రాంచీ: 21 ఏళ్ల నాటి దాణా కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్‌యాదవ్‌కు సీబీఐ కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.10 లక్షల జరిమానా కూడా లాలూ చెల్లించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివ్‌పాల్‌సింగ్ శనివారం తీర్పునిచ్చారు. లాలూ జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు అదనంగా జైల్లో గడపాల్సి ఉంటుంది. ఆర్జేడీ చీఫ్ సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించారు. లాలూతోపాటుగా మరో 15 మంది దోషులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం శిక్ష ఖరారుకు సంబంధించిన వాదనలు ముగియగా.. నాలుగు గంటలకు న్యాయమూర్తి శివ్‌పాల్‌సింగ్ తీర్పు చెప్పారు. ‘ఇటువంటి దోషులకు ఓపెన్ జైలు సరిగా సరిపోతుంది. ఎందుకంటే వాళ్లకు గతంలో ఆవులను పెంచిన అనుభవం ఉంది’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. డిసెంబర్ 23నే వీరిని కోర్టు దోషులుగా గుర్తించినప్పటికీ మూడ్రోజులుగా శిక్షల ఖరారు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.
మరో 15 మందికీ శిక్షలు ఖరారు
మోసం, నేరపూరిత కుట్ర, తప్పుడు పత్రాల వినియోగంతో నిధుల విడుదలతోపాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద లాలూకు మూడున్నర ఏళ్ల జైలు శిక్ష విధించారని సీబీఐ న్యాయవాది వెల్లడించారు. అయితే, ఈ శిక్షను వచ్చే వారం జార్ఖండ్ హైకోర్టులో అప్పీలు చేయనున్నట్లు లాలూ తరపు న్యాయవాది చిత్తరంజన్ సిన్హా తెలిపారు. దేవ్‌గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో మరో 15 మందికీ ఐపీసీ, పీసీఏ (అవినీతి నిరోధక చట్టం) కింద ఆర్నెల్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షలను కూడా న్యాయమూర్తి ప్రకటించారు. కుంభకోణం జరిగిన సమయంలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా ఉన్న జగదీశ్ శర్మకు ఏడేళ్ల జైలు, రూ. 20 లక్షల జరిమానా, ఆర్జేడీ నేత ఆర్కే రాణాకు ఆర్నెల్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు బెక్ జూలియస్, ఫూల్‌చంద్ సింగ్, మహేశ్ ప్రసాద్‌లకు మూడున్నరేళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానాను న్యాయమూర్తి విధించారు. మాజీ ప్రభుత్వాధికారి కృష్ణ కుమార్‌కు ఏడేళ్ల జైలు, రూ. 20 లక్షల జరిమానా, మాజీ అధికారి సుబీర్ భట్టాచార్యకు మూడున్నరేళ్ల జైలు రూ. 10 లక్షల జరిమానా, సప్లయర్ మోహన్ ప్రసాద్‌కు ఏడేళ్ల జైలు, రూ. 10 లక్షల జరిమానా విధించారు. మిగిలిన వారికి కూడా దాదాపుగా ఇవే శిక్షలు పడ్డాయి.
చట్టం ముందు అందరూ ఒకటే!
లాలూ శిక్షపై బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్‌లు స్పందించాయి. చట్టం ముందు అందరూ సమానులేనని బీజేపీ నేత షానవాజ్ వ్యాఖ్యానించారు. ‘కోర్టు తన పని తాను చేసింది. దేశ సంపదను దోచుకునే వారికి ఇదో కీలకమైన గుణపాఠం. ఎట్టకేలకు బిహార్ ప్రజలకు న్యాయం జరిగింది’ అని షానవాజ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని.. రాజకీయ నేతలు ఇకపై తప్పు చేసేందుకు భయపడాల్సిందేనని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి పేర్కొన్నారు. లాలూ అరెస్టయినంత మాత్రాన ఆర్జేడీతో సంబంధాలు తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం తమ పోరాటం సాగుతుందని వెల్లడించింది. కాగా, బీజేపీ, నితీశ్ కుమార్ కుట్రపన్ని మరీ లాలూను జైలుకు పంపారని ఆర్జేడీ ఆరోపించింది. బెయిల్ కోసం హైకోర్టుకెళ్తామని లాలూ కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు.
జైలుకు రెండోసారి
దాణా కుంభకోణంలో లాలూ జైలు శిక్ష అనుభవించటం ఇది రెండోసారి. 21 ఏళ్ల క్రితం దేవగఢ్ ట్రెజరీ నుంచి రూ.89.27 లక్షల నిధులను అక్రమంగా తీసుకున్నారనే కేసుపై లాలూ జైలుకెళ్తుండగా.. దంకా ట్రెజరీ నుంచి రూ.3.97 కోట్లు, చైబాసా ట్రెజరీ నుంచి రూ.36 కోట్లు, దోరండా ట్రెజరీ నుంచి రూ. 184 కోట్లు అక్రమంగా కొల్లగొట్టారనే 3 కేసుల్లోనూ లాలూ విచారణ ఎదుర్కొంటున్నారు. 1996లో పట్నా హైకోర్టు దాణా స్కామ్‌పై విచారణకు ఆదేశించగా.. దేవ్‌గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో 1997, అక్టోబర్ 27న 38 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. కాలక్రమేణా 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు.
గడ్డిమేతకు మూడున్నరేళ్ల జైలు
Published Sun, Jan 7 2018 2:25 AM | Last Updated on Sun, Jan 7 2018 7:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment