రాంచీ: దాణా కుంభకోణం కేసుల్లో దోషి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్‌ను పొడిగించేందుకు కోర్టు నిరాకరించింది. ఈనెల 30వ తేదీలోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని లాలూను ఆదేశించింది. దాణా కుంభకోణానికి సంబంధించిన 4 కేసుల్లో లాలూ దోషిగా తేలడంతో ఆయనకు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించడం తెల్సిందే. జైలులో లాలూ అనారోగ్యానికి గురి కావడంతో చికిత్సకోసం బెయిలివ్వాలంటూ హైకోర్టును కోరారు. దీంతో మే 11న ఆయనకు 6 వారాల తాత్కాలిక బెయిలిచ్చింది. తర్వాత ఆ బెయిల్‌ను పొడిగించింది. తాజాగా మరో 3 నెలలపాటు బెయిల్‌ను పొడిగించాలంటూ లాలూ కోరారు. అందుకు హైకోర్టు జడ్జి నిరాకరించారు. అవసరమైనప్పుడు వైద్యం అందించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు, ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసులో లాలూ, ఆయన భార్య రబ్రీదేవిలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment