ఏపీ సర్కార్ అప్పీల్‌పై నేడే తీర్పు | high court verdict on AP government's appeal in roja suspension issue | Sakshi
Sakshi News home page

ఏపీ సర్కార్ అప్పీల్‌పై నేడే తీర్పు

Published Tue, Mar 22 2016 5:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఏపీ సర్కార్ అప్పీల్‌పై నేడే తీర్పు - Sakshi

ఏపీ సర్కార్ అప్పీల్‌పై నేడే తీర్పు

రోజా సస్పెన్షన్ వ్యవహారంపై హైకోర్టులో ముగిసిన వాదనలు
 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర శాసన సభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సస్పెన్షన్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. మంగళవారం ఉత్తర్వులు వెలువరిస్తామని న్యాయస్థానం వెల్లడించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రోజాను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి అప్పీల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వానికి సంబంధం లేదు: ఇందిరా జైసింగ్
అప్పీల్‌పై విచారణ సందర్భంగా రోజా తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. శాసన వ్యవహారాల ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ విచారణార్హతపై తమకు అభ్యంతరాలున్నాయని చెప్పారు. రోజాను స్పీకర్ సస్పెండ్ చేస్తే ప్రభుత్వం ఎలా అప్పీల్ దాఖలు చేస్తుందని ప్రశ్నిం చారు. శాసనసభ చర్యలకు, ప్రభుత్వానికి ఏ సంబంధం లేదన్నారు. రోజా వ్యవహారం సభకు సంబంధించినదే తప్ప, ప్రభుత్వానికి కాదన్నారు.

అంతేకాక రోజా సస్పెన్షన్ ఉత్తర్వులను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను శాసనసభ అమలు చేయడం లేద ని ఆక్షేపించారు. ఈ విషయంలో ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రూల్ 340(2) కింద ఏడాదిపాటు సస్పెండ్ చేయడం సరికాదని సింగిల్ జడ్జి చెప్పారని గుర్తుచేశారు. అలాగే సభకు హాజ రయ్యే హక్కు రోజాకు ఉందని, ఆ హక్కును కాలరాయలేరని కూడా చెప్పారని తెలిపారు. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సమతూకంతో మధ్యంతర ఉత్తర్వు లిచ్చారని, అందులో ధర్మాసనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

మేం గొప్పో.. కోర్టు గొప్పో అన్నట్లు వ్యవహరిస్తున్నారు
దీనికి ధర్మాసనం స్పందిస్తూ... సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా రోజాను సభలోకి అనుమతించాలని చెప్పలేదు కదా? అని ప్రశ్నించింది. రోజా శాసనసభ్యురాలని, ఆమెకు సభా కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ఉందని సింగిల్ జడ్జి చెప్పారని జైసింగ్ తెలిపారు. తదుపరి చర్యలు తీసుకునేందుకు సింగిల్ జడ్జి అవకాశం ఇచ్చారు కదా? అని ధర్మాసనం వ్యాఖ్యానించగా... అందుకే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమతూకంగా ఇచ్చిన ఉత్తర్వులుగా చెబుతున్నానని ఇందిరా జైసింగ్ వివరించారు. అధికార పార్టీ వారు ఈ వ్యవహారాన్ని ఓ యుద్ధంగా చూస్తున్నారని, కోర్టు గొప్పో, శాసనసభ గొప్పో చూస్తామన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వారి ప్రవర్తన ఈ అప్పీల్ కొట్టివేతకు కారణం కావాలన్నారు.

రూల్ 340(2)ని తప్పుగా ప్రస్తావించామని న్యాయవాది చెబుతున్నారే తప్ప, శాసనసభ చెప్పడం లేదన్నారు. తప్పు చేశామని సభ భావిస్తే దానిని సరిదిద్దుకోవచ్చని అన్నారు. రూల్ 340(2) కింద చేసిన సస్పెన్షన్‌ను రద్దు చేసి, తిరిగి నిబంధనల మేరకు వ్యవహరించే అధికారం సభకు ఉందని ఆమె వివరించారు. ఒకవేళ 194(3) కింద చర్యలు తీసుకున్నారని అనుకున్నా, ముందుగా రోజాకు నోటీసులు ఇచ్చి ఆమె వాదనలు విన్నాకే సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకోవాలన్నారు.

సభకున్న అధికారం ఎక్కడికీ పోదు..
అంతకు ముందు శాసన వ్యవహారాలశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.పి.రావు వాదనలు వినిపించారు. సభా నాయకుడిని ఉద్దేశించి రోజా అభ్యంతరకర పదజాలం ఉపయోగించారని, సభా గౌరవాన్ని దిగజార్చారని, ఈ నేపథ్యంలోనే ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడిందన్నారు. ఓ నిబంధనను తప్పుగా ప్రస్తావించినంత మాత్రాన సభకున్న అధికారం పోదన్నారు. చూడాల్సింది నిబంధనను కాదని, అధికారాన్ని మాత్రమేనన్నారు. నిబంధనను తప్పుగా ప్రస్తావించడమన్నది అక్రమమవుతుందే(ఇర్రెగ్యులారిటీ) తప్ప, చట్టవిరుద్ధమైనది (ఇల్లీగాలిటీ) కాదని వివరించారు.  

నిబంధనలకు లోబడే వాక్ స్వాతంత్య్రపు హక్కు
ఒకవేళ రూల్ 340(2) కింద సస్పెన్షన్ సరి కాదనుకుంటే అధికరణలు 194(3), 212 కింద సభకు అధికారాలు ఉన్నాయని పి.పి.రావు తెలిపారు. రోజా సస్పెన్షన్ నిర్ణయం శాసనసభదే తప్ప, స్పీకర్‌ది కాదని చెప్పారు. కేవలం ఒక సెషన్‌కు మాత్రమే కాక అంతకన్నా ఎక్కువ కాలానికి సస్పెండ్ చేసే అధికారం సభకు ఉందని వివరించారు. శాసనసభలో సభ్యుల వాక్ స్వాతంత్య్రపు హక్కు సభ నిబంధనలకు లోబడి ఉంటుందని, నిబంధనలను కాలరాస్తూ మాట్లాడేందుకు ఎవరికీ అధికారం లేదని పి.పి.రావు పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 18న రోజాను సస్పెండ్ చేస్తే, ఆమె 2016 ఫిబ్రవరిలో హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు.

ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సస్పెన్షన్ తరువాత సభ లేదు కాబట్టి ఆమె వెంటనే కోర్టుకు రాలేకపోయి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. దీనిపై ఇందిరా జైసింగ్ స్పందిస్తూ... సస్పెన్షన్ కాపీ తమకు ఇవ్వలేదని, వినతిపత్రాలు సమర్పించి సస్పెన్షన్ కాపీ కోసం ఎదురుచూశామని తెలిపారు. సస్పెన్షన్ కాపీ ఎందుకు ఇవ్వలేదని ధర్మాసనం ప్రశ్నించింది. సస్పెన్షన్ రోజా సమక్షంలోనే జరిగిందని, అందువల్ల కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదని పి.పి.రావు బదులిచ్చారు.

అప్పుడే క్షమాపణ చెప్పి ఉంటే...
ఘటన జరిగిన రోజునే రోజా క్షమాపణలు చెప్పి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదని పి.పి.రావు అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... ఇప్పుడు క్షమాపణ చెప్పేందుకు రోజా సిద్ధమా? అని ఇందిరా జైసింగ్‌ను ప్రశ్నించింది. ఇప్పుడా పరిస్థితిలేనే లేదని, వారు అహం (ఇగో)తో వ్యవహరిస్తున్నారని జైసింగ్ తెలిపారు. ధర్మాసనం జోక్యంతోనే తమకు ఇదే కోర్టులో సస్పెన్షన్ ఉత్తర్వుల కాపీ ఇచ్చారని గుర్తుచేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... సింగిల్ జడ్జి తన ఉత్తర్వుల్లో స్పీకర్ అధికారాలకు, సభ అధికారాలకు మధ్య తేడాను స్పష్టంగా చెప్పారు కదా? అని పి.పి.రావును ప్రశ్నిం చింది.

సింగిల్ జడ్జి అలా చెప్పలేదని పి.పి.రావు బదులివ్వడంతో.. అయితే సింగిల్ జడ్జిది తప్పంటారా? అని తిరిగి ప్రశ్నించింది. నిబంధనను తప్పుగా ప్రస్తావించడాన్ని సింగిల్ జడ్జి చట్ట విరుద్ధమన్నారని, ఇది సరికాదని పి.పి.రావు అన్నారు. రోజా సస్పెన్షన్‌కు శాసన వ్యవహారాల మంత్రే తీర్మానం ప్రవేశపెట్టారని, దానివల్లే ఆమె సస్పెన్షన్‌కు గురయ్యారని, కాబ ట్టి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది.
 
కాల్‌మనీ అత్యంత దారుణం: ధర్మాసనం
కాల్‌మనీ వ్యవహారంపై డిసెంబర్ 17న రోజా సభలో చర్చకు పట్టుపట్టారని ఇందిరా జైసింగ్ తెలిపారు. వాయిదా తీర్మానం కూడా ఇచ్చారని చెప్పారు. ఆ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని వివరించారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు తాము ఇచ్చిన రుణం తీర్చలేని వారిని రుణం బదులు వారింట్లోని ఆడవాళ్లను పంపని ఆడుగుతున్నారని, అత్యంత దుర్మార్గమైన ఈ వ్యవహారంలో చర్చకు రోజా పట్టుపట్టారని ఆమె కోర్టుకు నివేదించారు.

 

దీనికి ధర్మాసనం స్పందిస్తూ... మీరు చెబుతున్నది నిజమైతే ఈ కాల్‌మనీ వ్యవహారం అత్యంత దారుణమైందంటూ వ్యాఖ్యానించింది. రోజా పదేపదే చర్చ కోసం డిమాండ్ చేస్తుండడంతో ఆమె సస్పెన్షన్ కోసం శాసన వ్యవహారాల మంత్రి రూల్ 340(2) కింద తీర్మానం ప్రవేశపెట్టారని జైసింగ్ తెలిపారు. ఎవరిని సస్పెండ్ చేస్తున్నారో వారి పేరును స్పీకర్ నిబంధనల ప్రకారం ప్రస్తావించాలని, అయితే రోజా పేరును స్పీకర్ ప్రస్తావించలేదని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement