ఇదేం ‘వడ్డి’ంపు ? | High court slams Bankers loans interest | Sakshi
Sakshi News home page

ఇదేం ‘వడ్డి’ంపు ?

Published Sat, Jan 11 2014 4:18 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ఇదేం ‘వడ్డి’ంపు ? - Sakshi

ఇదేం ‘వడ్డి’ంపు ?

 - డిపాజిట్లపై ఇచ్చేది తక్కువ, రుణాలపై వసూలు ఎక్కువా?  
- ఈ వ్యత్యాసంపై వివరణివ్వండి   
- ఆర్‌బీఐకి హైకోర్టు ఆదేశం

 
 బ్యాంకుల తీరుతో మరోసారి రుణం లభించే అవకాశాలు కరువవుతున్నాయని వినియోగదారులు చేస్తున్న ఫిర్యాదులపై కూడా విచారణ చేపడతాం
 - హైకోర్టు ధర్మాసనం
 
 సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లపై చెల్లించే వడ్డీ తక్కువగా, రుణాలపై వసూలు భారీగా ఉండటంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. వడ్డీ చెల్లింపు, వసూళ్ల మధ్య ఎందుకింత భారీ వ్యత్యాసం ఉంటుందో వివరణ ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ చల్లా కోదండరాంలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసింది. ఒకటీ రెండు వాయిదాలు చెల్లించనంత మాత్రానే బ్యాంకులు ఈ విషయాన్ని ఆర్‌బీఐ, సిబిల్ దృష్టికి తీసుకెళుతున్నాయని, దీనివల్ల తమకు మరోసారి రుణం లభించే అవకాశాలు కరువవుతున్నాయని వినియోగదారులు చేస్తున్న ఫిర్యాదులపై కూడా విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
 
 వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రుణం చెల్లిస్తామన్నా తమ ఆస్తులను ఇండియన్ బ్యాంక్ వేలం వేయడానికి సిద్ధపడటాన్ని సవాలు చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన బెజవాడ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది సీవీ భాస్కర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, 2012లో బ్యాంకు తమ రుణాన్ని సర్దుబాటు చేసిందని, వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ. 6 కోట్లు చెల్లించేందుకు తాము సిద్ధపడినా బ్యాంకు అంగీకరించట్లేదని ధర్మాసనానికి నివేదించారు. రుణం కోసం తాకట్టు పెట్టిన ఆస్తి విలువ తాము చెల్లించే మొత్తాని కన్నా ఎక్కువ ఉంటుందనే తమ ప్రతిపాదనను బ్యాంకు తిరస్కరించిందని వివరించారు. దీనిపై డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ)ను ఆశ్రయించామని... అయితే అక్కడ బ్యాంకే వాయిదా కోరి, తిరిగి ఆస్తుల వేలం నిమిత్తం తమకు నోటీసులు జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
 
 దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఇంతకీ వడ్డీ ఎంతమేర వసూలు చేస్తున్నారని ప్రశ్నించింది. ఏడాదికి 14.75 నుంచి 15.75 శాతం వసూలు చేస్తున్నారని భాస్కర్‌రెడ్డి చెప్పారు. దీంతో బ్యాంకులు డిపాజిట్లపై తక్కువ వడ్డీ ఇవ్వడం, రుణాలపై ఎక్కువ వడ్డీ వసూలు చేయడాన్ని గమనించిన ధర్మాసనం... ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందో వివరణ ఇవ్వాలని ఆర్‌బీఐను ఆదేశించింది. ఇందుకుగాను ఈ వ్యాజ్యంలో ఆర్‌బీఐని ప్రతివాదిగా చేర్చింది. ఇండియన్ బ్యాంకు జారీ చేసిన వేలం నోటీసులను రద్దు చేసి, విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఇదే తరహా అభ్యర్థనతో శ్రీవెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. తమ బ్యాంకు ఖాతా స్థితి గురించి ఆర్‌బీఐ, సిబిల్‌కు తెలియచేయకుండా యూకో బ్యాంకును నియంత్రించాలని కోరింది. ఈ వ్యాజ్యంపై విచారణను కూడా ధర్మాసనం ఈనెల 31కి వాయిదా వేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement