రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేస్తున్న 60 ఏళ్ల పదవీ విరమణ పెంపు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు తదితర చోట్ల పనిచేసే ఉద్యోగులకు వర్తించదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ సంచితనిధి (కాన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి జీతాలు చెల్లించడం లేదని, అందువల్ల వారు ప్రభుత్వ ఉద్యోగుల నిర్వచన పరిధిలోకి రారని స్పష్టం చేసింది.
అయితే హైకోర్టు ఈ వాదనల పట్ల కొంత సందేహం వ్యక్తం చేస్తూ, ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారికి కూడా 60 ఏళ్ల పదవీ విరమణ పెంపును వర్తింప చేయాలని తాము ఆదేశాలిస్తే వారు పొందాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నింటికీ పూర్తి బకాయిలతో సహా చెల్లిస్తారో లేదో తెలుసుకుని చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ను కోరింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు పలువురు న్యాయమూర్తుల ముందు పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలన్నింటినీ కూడా తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
అంతేకాక కార్పొరేషన్లకు సంబంధించిన సర్వీసు నిబంధనల వివరాలను తమ ముందుంచాలని అటు పిటిషనర్లు, ఇటు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు 60 ఏళ్ల పదవీ విరమణ పెంపును వర్తింప చేయకపోవడాన్ని సవాలు చేస్తూ పునర్‌విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ (ఏపీఐడీసీ) వంటి పలు సంస్థలకు చెందిన ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన వేదుల శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పదవీ విరమణ పెంపును వర్తింప చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్ల విషయంలో వివక్ష చూపుతోందన్నారు. తమకూ పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని తెలిపారు. పెపైచ్చు తమకు ఈ పదవీ విరమణ పెంపు వర్తించదంటూ తాజాగా జీవో జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తరువాత ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, 9, 10 షెడ్యూల్‌లోని సంస్థలకు ప్రభుత్వ సంచితనిధి నుంచి జీతాలు చెల్లించడం లేదని, అందువల్ల వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం సాధ్యం కాదన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల విభజన జరగలేదని, అందువల్ల పాలకమండళ్ల ఏర్పాటు కూడా జరగలేదన్నారు. ఈ కార్పొరేషన్లు వీసీ, ఎండీల పాలనలో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి వారు 60 ఏళ్ల పదవీ విరమణ పెంపును వర్తింప చేసుకుంటూ తీర్మానాలు చేసుకున్నారని, అయితే వాటికి చట్ట ప్రకారం విలువ లేదని తెలిపారు. కార్పొరేషన్లలో పాలక మండళ్లు మాత్రమే ప్రభుత్వ అనుమతితో సర్వీసు నిబంధనలకు సవరణలు చేయాలని, అప్పుడు మాత్రమే అవి చెల్లుబాటు అవుతాయని కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఏజీ లేవనెత్తిన కొన్ని అంశాలపై సందేహం వ్యక్తం చేసింది. ఏజీ పాలక మండళ్లు ఏర్పాటు కాలేదంటున్నారని, అలాంప్పుడు వీసీ, ఎండీలు సర్వీసు నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేయవచ్చా? చేస్తే చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతాయా? కావా? అంటూ సందేహం వ్యక్తం చేసింది.
అదే అంశంపై హైకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయని, కొన్నింటినీలో పిటిషనర్లకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చామని గుర్తు చేసింది. ఒకవేళ పిటిషనర్లు అంతిమంగా ఈ వ్యాజ్యాల్లో విజయం సాధించి, వారు ఇంకా 60 ఏళ్ల లోపు వయస్సు వారైతే వారికి దక్కాల్సిన ఆర్ధిక ప్రయోజనాలన్నింటినీ పూర్తి బకాయిలతో సహా వారికి చెల్లించి, సర్వీసులోకి కూడా తీసుకుంటారా అంటూ ఏజీని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఏజీకి స్పష్టం చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.