తెలుగు న్యాయవాదులపై కళంకిత ముద్రా? | Article On High Court And Appointments Of Chief Justices | Sakshi
Sakshi News home page

తెలుగు న్యాయవాదులపై కళంకిత ముద్రా?

Published Sun, Mar 10 2019 12:47 AM | Last Updated on Sun, Mar 10 2019 12:47 AM

Article On High Court And Appointments Of Chief Justices - Sakshi

తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, హైదరాబాద్‌ హైకోర్టు సిఫారస్‌ చేసిన 60 మంది న్యాయవాదులకి వ్యతిరేకంగా నివేదికలు ఉన్నాయని వార్తలొచ్చాయి. వారిపైన అవినీతి ఆరోపణలు, వృత్తిపరమైన చెడు నడవడిక ఆరోపణలు ఉన్నాయని అందుకని న్యాయవాదుల నుంచి న్యాయమూర్తుల నియామకంలో జాప్యం జరుగుతుందని, దీంతో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులని తిరిగి హైకోర్టు జడ్జీలుగా నియమించడం కోసం భారత ప్రధాన న్యాయమూర్తి, భారత రాష్ట్రపతిని కోరినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే ఆ అరవైమంది న్యాయవాదుల్లో అందరూ అవినీతిపరులూ, వృత్తిపరంగా చెడు నడవడిక కలిగి ఉన్నట్టుగా అభిప్రాయం వస్తోంది. ఈ 60 మందికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వకుండానే వాళ్లు అవినీతిపరులని ముద్ర వేస్తున్నారు. వాళ్లమీద మాయని మచ్చని వేస్తున్నారు. ఏ నివేదికల ఆధారంగా అలాంటి అభిప్రాయానికి వస్తున్నారో తెలియదు. ఇది ఎంతవరకు సమంజసం?

జనవరి 1, 2019న హైదరాబాద్‌ హైకోర్టు విడి పోయి ఆంధ్రప్రదేశ్, తెలం గాణ హైకోర్టులు ఏర్ప డ్డాయి. తెలంగాణ హైకో ర్టుకి 13 మంది న్యాయమూ ర్తులను కేటాయించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకి 11 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌.వి. బట్టీని కేరళ హైకో ర్టుకి బదిలీ చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆయన్ని బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం తిరిగి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మంజూరు చేసిన న్యాయమూర్తుల సంఖ్యకి సగం మంది మాత్రమే ఈ రెండు హైకోర్టుల్లో పని చేస్తు న్నారు. ఈ రెండు హైకోర్టులు ఏర్పడక ముందు ఉన్న హైదరాబాద్‌ హైకోర్టుకి చాలా కాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులే పదవీ బాధ్యతలు నిర్వర్తిం చారు. న్యాయమూర్తుల భర్తీకి వాళ్లు అవసరమైన చర్యలని తీసుకోలేదు. ఆ విధంగా ఖాళీలు పెరు గుతూ వచ్చాయి.

హైకోర్టు విడిపోకముందు కొంతమంది న్యాయ వాదుల పేర్లను జిల్లా జడ్జీల నుంచి మరికొంత మంది న్యాయమూర్తుల పేర్లను హైకోర్టు జడ్జీలుగా నియమించడానికి హైదరాబాద్‌ హైకోర్టు కొలీ జియం సిఫారస్‌ చేసింది. ఈ సిఫారస్‌ జరిగి నాలుగు మాసాలు గడిచింది. అవి ఏమైనాయో ఎవరికీ తెలి యదు. కాగా, ఓ నాలుగు రోజుల క్రితం టెలిగ్రాఫ్‌ దినపత్రికలో హైకోర్టు న్యాయవాదుల గురించి ఆందోళన కలిగించే వార్త ఒకటి కనిపించింది. ఆ వార్త ఆ తరువాత చాలా పత్రికల్లో దర్శనం ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, హైదరాబాద్‌ హైకోర్టు సిఫారస్‌ చేసిన 60 మంది న్యాయవాదులకి వ్యతి  రేకంగా నివేదికలు ఉన్నాయన్నది అందులోని ప్రధాన వార్తల సారాంశం. వారిపైన అవినీతి ఆరో పణలు, వృత్తిపరమైన చెడు నడవడిక ఆరోపణలు ఉన్నాయని అందుకని న్యాయవాదుల నుంచి న్యాయమూర్తుల నియామకంలో జాప్యం జరుగు తోందని, దీంతో రాజ్యాంగంలో అధికరణ 224ఎ ప్రకారం పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను తిరిగి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడం కోసం భారత ప్రధాన న్యాయమూర్తి, భారత రాష్ట్ర పతిని కోరినట్టుగా దినపత్రికల్లో వార్తలు వచ్చాయి.

హైకోర్టు న్యాయమూర్తులుగా, న్యాయవాదుల పేర్లను సిఫారస్‌ చేసినప్పుడు వాళ్ల పేర్లు దాదాపు అన్ని పత్రికల్లో దర్శనం ఇచ్చాయి. అంటే ఆ అరవై మంది న్యాయవాదుల్లో అందరూ అవినీతిపరులూ, వృత్తిపరంగా చెడు నడవడిక కలిగి ఉన్నట్టుగా ఒక అభిప్రాయం కలిగే విధంగా వార్త ఉంది. ఇది ఎంత వరకు సమంజసం? న్యాయమూర్తి నియామకం కోసం వాళ్లు దరఖాస్తు చేసుకోలేదు. వాళ్ల సమ్మతిని హైకోర్టు అడిగి ఉంటుంది. సమ్మతి ఇచ్చిన పాపానికి వాళ్లు ఈ ఆరోపణలు ఎదుర్కోవాలా?

క్రిమినల్‌ కేసుల్లో, శాఖాపరమైన కేసుల విచా రణలో వాటిని ఎదుర్కొంటున్న వ్యక్తి నేరం చేశాడా లేదా అనే విషయం గురించి మూడు సందర్భాలలో ప్రశ్నిస్తారు. శిక్ష గురించి కూడా ప్రశ్నిస్తారు. కానీ ఈ 60 మంది న్యాయవాదులకి అలాంటి అవకాశం ఇవ్వకుండానే వాళ్లు అవినీతిపరులని, వృత్తిలో చెడు నడవడిక కలిగి ఉన్నారని ముద్ర వేస్తున్నారు. వాళ్ల మీద మాయని మచ్చని వేస్తున్నారు. ఏ నివేదికల ఆధారంగా అలాంటి అభిప్రాయానికి వస్తున్నారో తెలియదు.

ఒక వ్యక్తి పేరు హైకోర్టు న్యాయమూర్తి పదవి నియామకానికి పరిశీలనలో ఉందని అంటే ఆయనకు ఎంతోమంది శత్రువులు పుట్టుకొస్తారు. తోటి న్యాయ వాదులు వారిపై ఏదో ఉత్తరాలు రాస్తారు. సంబం ధిత హైకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వారి అభిప్రాయాలను కూడా అడిగే సంప్రదాయం ఉంది. వాళ్లు హైకోర్టుని వదిలి చాలాకాలం అయి ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడి న్యాయవాదులని అంచనా వేయడానికి వారికి వారి దగ్గర ఉన్న పనిముట్టు ఏమిటీ? వాళ్ల దురభిప్రాయం కూడా కొలీజియం సిఫారస్‌ చేసిన న్యాయవాదుల మీద ఉంటుంది. బేరసారాలు ఉండవని అంటారు. అది కూడా వాస్తవం కాదని చాలామంది న్యాయమూ ర్తులు వ్యక్తిగత సంభాషణల్లో చెబుతూ ఉంటారు.

సీనియర్‌ న్యాయవాదులే కరువైనట్టుగా భావించి పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను రాజ్యాంగంలోని అధికరణ 224ఎ ప్రకారం నియ మించడానికి రాష్ట్రపతి అనుమతిని ప్రధాన న్యాయ మూర్తి కోరినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అవసరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భావించినప్పుడు రాష్ట్రపతి పూర్వానుమతి తీసుకొని తన హైకోర్టులోగానీ మరే దైనా హైకోర్టులోగానీ న్యాయమూ ర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన వ్యక్తిని తన హైకోర్టులో గౌరవ న్యాయమూర్తిగా నియమించు కునే వెసులుబాటుని అధికరణ 224ఎ కల్పిస్తుంది. రెగ్యులర్‌ న్యాయమూర్తులు ఉన్నప్పటికీ అధిక పనిభారం ఉన్నప్పుడు ఈ విధంగా నియమించుకో వడం సమంజసంగానీ, అనుమతించిన న్యాయ మూర్తులను నియమించకుండా ఈ అధికరణ కింద న్యాయమూర్తులను నియమించడం ఎంతమాత్రం అభిలషణీయం కాదు.

తెలంగాణ, ఏపీలో మంచి న్యాయవాదులు లేరన్న అభిప్రాయం ఈ వార్త ద్వారా కలుగుతుంది. అది వాంఛనీయం కాదు. న్యాయవాదుల నుంచి మంచి వ్యక్తులను ఎంపిక చేయాల్సిన బాధ్యత కొలీజియంలోని న్యాయమూర్తుల మీద ఉంటుంది. ఆయా హైకోర్టుల్లో పనిచేసి సుప్రీంకోర్టులో న్యాయ మూర్తులుగా పనిచేస్తున్న న్యాయమూర్తుల అభిప్రా యాలు కొలీజియంకు శిరోధార్యం కాదు. అందుకని వారి అభిప్రాయాలకు మరీ ఎక్కువ విలువ ఇచ్చి న్యాయవాదులను పక్కన పెట్టడం సరి కాదు.

న్యాయవాదుల నుంచి న్యాయమూర్తుల ఎంపికకి ఏవో అడ్డంకులు ఉన్నాయని అనుకుందాం. జిల్లా జడ్జీల నుంచి న్యాయమూర్తుల నియామకాలకి ఈ ఆటంకాలు లేవు. వారి నియామకాల్లో జాప్యానికి కారణం ఏమిటి? సుప్రీంకోర్టు కొలీజియం ఈ దిశగా ఆలోచిస్తుందని ఆశిద్దాం.


మంగారి రాజేందర్‌
వ్యాసకర్త గతంలో జిల్లా జడ్జీగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులుగా పనిచేశారు
మొబైల్‌ : 94404 83001

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement