మైనింగ్ మాఫియా ఒంట్లో వణుకు మొదలైంది. అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరులను కొల్లగొట్టిన ఘనుల బండారం బట్టబయలవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకపర్వానికి తెర తీసిన అక్రమార్కులకు కళ్లెం పడబోతోంది. చట్టాలను తుంగలో తొక్కి పచ్చ చొక్కాలకు సలాం కొడుతూ గులాంగిరి చేసిన అధికారులను నడిరోడ్డుపై నిలబెట్టనుంది. పల్నాడు ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగించిన మైనింగ్ దందా గుట్టురట్టవుతోంది. యరపతినేనితో సహా ఆయనకు సహకరించిన పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికార యంత్రాంగానికి ఉచ్చు బిగుస్తోంది. ఈ మేరకు పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
సాక్షి, గుంటూరు: మైనింగ్ మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. అక్రమ మైనింగ్‌కు పాల్పడి ప్రకృతి సంపదను దోచుకున్న వాళ్లపై కేసుల రూపంలో ఉచ్చు బిగుస్తోంది. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. చట్టాలను తమ చుట్టాలుగా భావిస్తూ తప్పుల మీద తప్పుల చేస్తూ పోయిన పచ్చపార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయని అందరూ అంటున్నారు. అక్రమ మైనింగ్‌పై 2015లో హైకోర్టును ఆశ్రయించినందుకుగాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అప్పటి సీఐ హనుమంతరావు, ఎస్సై, కానిస్టేబుళ్లు, అప్పటి ఆర్డీవో, మైనింగ్ ఏడీలు తనను వేధింపులకు గురిచేసి, చంపాలని చూశారని వైఎస్సార్ సీపీ నాయకుడు కుందుర్తి గురువాచారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు యరపతినేని సహా 12 మందిపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో సంచలనంగా మారింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి, పిడుగురాళ్ళ మండలం కోనంకి గ్రామాల్లో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగింది. రూ.వేల కోట్ల విలువ చేసే లైమ్ స్టోన్ (సున్నం రాయి) నిక్షేపాలు అప్పటి ఎమ్మెల్యే యరపతినేని అండదండలతో మైనింగ్ మాఫియా కొల్లగొట్టిందన్న ఆరోపణలున్నాయి.
దర్యాప్తు ప్రారంభం..
యరపతినేని, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు వ్యతిరేకంగా అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో పిల్ (ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం) వేసిన కోపంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు, రౌడీలు, సీఐ హనుమంతరావు, ఎస్సై, కానిస్టేబుళ్లతో మానసికంగా, శారీరకంగా వేధించి చంపేందుకు యత్నించారని గురువాచారి ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో యరపతినేని సహా 12మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. 2016లో గురువాచారిని వేధింపులకు గురిచేసిన ఘటనపై ఇటీవల కేసు నమోదు కావడంతో మైనింగ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అరెస్టుల భయం..
పల్నాడు ప్రాంతంలో గత ఐదేళ్లలో జరిగిన అక్రమ మైనింగ్‌కు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి అరెస్ట్ భయం పట్టుకుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. అక్రమ మైనింగ్ కేసులో సీబీసీఐడీ అధికారులు తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని ఇప్పటికే యరపతినేని శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై మరో కేసు నమోదవడంపై యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన చెందుతున్నారని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment