
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సమ్మతితోనే స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఎన్నికలు నిర్వహించేలా చేసిన చట్ట సవరణలకు సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ చట్టాలకు చేసిన సవరణలు రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్నందున ఆ సవరణల్ని రద్దు చేయాలనే పిల్‌పై వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శులకు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment