సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతులపై తీవ్ర గందరగోళం నెలకొంది. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో ఏకీకృత సర్వీసు రూల్స్ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని స్పష్టమైంది. దీంతో పదోన్నతుల అంశాన్ని ఉపాధ్యాయ వర్గాలు తెరపైకి తెస్తున్నాయి.
పదోన్నతి ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉండటంతో భర్తీ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ‘ఏకీకృతం’అంశం కోర్టు పరిధిలో ఉండటంతో పదో న్నతుల ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వం.. కోర్టు అంశాన్ని సాకుగా చూపుతూ బదిలీలే చేపట్టింది. కోర్టు తీర్పు తో స్పష్టత వచ్చినందున పదోన్నతులకు పాత పద్ధతే విద్యాశాఖ ముందున్న ఏకైక మార్గమని తెలుస్తోంది.
పాత విధానంతోనే..
ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయాలంటే పార్లమెంటు చట్ట సవరణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటివరకు పదోన్నతులు చేపట్టకుంటే విద్యాశాఖలో మరింత ఆటుపోట్లు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంఈవో, ఉపవిద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉండడంతో పాఠశాలల పర్యవేక్షణ అగమ్యగోచరంగా మారింది. ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నా అకడమిక్ కార్యక్రమాలు, పరిపాలన అంశాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదు.
‘ఏకీకృతం’విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పొస్తుందని భావించిన విద్యాశాఖ 4ఏళ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతులను చేపట్టలేదు. తాజా హైకోర్టు తీర్పులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో పదోన్నతులకు పాత పద్ధతే విద్యాశాఖ ముందున్న ఏకైక మార్గమని తెలుస్తోంది. యాజమాన్యాల వారీగా స్థానిక సంస్థలు, ప్రభుత్వ పాఠశాలల్లో పదోన్నతులు చేపడితే సరిపోతుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.
ఇందులో స్కూల్ అసిస్టెం ట్లు, జీహెచ్‌ఎం కేటగిరీ వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. అయితే ప్రభుత్వ యాజమాన్య టీచర్లకు అనుకూలంగా గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలనే అంశంపై మరోకేసు కోర్టు పరిధిలో ఉంది. దీంతో స్కూల్ అసిస్టెంట్, గెజిటెడ్ హెడ్‌మాస్టర్ కేటగిరీల్లో పదోన్నతులు సులభతరమైనా ఎమ్‌ఈవో,డైట్ లెక్చరర్ తదితర పోస్టుల్లో చిక్కులు తప్పవని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment