న్యూఢిల్లీ: దాణా కుంభకోణం కేసులో లాలూతోపాటు 43 మందిని దోషులుగా నిర్ధారిస్తూ రాంచీ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతించగా, కాంగ్రెస్ ఆచితూచి స్పందించింది. 10 కోట్ల బీహార్ ప్రజల పక్షాన న్యాయం నిలిచిందని బీజేపీ పేర్కొంది. బీహార్ సీఎం నితీశ్‌కుమార్ తీర్పుపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని, ఇందులో ఎలాంటి వివక్ష ఉండదని కాంగ్రెస్ పేర్కొంది. జార్ఖండ్‌లో లాలూ పార్టీ ఆర్‌జేడీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈకేసులో చట్టం తనపని తాను చేసుకుపోయిందని కాంగ్రెస్ చెప్పింది. భవిష్యత్తులో ఆర్‌జేడీతో పొత్తు విషయంలో ఇప్పుడే ఇతమిత్థంగా చెప్పలేమంది. ‘భవిష్యత్తులో బీహార్‌లో, జార్ఖండ్‌లో ఆర్‌జేడీతో పొత్తుపై ఇప్పుడే స్పందించడం తొందరపాటవుతుంది. పొత్తు విషయంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. మాకెన్ స్పందనతో భవిష్యత్‌లో కాంగ్రెస్... లాలూకు చెందిన ఆర్‌జేడీతోగానీ లేదా ఆయన ప్రత్యర్థి పార్టీ అయిన జేడీయూ(ఎన్‌డీఏ మాజీ భాగస్వామి)తోగానీ పొత్తుపెట్టుకోవచ్చన్న ఊహాగానాలు చెలరేగాయి.
చరిత్రాత్మకం: రాజీవ్ ప్రతాప్ రూఢీ, బీజేపీ
‘ఈ తీర్పు చరిత్రాత్మకం. గత పదేళ్ల నుంచి యూపీఏ ప్రభుత్వంతో, ప్రధాని మన్మోహన్, సోనియా, రాహుల్‌గాంధీలతో రాజీ కుదుర్చుకొని రాజకీయంగా రాజీలు పడుతూ లాలూప్రసాద్ తనను తాను రక్షించుకుంటున్నట్లు అందరూ చూస్తున్నారు. ప్రభుత్వంతో ఉంటూ చట్టం నుంచి తప్పించుకొంటున్నారు. 2జీ, కామన్వెల్త్, రైల్‌గేట్, బొగ్గు కుంభకోణాల్లోనూ ఇలాంటి తీర్పే వస్తుందా?’
బాధాకరం: దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్
లాలూను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ఇవ్వడం బాధాకరంగా ఉంది. ఆయన పైకోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారన్న ఆశాభావం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతోకాలంగా నమ్మకమైన భాగస్వామి.
విశ్వసనీయతకు సవాల్: రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు
నాయకుల విశ్వసనీయతకు ఈ తీర్పు పెద్ద సవాల్‌లాంటిది. దీనిని బీజేపీ చాలెం జ్‌గా స్వీకరిస్తుంది. ప్రజలు అవినీతిరహిత రాజకీయాలను కోరుకుంటున్నారు.
అత్యాశకు పోయారు: శరద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు
అత్యాశకుపోయి ప్రజాధనాన్ని దోచుకున్నందుకు లాలూ తగిన మూల్యం చెల్లించుకున్నారు. అధికారాన్ని వ్యక్తిగతానికి వాడుకునే వారికి ఇదో గుణపాఠం.
ముగ్గురిపై ‘అనర్హత’ వేటు!
దోషులుగా నిర్ధారణ అయిన ఎంపీలు తక్షణమే పదవులకు అనర్హులవుతారన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అనర్హత వేటు ఎదుర్కోనున్న ఎంపీల సంఖ్య మూడుకు చేరింది. దాణా కేసులో దోషులుగా తేలిన లాలూ అనర్హత వేటు పడనున్న రెండో ఎంపీగా, జేడీయూ ఎంపీ జగదీశ్ శర్మ మూడో ఎంపీగా రికార్డులకెక్కే అవకాశముంది. త్రిపుర ఎంబీబీఎస్ సీట్ల కోటాకు సంబంధించిన అవినీతి కేసులో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రషీద్ మసూద్ ను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు రెండు వారాల కిందట దోషిగా నిర్ధారించడం తెలిసిందే.
చట్టం తన పని చేసింది
Published Tue, Oct 1 2013 3:31 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement