విశాఖ జిల్లాలో వైఎస్సార్‌సీపీదే బలం
ప్రజాప్రతినిధులను కొనాలని కూటమి ప్రయత్నం
ఫలించని కుట్రలు.. కూటమి వైపు రాని ప్రజాప్రతినిధులు
ఓటమి భయంతో ఇప్పటికీ అభ్యర్థిని ఖరారు చేయని కూటమి
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకా తర్జనభర్జన పడుతున్నాయి. ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచించినా అందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉండడంతో ఆ పార్టీ నుంచి భారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కూటమి వైపు తిప్పుకొనేందుకు కుట్రలు పన్నారు.
భారీగా డబ్బు ఇవ్వజూపారు. అయినా కూటమి వైపు రావడానికి ప్రజాప్రతినిధులు ససేమిరా అన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీకి పెడితే ఓడిపోవడం ఖాయమనే అంచనాకు కూటమి నేతలు వచ్చారు. సీఎం చంద్రబాబు రెండుసార్లు విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో జరిపిన చర్చల్లో గెలవడానికి సరిపడా ప్రజాప్రతినిధులు లేరని తేలింది. సరిపడినంతమందిని కూటమి వైపు తెస్తేనే అభ్యర్ధిని ప్రకటిస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.
మొదట్లో అనకాపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను పోటీకి దింపాలని భావించారు. అయితే వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పోటీకి దిగడం, మెజారిటీ ప్రతినిధులు వైఎస్సార్‌సీపీ వైపే ఉండడంతో పీలా గోవిందు చేతులెత్తేశారు. దీంతో గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించిన వ్యాపారవేత్త బైరా దిలీప్ పేరును పరిశీలిస్తున్నారు.
ఆయన అయితే భారీగా డబ్బు ఖర్చు పెట్టి వైఎస్సార్‌సీపీ స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తారని టీడీపీ సీనియర్లు భావిస్తున్నట్లు సమాచారం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్లు దాఖలుకు గడువు ముగిసే లోగా అవకాశాలు మెరుగుపడితే దిలీప్‌ను పోటీకి దింపాలని చూస్తున్నారు. లేనిపక్షంలో పోటీకి దూరంగా ఉండడమే మేలని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment