
సాక్షి, హైదరాబాద్: తల్లిని బాగా చూసుకుంటామని చెప్పి మాటతప్పిన ఓ కొడుకు, కోడలికి హైకోర్టు ధర్మాసనం చీవాట్లు పెట్టింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోగా.. వృద్ధురాలైన తల్లిని ఆస్తికోసం వేధించడంపై తీవ్రంగా మండిపడింది. ఆమె దగ్గరి నుంచి లాక్కున్న ఇంటిని తిరిగి అప్పగించేలా చూడాలని పోలీసులను ఆదేశించింది. కేపీహెచ్‌బీ కాలనీ, అడ్డగుట్టలోని శ్రీనిలయంలో ఉంటున్న తనను.. కొడుకు, కోడలు గెంటేయడమే కాకుండా, చంపేందుకు సైతం ప్రయత్నించారంటూ వి.శివలక్ష్మీ కేపీహెచ్‌బీ పోలీసులకు గతేడాది అక్టోబర్ 31న రెండు వేర్వేరు ఫిర్యాదులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ.. ఆమె కేపీహెచ్‌బీ పోలీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఆమె జాగ్రత్తగా చూసుకోవాలని, ఇంటిని ఆమెకే ఇచ్చేయాలని కొడుకు, కోడలిని ఆదేశించారు.
తల్లిని బాగా చూసుకుంటామని వారిద్దరు ఆ సమయంలో న్యాయమూర్తికి తెలిపారు. అయితే కోర్టుకిచ్చిన హామీని నిలబెట్టుకోని వీరిద్దరు.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం కొడుకు, కోడలికి చీవాట్లు పెట్టింది. ఇంటిని అప్పగించడంపై అప్పీల్ చేసే బదులు.. తల్లినే అడిగి ఎందుకు ఆశ్రయం పొందకూడదని నిలదీసింది. వాస్తవానికి జరిమానా విధించి ఈ అప్పీల్‌ను కొట్టేయాలని.. కానీ మానవతాదృక్పథంతో ఆ పని చేయడం లేదని పేర్కొంది. తల్లి ఇంటిని ఆమెకే అప్పగించాలంది. ఈ ఉత్తర్వులను అమలు చేయకుంటే కొడుకు, కోడలుపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయవచ్చునని తల్లికి సూచించింది.
నాటి అమెరికా పరిస్థితి నేడు దేశంలో..
ప్రస్తుతం సమాజంలో వద్ధ తల్లిదండ్రుల పరిస్థితిని విచారణ సందర్భంగా ధర్మాసనం వివరించింది. ‘ఈమధ్య తల్లిదండ్రుల పట్ల బిడ్డల ప్రవర్తన బాధాకరంగా ఉంటోంది. యువ దంపతుల్లో మానవతా విలువలు లేకుండా పోతున్నాయి. అమెరికాలో 1990ల్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు మనదేశంలో కనిపిస్తున్నాయి. అప్పట్లో వదిలేసిన తల్లిదండ్రులు మానసికక్షోభను అనుభవించారు. ఇప్పుడు మనదగ్గరున్న పరిస్థితులు కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు’అని « వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment