యరపతినేని అక్రమ మైనింగ్‌పై కేంద్ర దర్యాప్తు కోరవచ్చుగా? | High Court questioned the state government on Yarapatineni Illegal mining | Sakshi
Sakshi News home page

యరపతినేని అక్రమ మైనింగ్‌పై కేంద్ర దర్యాప్తు కోరవచ్చుగా?

Published Tue, Aug 27 2019 4:32 AM | Last Updated on Tue, Aug 27 2019 9:31 AM

High Court questioned the state government on Yarapatineni Illegal mining - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి అమరావతి బ్యూరో: టీడీపీ నేత, గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను మీరే ఎందుకు కోరకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో గురువారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసి తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ యరపతినేని శ్రీనివాసరావు స్థానిక నేతలతో కలిసి పిడుగురాళ్ల, నడికుడి, కేశానుపల్లి, దాచేపల్లి, కొండ మోడులతో పాటు మరికొన్ని గ్రామాల్లో ఎటువంటి అనుమ తులు తీసుకోకుండా అక్రమంగా సున్నపురాయి తవ్వకాలు చేస్తున్నారని, అలాగే రూ.31 కోట్ల మేర ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ ఛార్జీలు ఎగవేశారంటూ గతంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.

ఈ వ్యవహారంలో ఇప్పటివరకు సీఐడీ దర్యాప్తునకు సంబంధించిన వివరాలతో ఓ నివేదికను అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ సీల్డ్‌ కవర్‌లో ధర్మాసనం ముందుంచారు. నిబంధనలకు విరుద్ధంగా యరపతినేని భారీ ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని తేలిందని ఏజీ చెప్పారు. ఈ వ్యవహారంలో 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 24 మంది సాక్షులను విచారించి, వారి వాంగ్మూలాలను నమోదు చేశామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. దర్యాప్తు వేగంగా ఎందుకు సాగడం లేదని ప్రశ్నించింది. పలు శాఖల సమన్వయంతో దర్యాప్తు జరుగుతోందని, మనీలాండరింగ్‌ కోణంలో కూడా దర్యాప్తు జరపాల్సి ఉందని శ్రీరామ్‌ వివరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేస్తే సాంకేతిక అంశాల్లో కూడా వేగంగా దర్యాప్తు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేయాలని ఎందుకు కోరకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టులో ఈ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా, తాము అలా కోరడం సబబు కాదని ఏజీ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడానికి తమ ముందున్న వ్యాజ్యమే అడ్డమని భావిస్తే, ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.  

అక్రమార్కులకు శిక్ష తప్పదు
–కాసు మహేశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ గురజాల ఎమ్మెల్యే
 అక్రమ మైనింగ్‌ ద్వారా అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డ వ్యక్తికి శిక్ష తప్పదు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలి. మనీలాండరింగ్, అక్రమ ఆస్తులు తదితర అంశాలపై లోతుగా విచారణ చేయాలి. వ్యవస్థలను భ్రష్టు పట్టించి అడ్డగోలుగా సంపాదించినవారు చట్టం నుంచి తప్పించుకోలేరు.

ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది
–టీజీవీ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డవారు చట్టానికి అతీతులు కాదు. వీరి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కోర్టులో న్యాయం జరిగి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభిస్తుంది. తద్వారా గ్రామాలకు మైనింగ్‌ సెస్‌ వచ్చి అవి అభివృద్ధి చెందుతాయి. 

యరపతినేని అక్రమ మైనింగ్‌ కేసు పూర్వాపరాలివీ..
– టీడీపీ ప్రభుత్వ పెద్దల అండతో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని కోనంకి, కేశానుపల్లి, నడికుడి, తదితర క్వారీల్లో 96 లక్షల టన్నుల తెల్ల సున్నపురాయిని లీజులు తీసుకోకుండా, పర్మిట్లు లేకుండా అక్రమంగా తవ్వుకున్న నాటి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
– ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ, పెనాల్టీ చెల్లించకుండా రూ.536 కోట్ల దోపిడీ
– అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో 2015లో పిల్‌ దాఖలు చేసిన గురజాలకు చెందిన కె.గురవాచారి
– అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని, అక్రమంగా తరలించిన ఖనిజానికి రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయాలని 2016లో ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు 
– అసలు నిందితుడు యరపతినేనిని వదిలేసి అనామకులైన నలుగురిపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్న మైనింగ్‌ అధికారులు
– ఎంత ఖనిజాన్ని అక్రమంగా తరలించారో లెక్కపెట్టని వైనం. రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయకుండా నిర్లక్ష్యం
– అక్రమ మైనింగ్‌లో యరపతినేని హస్తాన్ని ధ్రువీకరించిన లోకాయుక్త
– హైకోర్టు, లోకాయుక్త ఆదేశాలను టీడీపీ సర్కార్‌ తేలికగా తీసుకోవడంతో అక్రమ మైనింగ్‌పై శాటిలైట్‌ చిత్రాల ద్వారా ఆధారాలు సేకరించి 2016లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి
– గతేడాది హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు తీవ్రతను తగ్గించేందుకు సీఐడీకి అప్పగించిన టీడీపీ సర్కార్‌
– 33 లక్షల టన్నుల తెల్ల సున్నపురాయి అక్రమ మైనింగ్‌ జరిగినట్లు, రాయల్టీ, పెనాల్టీ రూపంలో రూ.156 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు తేల్చిన భూగర్భ గనుల శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement