ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియాకు హైకోర్టు షాక్‌  | High Court Shocking Verdict To Trans Strai India | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 20 2018 1:27 AM | Last Updated on Thu, Dec 20 2018 1:27 AM

High Court Shocking Verdict To Trans Strai India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ సభ్యులు రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియాకు హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. ఇచ్చిన రుణాలను రాబట్టుకునేందుకు ట్రాన్స్‌ట్రాయ్‌కి చెందిన ఆస్తులను ఆంధ్రా బ్యాంకు వేలం వేయడాన్ని సవాలు చేస్తూ ఆ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్‌ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఆంధ్రాబ్యాంకు వేలం చర్యలను సమర్థించింది. తీసుకున్న రూ.584 కోట్ల రుణానికి ట్రాన్స్‌ట్రాయ్‌ హామీగా ఉంచిన ఆస్తులను సర్ఫేసీ చట్టంకింద వేలం వేసుకోవచ్చునని ఆంధ్రా బ్యాంకుకు స్పష్టం చేసింది. రుణాలను రాబట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతోనే ఆంధ్రాబ్యాంకు చివరకు సర్ఫేసీ చట్టం కింద చర్యలు ప్రారంభించిందని, అందువల్ల వాటిని తప్పుపట్టలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ)కి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేయడానికి ముందే ఆంధ్రా బ్యాంకు వేలం చర్యలను ప్రారంభించిందని తెలిపింది. అందువల్ల ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల నేపథ్యంలో ట్రాన్స్‌ట్రాయ్‌ ఆస్తుల క్రయ విక్రయాలపై మారటోరియం ఉన్నప్పటికీ వేలం వేసుకునే హక్కు ఆంధ్రాబ్యాంకుకు ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎన్‌సీఎల్‌టీ జారీ చేసిన సీఐఆర్‌పీ ఆదేశాలు అమల్లో ఉండగా, తాము హామీగా ఉంచిన ఆస్తుల వేలానికి చర్యలు తీసుకోవడం చట్ట విరుద్ధమంటూ చెరుకూరి శ్రీధర్‌ మూడు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. 

ప్రత్యామ్నాయాలు చేసుకోవాల్సిందే... 
సీఐఆర్‌పీ అమల్లో ఉండగా ఆంధ్రా బ్యాంకు వేలం నిర్ణయం వల్ల మిగిలిన బ్యాంకులు నష్టపోతాయన్న ట్రాన్స్‌ట్రాయ్‌ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. 2017 డిసెంబర్‌ 31 నాటికి బకాయిలు చెల్లించలేకపోతే ట్రాన్స్‌ట్రాయ్‌ విషయంలో కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు వెళ్లాలంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇచ్చిన ఉత్తర్వులకు చట్టబద్ధత లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక చట్టం కింద ఇచ్చే ఉత్తర్వులు మరో చట్ట నిబంధనలను అతిక్రమించేలా ఉండరాదని తెలిపింది. రుణాలను రాబట్టుకునే దిశగా రుణదాతల ఉమ్మడి వేదిక (జేఎల్‌ఎఫ్‌) 2017 డిసెంబర్‌లో జరిపిన ప్రయత్నాలు, చర్చలు విఫలమయ్యాయంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు రుణ బకాయిల వసూలుకోసం ఇతర ప్రత్యామ్నాయాలను అనుసరించడంలో ఎటువంటి తప్పు లేదంది. ఆంధ్రా బ్యాంకు సైతం సర్ఫేసీ చట్టం కింద అటువంటి ప్రత్యామ్నాయాలనే ఎంచుకుందని తెలిపింది. ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన సీఐఆర్‌పీ ఆదేశాలకు ముందే ఆంధ్రా బ్యాంకు వేలం ప్రక్రియను ప్రారంభించినందున ఆ బ్యాంకు చర్యల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. 

14 బ్యాంకులు.. రూ.2,687 కోట్ల నిరర్థక ఆస్తులు 
ఇదే సమయంలో ఆ కంపెనీ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, ఆర్‌బీఐ వాటిని నిరర్థక ఆస్తులుగా ప్రకటించడం గురించి కూడా ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ట్రాన్స్‌ట్రాయ్‌ 14 బ్యాంకుల నుంచి భారీస్థాయిలో రుణాలు తీసుకుందని, 2014–16 సంవత్సరాల మధ్యలో రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో రిజర్వ్‌ బ్యాంక్‌ వాటిని నిరర్థక ఆస్తులుగా ప్రకటించిందని తెలిపింది. 14 బ్యాంకుల్లో ట్రాన్స్‌ట్రాయ్‌కు రూ.2687.13 కోట్ల నిరర్థక ఆస్తులున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించినట్లు పేర్కొంది. కెనరా బ్యాంకు రూ.273.12 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.227.50 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.419.68 కోట్లు, యూకో బ్యాంకు రూ.60.64 కోట్లు, ఆంధ్రా బ్యాంకు రూ.293.61 కోట్లు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.232.63 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.172.79 కోట్లు, దేనా బ్యాంకు రూ.123.50 కోట్లు, అలహాబాద్‌ బ్యాంక్‌ రూ.246.23 కోట్లు, విజయ బ్యాంకు రూ.15 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకు రూ.298.14 కోట్లు, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు రూ.80 కోట్లు, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.124.94 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రూ.119.95 కోట్లు. బ్యాంకుల నుంచి తీసుకున్న ఈ రుణాలకు ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా పలు ఆస్తులను తాకట్టుపెట్టింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement