సాక్షి, హైదరాబాద్: ‘కొత్తగా బాధ్యతలు స్వీకరించాను.. కోర్టు ఉత్తర్వులు జారీ అయినప్పుడు మరో అధికారి విధుల్లో ఉన్నారు.. ఆయన బదిలీ అయ్యారు.. నాకు కోర్టు ఆదేశాలు తెలియదు.. ఇలాంటి కుంటిసాకులు చెప్పి రైతులకు పరిహారం ఇవ్వడం ఆలస్యం చేస్తే ఉపేక్షించేది లేదు’ అని అధికారులను ఉమ్మడి హైకోర్టు హెచ్చరించింది. భూసేకరణ ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు పదవిలో ఉన్న అధికారులందరిపైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. సిరిసిల్ల మండలం సారంపల్లిలో బి.బాలాజీ అనే రైతు భూమికి సంబంధించిన పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం చేసిన అధికారులపై ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం బుధవారం మండిపడింది.
కేసు వివరాలు.. భూసేకరణ పరిహారంతో సంతృప్తి చెందని బాలాజీ 2005లో వ్యాజ్యం దాఖలు చేయగా మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని 2009లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల్ని అధికారులు ఉల్లంఘించారని బాలాజీ తిరిగి 2010లో కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. బాలాజీకి పరిహారం చెల్లించేశామని అధికారులు చెప్పారు. దీనిని న్యాయమూర్తి విచారిస్తున్న క్రమంలో మేకల పాండు కేసులో భూములకు పరిహారం చెల్లించాలన్న ఉత్తర్వుల్ని అధికారులు అమలు చేయలేదని తప్పుపట్టారు. ఇప్పటికే చెల్లించిన రూ.2.45 లక్షలతోపాటు మిగిలిన పరిహారాన్ని రెండు వారాల్లోగా చెల్లించాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించారంటూ ఆర్డీవోకు నెలరోజులు సాధారణ జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధించారు. దీనిపై ఆర్డీవో అప్పీల్ చేసిన వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
సిరిసిల్ల ఆర్డీవోకు జైలు శిక్ష అమలు నిలిపివేత
సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్షను ధర్మాసనం నిలుపుదల చేసింది. తాము వెలువరించే తుది ఉత్తర్వులకు లోబడి సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష అమలు ఉంటుందని ధర్మాసనం ప్రకటించింది. తాను ఈ ఏడాది మార్చిలోనే బాధ్యతలు స్వీకరించానని, ఇప్పటికే రైతుకు రూ.4.10 లక్షల పరిహారం చెల్లించేశామని ఆర్డీవో తరఫు ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ ఏడాది మార్చిలో బాధ్యతలు స్వీకరించామని చెప్పి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని ఆర్డీవోపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులు, సాధారణ వ్యక్తులు, పేదలు పరిహారం కోసం చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ తిరగాలా అని ప్రశ్నించింది.
పరిహారం కోసం ప్రదక్షిణ చేయాలా?
Published Thu, Nov 16 2017 3:44 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment