సామాన్యుడికి సతాయింపులు.. టోపీ పెట్టేవారికి కోట్లు | High Court of Judicature at Hyderabad | Sakshi
Sakshi News home page

సామాన్యుడికి సతాయింపులు.. టోపీ పెట్టేవారికి కోట్లు

Published Fri, Dec 18 2015 4:03 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

సామాన్యుడికి సతాయింపులు.. టోపీ పెట్టేవారికి కోట్లు - Sakshi

సామాన్యుడికి సతాయింపులు.. టోపీ పెట్టేవారికి కోట్లు

సాక్షి, హైదరాబాద్: ‘‘సామాన్యులు లక్ష రూపాయలు రుణం అడిగితే సవాలక్ష ప్రశ్నలు, కొర్రీలు వేసి తమ చుట్టూ తిప్పుకునే బ్యాంకులు... కుచ్చు టోపీలు పెట్టేవారికి మాత్రం అడిగిన వెంటనే రుణాలు మంజూరు చేస్తుంటాయి..’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇలా కుచ్చుటోపీలు పెట్టి ప్రజాధనాన్ని దోచుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. తప్పుడు సేల్‌డీడ్లు, ఈసీలు సమర్పించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (వెస్ట్ వెంకటాపూర్ బ్రాంచ్)కు రూ. 1.03 కోట్ల మేర టోపీ పెట్టిన కేసులో ప్రధాన సూత్రధారి బస్తా వేణుగోపాల్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించిం ది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
పథకం ప్రకారం రుణాలు..
హైదరాబాద్‌కు చెందిన మథాడి విజయకుమార్ అనే వ్యక్తి గత ఏడాది బస్తా వేణుగోపాల్‌తో కలసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (వెస్ట్ వెంకటాపూర్ బ్రాంచ్)కు వెళ్లి తనకు రూ. 30 లక్షలు రుణం కావాలని కోరాడు. అధికారులు టైటిల్ డీడ్లు, ఈసీలు తీసుకుని విజయకుమార్ దంపతులకు రూ. 30 లక్షలు రుణం మంజూరు చేశారు. అయితే ఏడాది తరువాత తాజా ఈసీలు తెప్పించుకున్న బ్యాంకు అధికారులు.. విజయకుమార్ దంపతులు సమర్పించిన టైటిల్ డీడ్లు, ఈసీలు తప్పుడువని గుర్తించారు.

దీనిపై బ్యాంకు అధికారులు విజయకుమార్ దంపతులను సంప్రదించగా.. అవి తప్పుడు డాక్యుమెంట్లేనని అంగీకరించి, కొంత గడువిస్తే మొత్తం తిరిగి చెల్లిస్తామని అఫిడవిట్‌పై సంతకం చేశారు. ఆ తరువాత పరారయ్యారు. ఇదే తరహాలో బస్తా వేణుగోపాల్ ద్వారానే బాదం రమేష్‌రెడ్డి, బస్తా సాయికృష్ణ, గల్లా ప్రియాంక తదితరులు కూడా ఒక్కొక్కరు ఒక్కో నెల తేడాతో బ్యాంకును సంప్రదించి రుణం తీసుకున్నారు.

ఇలా నలుగురు కలిపి రూ.1.03 కోట్ల రుణం తీసుకుని ఎగవేశారు. దీనిపై బ్యాంక్ మేనేజర్ మందల పూర్ణిమ హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదయింది. వారంతా పరారీలో ఉన్నారు. అయితే ఈ రుణాలు తీసుకున్న నలుగురు వ్యక్తులను బ్యాంకుకు పరిచయం చేసిన బస్తా వేణుగోపాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై గురువారం విచారణ జరిగింది. ఈ కేసులో సూత్రధారి బస్తా వేణుగోపాలేనని, ముందస్తు బెయిల్ ఇవ్వరాదని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి న్యాయమూర్తికి నివేదించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘బ్యాంకు వాళ్లు అంతే. ఓ లక్ష రుణం ఇవ్వండని సామాన్యులు అడిగితే సవాలక్ష ప్రశ్నలు, కొర్రీలు వేస్తారు. ఆస్తులు, ఆదాయ వివరాలంటారు. ఆ పత్రాలు, ఈ పత్రాలు అంటారు.

చివరికి రుణం మాత్రం ఇవ్వరు. అదే కుచ్చుటోపీలు పెట్టే వారికి మాత్రం వారు అడిగీ అడగక ముందే రుణం ఇస్తారు..’’ అని వ్యాఖ్యానించారు. అయితే ప్రజాధనాన్ని ఈ విధంగా దోచుకునే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొంటూ.. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement