక్తుల నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ కుట్ర ఎంత పకడ్బందీగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. 

అక్రమ మైనింగ్‌ కేసులు నమోదైన అనామక కూలీలు, సామాన్యులు  
1.క్వారీల కాపలాదారుడిపై కేసు 
పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన మీనిగ అంజిబాబు అనే టీడీపీ కార్యకర్త 9.83 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమంగా క్వారీయింగ్‌ చేసి దోచేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దోచేసిన తెల్లరాయి విలువ రూ.80 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంత విలువైన తెల్లరాయిని తవ్వి సొమ్ము చేసుకున్న అంజిబాబు కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే.. ఎకరం పొలం కూడా లేని అంజిబాబు 2014లో టీడీపీ అధికారంలోకి రాకముందు వరకు కూలీ పనులు  చేసుకుంటూ జీవనం సాగించేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్‌ మాఫియా ముఠాలో ఇతడు ఒక సభ్యుడు మాత్రమే. క్వారీల వద్ద కాపలాగా ఉండేవాడు. అలాంటి అంజిబాబు 9.83 లక్షల టన్నుల తెల్లరాయిని దోచేయడమేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. 

2.మందుగుండు సరఫరా చేసే వ్యక్తిపై కేసు 
పిడుగురాళ్ల పట్టణానికి చెందిన గుదె వెంకటశివకోటేశ్వరరావు అలియాస్‌ కోటి సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతడు సీతారాంపురం క్వారీల నుంచి 2.64 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమంగా తరలించినట్లు మైనింగ్‌ అధికారులు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశాడు. పిడుగురాళ్ల పట్టణంలో సాధారణ ఇంట్లో నివాసం ఉండే శివకోటేశ్వరరావు ఎమ్మెల్యే యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న అక్రమ క్వారీల్లో పేలుళ్లకు మందుగుండు సామగ్రి సరఫరా చేస్తుంటాడు. ఇతడు నేరుగా తెల్లరాయిని తవ్వి, తరలించిన దాఖలాలు లేవు. 

3.మధ్యతరగతి వ్యక్తి రూ.45 కోట్లు దోచేశాడా?
కేసానుపల్లికి చెందిన నెల్లూరి శ్రీనివాసరావు గతంలో ఓ పెట్రోల్‌ బంకులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ యరపతినేని అనుచరుడిగా తిరుగుతుండేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత యరపతినేని కేసానుపల్లిలో ఉన్న క్వారీలన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షణ బాధ్యతలను నెల్లూరి శ్రీనివాసరావుకు అప్పగించేశారు. క్వారీల్లో అక్రమంగా తెల్లరాయిని తవ్వడం నుంచి మిల్లులకు సరఫరా చేయడం వరకు ఇతనే చూస్తుంటాడు. ఆర్థిక లావాదేవీలన్నీ యరపతినేనికి కుడిభుజంగా ఉండే ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తుంటారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన కుడి భుజాలుగా ఉన్న ఇద్దరిని వదిలేసి బినామీగా ఉన్న నెల్లూరి శ్రీనివాసరావుపైనే కేసు నమోదు చేశారు. ఇతడికి ఎకరం పొలం, చిన్న ఇల్లు మాత్రమే ఉంది. మధ్యతరగతి కుటుంబం. మైనింగ్‌ అధికారులు తేల్చిన లెక్క ప్రకారం నెల్లూరి శ్రీనివాసరావు రూ.45 కోట్ల విలువైన తెల్లరాయిని దోచేశాడట!  

4.ఎమ్మెల్యే అనుచరుడి బినామీ అవతారం 
దాచేపల్లి పట్టణానికి చెందిన బత్తుల నరసింహారావు క్వారీలో కూలీ పనులు చేసుకుంటూ టీడీపీ కార్యకర్తగా, యరపతినేని అనుచరుడిగా కొనసాగేవాడు. ఇతడికి సెంటు భూమి కూడా లేదు. మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటివరకు నడుస్తున్న వడ్డెర కో–ఆపరేటివ్‌ సొసైటీని రద్దు చేశారు. ఎమ్మెల్యే అండతో కొత్త సొసైటీని ఏర్పాటు చేశారు. దానికి బత్తుల నరసింహారావు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బత్తుల నరసింహారావు 4.25 లక్షల టన్నుల తెల్లరాయిని దోచేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతడిపై కేసు నమోదైంది. ఈయన దోచేసిన తెల్లరాయి విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

5.టీడీపీ కార్యకర్తపై కేసు నమోదు  
పిడుగురాళ్ల పట్టణానికి చెందిన నీరుమల్ల శ్రీనివాసరావు వార్డు స్థాయిలో టీడీపీ కార్యకర్త. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బినామీల్లో ఒకడు. ఇతడు 1.30 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమ మైనింగ్‌ ద్వారా దోచేశాడని మైనింగ్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతడికి చిన్న ఇల్లు తప్ప ఒక్క సెంటు భూమి కూడా లేదు. అయితే, మైనింగ్‌ మాఫియా ఇచ్చిన సొమ్ముతో ఇటీవల కొండమూడు ప్రాంతంలో రెండెకరాల పొలం కొన్నట్లు సమాచారం. అధికారుల లెక్కల ప్రకారం నీరుమళ్ల శ్రీనివాసరావు దోచేసిన తెల్లరాయి విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 

6.చిన్న స్థాయి కూలీ మరో బినామీ 
పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వర్ల రత్నం 11,356 టన్నుల తెల్లరాయిని అక్రమ క్వారీయింగ్‌ చేసి దోచేసినట్టు అధికారులు నిర్ధారించారు. వాస్తవానికి ఇతడికి ఎకరం పొలం కూడా లేదు. పేద కుటుంబానికి చెందినవాడు. ఒక ట్రాక్టర్‌ ఉంది. దాన్ని సీతారాంపురం క్వారీల్లో లీజుకు పెట్టి అక్కడే కూలీగా పనిచేస్తుంటాడు. ఇతడికి అధికారులు మైనింగ్‌ దోపిడీదారుగా చిత్రీకరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం వర్ల రత్నం దోచేసిన తెల్లరాయి విలువ రూ.కోటి వరకు ఉంటుంది. అయితే, ఆయన ఇప్పటికీ ఆ క్వారీలో కూలీగానే పనిచేస్తున్నాడు. తమ వద్ద కూలీగా పనిచేస్తూ ట్రాక్టర్‌ నడుపుకునే సామాన్యుడిని మభ్యపెట్టి కేసులో ఇరికించినట్లు స్పష్టమవుతోంది. 

7.నెలవారీ జీతగాడు గనులు దోచేశాడట! 
గ్రంథి అజయ్‌కుమార్‌.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త, యరపతినేని అనుచరుడు. మైనింగ్‌ క్వారీల నిర్వాహకుడు అంజిబాబు వద్ద రూ.10 వేల నెలవారీ జీతానికి పని చేస్తుంటాడు. గుమాస్తాగా పని చేసే ఇతడిని అధికారులు మైనింగ్‌ దోపిడీదారుగా సృష్టిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం ఇతను 67,039 టన్నుల తెల్లరాయిని దోచుకున్నాడు. దీని విలువ రూ.8 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వాస్తవానికి ఇతను అంజిబాబు కింద పనిచేసే గుమాస్తా మాత్రమే. తన బినామీ వద్ద పనిచేసే నెలవారీ జీతగాడిని కేసులో ఇరికించి, తాను తప్పించుకోడానికి ఎమ్మెల్యే కుట్ర పన్నారు. 

8.ట్రాక్టర్‌ డ్రైవర్‌పై అక్రమ మైనింగ్‌ కేసు 
రాజుపాలెం మండలం కొండమోడు గ్రామానికి చెందిన ఓర్సు ప్రకాశ్‌  సీతారాంపురం తెల్లరాయి గనుల్లో ట్రాక్టర్లు బాడుగకు తిప్పుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతడికి నాలుగు ట్రాక్టర్లు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రకాశ్‌ 6,643 టన్నుల తెల్లరాయిని అక్రమంగా దోచేశాడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. 

9.అప్పులున్న వ్యక్తి అక్రమంగా దోచేశాడా?  
రాజుపాలెం మండలం కొండమోడు గ్రామానికి చెందిన నంద్యాల నాగరాజు క్వారీల్లో ట్రాక్టర్లు బాడుగకు పెట్టి జీవనం సాగిస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం వరకూ దినసరి కూలీగా ఉండే నాగరాజు ఒకానొక సందర్భంలో కుటుంబ అవసరాల కోసం ఇతరుల నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును సైతం చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడినట్లు సమాచారం. కానీ, అధికారుల దృష్టిలో మాత్రం ఇతడు మైనింగ్‌ మాఫియా సభ్యుడు. నాగరాజు 4,508 టన్నుల తెల్లరాయిని మింగేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. 

10.నిరుపేద.. 51 వేల టన్నుల రాయిని మింగేశాడంటున్నారు 
దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓర్సు వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. గతంలో క్వారీలో కూలీ పనులు చేసుకుని జీవించేవాడు. ఇతడు చిన్న ఇల్లు తప్ప సెంటు పొలం కూడా లేని పేద కుటుంబానికి చెందినవాడు. ఓర్సు వెంకటేశ్వర్లు రూ.6 కోట్ల విలువైన 51,000 టన్నుల తెల్లరాయిని దోచేశాడంటూ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. 

11.సాధారణ కూలీపై కేసు నమోదు 
దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వేముల శ్రీనివాసరావు మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఇతడికి చిన్న ఇల్లు తప్ప సెంటు భూమి కూడా లేదు. క్వారీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఇతడు రూ.5 కోట్ల విలువైన 40,000 టన్నుల సున్నపు రాయిని దోచేశాడని నిర్ధారించిన మైనింగ్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

12.కమిటీ సభ్యుడు కావడంతో కేసు 
దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వేముల ఏడుకొండలు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఇతడికి చిన్న ఇల్లు మినహా సెంటు సొంత భూమి కూడా లేదు. గతంలో క్వారీల్లో కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేత బత్తుల నరసింహారావు అధ్యక్షుడిగా ఏర్పడిన వడ్డెర సొసైటీలో సభ్యుడిగా చేరాడు. ఇతడు 2,400 టన్నుల సున్నపురాయిని దోచుకున్నాడంటూ కేసు పెట్టారు. కేవలం వడ్డెర సొసైటీలో కమిటీ సభ్యుడిగా ఉన్నందుకు ఒత్తిడి చేసి అక్రమ మైనింగ్‌ కేసులో ఇరికించినట్లు తెలుస్తోంది. 

13.ట్రాక్టర్‌ నడుపుకునే వ్యక్తిపై కేసు 
దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఈర్ల వెంకట్రావు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. ఉండడానికి చిన్న ఇల్లు తప్ప వ్యవసాయ భూమి కానీ, సెంటు స్థలం కానీ లేవు. బ్యాంకు రుణంతో రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేసి, క్వారీల్లో బాడుగకు పెట్టి నడిపిస్తున్నాడు. ఇతడు 9,600 టన్నుల సున్నపురాయిని దోచేశాడని నిర్ధారించిన మైనింగ్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement