land acquisition act-2013
-
ఇక బలవంతపు భూసేకరణే!
సాక్షి, అమరావతి: సంప్రదింపుల పేరుతో సామధాన దండోపాయాలు ప్రయోగించి ఎక్కడ కావాలంటే అక్కడ భూములను లాక్కోవాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే 2013 కేంద్ర భూసేకరణ చట్టం స్థానే ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టం – 2018కి సంబంధించిన విధి విధానాలతో సోమవారం జీవో జారీ చేసింది. 2013 కేంద్ర భూసేకరణ చట్టంలోని సామాజిక ప్రభావ అంచనా, ప్రజాభిప్రాయ సేకరణలను చట్టుబండల్లా మార్చి(తొలగించి) తెచ్చిన ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం – 2018 ప్రకారం భూ యజమాని ఇక ప్రేక్షకుడిగా మిగిలిపోనున్నాడు. సవరించిన కొత్తచట్టం ప్రకారం భూసేకరణ అథారిటీ (కలెక్టరు) సంప్రదింపుల ద్వారా రైతులను ఒప్పించి భూములను సేకరించవచ్చు. తెలిసో తెలియకో, సర్కారు ఒత్తిడికి భయపడో భూములు ఇవ్వడానికి అంగీకరిస్తూ రైతులు సంతకాలు చేస్తే తర్వాత ఈ చట్టం ప్రకారం రైతులు కోర్టుకు వెళ్లడానికి కూడా వీలుండదు (భూమి ఇవ్వడానికి అంగీకరించకుండా సంతకాలు చేయకుండా ఉంటే మాత్రమే కోర్టుకు వెళ్లి రక్షణ పొందవచ్చు). భూయజమానుల హక్కులను దారుణంగా దెబ్బతీసే ఈ చట్టం వాస్తవంగా అయితే ఇప్పటి నుంచి అమలు కావాలి. అయితే 2014 జనవరి ఒకటో తేదీ నుంచే చట్టం అమల్లోకి వచ్చినట్లు పరిగణించాలంటూ జీవోలో ప్రభుత్వం మెలిక పెట్టడం గమనార్హం. జీవోలోని ముఖ్యాంశాలివీ.. ఏ విభాగమైనా, సంస్థ అయినా భూమి కావాలని కలెక్టరుకు దరఖాస్తు చేసుకుంటే భూసేకరణ అథారిటీ (సంబంధిత జిల్లా కలెక్టరు) సంప్రదింపుల పద్ధతిలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనినే కన్సెంట్ అవార్డు అంటారు. దీని ప్రకారం భూములు ఇవ్వడానికి ఇష్టపడే రైతులు సమ్మతి పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో), పనుల విభాగం కార్యనిర్వహణ ఇంజినీరు ( భూమి సేకరణ కోరిన శాఖ కాకుండా వేరే విభాగం వారు), భూమి కోరుతున్న సంస్థ ప్రతినిధితో కూడిన కమిటీ భూయజమానులతో సంప్రదింపులు జరిపి ధర ఖరారు చేస్తుంది. సమ్మతి తెలిపిన భూ యజమానులు, భూసేకరణ సంస్థ ప్రతినిధులు దీని ప్రకారం అంగీకారపత్రాలపై సంతకాలు చేస్తారు. దీనినే అగ్రిమెంటు అంటారు. దీని ప్రకారం కలెక్టరు అవార్డు ప్రకటిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలిలా.. ఏదైనా విభాగం కనీసం ఎంత భూమి సేకరించాలో మొదట నిర్ణయించుకుని రెవెన్యూ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖ దీనిని ఖరారు చేసిన ప్రజాప్రయోజనాల కోసమని భావిస్తే సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయింపు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. దీంతో మైదాన ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టం అమల్లో ఉన్నందున అక్కడ గ్రామసభలు తప్పనిసరి. ఎవరైనా తమకు భూమి కావాలంటూ జిల్లా కలెక్టరుకు విజ్ఞప్తి చేసుకోవచ్చు. వాటిని పరిశీలించి కలెక్టరు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. – ఈ జీవో ప్రకారం భూసేకరణ వల్ల ప్రభావితులయ్యే కుటుంబాలకు ముందస్తు నోటీసులు జారీ చేయాలి. నిర్వాసితులకు 2018 భూసేకరణ చట్టం ప్రకారం ఏకమొత్తంగా పరిహారం చెల్లించాలి. – భూ యజమానుల అభిప్రాయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములు తీసుకునేందుకు మార్గం సుగమమయ్యింది. సవరణలతో వచ్చే నష్టాలివీ.. ఏపీ భూసేకరణ చట్టం–2018 వల్ల భూయజమానులకు వివిధ రకాలుగా నష్టం జరుగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. - ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద చేపట్టే ప్రాజెక్టులు, రహదారులు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు, ప్రభుత్వ అవసరాలకు ఇకపై సామాజిక ప్రభావ మదింపు అంచనా అవసరంలేదు. నచ్చిన పారిశ్రామికవేత్తలకు విలువైన భూములను సేకరించి ఇవ్వొచ్చు. - ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే భూ యజమానులు ప్రేక్షకుల్లా మిగిలిపోవాల్సి వస్తుంది. - కలెక్టరు, ఇతర అధికారులు సంప్రదింపుల ద్వారా నిర్ణయించిన ధరే ఇక ఫైనల్. దీనికి రైతులు ఆమోదం తెలుపుతూ సంతకాలు చేస్తే తర్వాత దీనిపై కోర్టుకు వెళ్లడానికి కూడా అవకాశంలేదు. ఉదాహరణకు.. రాజధాని అమరావతి కోసం భూములు ఇవ్వడానికి తిరస్కరించిన గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ఎకరా అధికారిక ధర రూ.కోటి వరకు (మార్కెట్ ధర రూ.రెండు నుంచి నాలుగు కోట్లకు పైగా) ఉందనుకుందాం. 2013 కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం దీనికి రెండున్నర రెట్లకు పైగా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. మరీ అన్యాయం... ఇప్పుడు జారీ చేసిన 2018 భూసేకరణ చట్టానికి సంబంధించిన జీవో 2014 జనవరి నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొడం దారుణమని నిపుణులతోపాటు అధికారులు కూడా అంటున్నారు. అనగా 2013 కేంద్ర భూసేకరణ చట్టం కింద జారీ చేసిన నోటిఫికేషన్లకు కొత్త చట్టమే అమలు చేస్తామని అర్థం. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో, వివిధ ప్రాజెక్టులకు, మచిలీపట్నం పోర్టుకు, అమరావతి అనంతపురం హైవే భూసేకరణకు 2013 భూసేకరణ చట్టం కింద జారీ చేసిన నోటిఫికేషన్లను చట్టుబండలుగా మార్చి కొత్త చట్టం ప్రకారం భూములు లాక్కోవాలన్న ఎత్తుగడతోనే పాత తేదీతో జీవో జారీ చేసిందని అధికారులు పేర్కొన్నారు. -
పోలవరం.. కలవరం
సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ అందిన ఫిర్యాదుపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) వివరణకు ఆదేశించడం రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేస్తోం ది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సభ్య కార్యదర్శి డాక్టర్ ఆర్కే గుప్తా రంగంలోకి దిగారు. ఫిర్యాదులోని అంశాలపై వివరణ ఇవ్వాలని సూచిస్తూ ఈ నెల 9న రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)కి లేఖ రాశారు. కేంద్రానికి వివరణ ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. పరిహారంలో పక్షపాతం : పోలవరం పనుల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈ నెల 3న రాజమ హేంద్రవరానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ జె.చౌదరయ్య పీఎంవోకు లేఖ రాశారు. 2005లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలవరం కుడి కాలువ పనులకు అడ్డుపడుతూ కొందరు రైతులను కోర్టుల్లో కేసులు వేసేలా పురిగొల్పారని.. పట్టిసీమ ఎత్తిపోతలతో గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించాలనే నెపంతో 2015లో ఆ కేసులను ఉపసంహరించుకునేలా చేసి ఎకరానికి గరిష్టంగా రూ.52.90 లక్షలు పరిహారం ఇచ్చారని వివరించారు. కుడి కాలువలో భూసేకరణ చట్టం–2013 కంటే ఎక్కువ పరిహారం ఇచ్చారన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూసేకరణకు ఎకరానికి రూ.28 లక్షలు ఇస్తామని ప్రభుత్వం అవార్డు జారీ చేసిందని.. సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లిన వారికి మాత్రం ఎకరానికి కేవలం రూ.17.91 లక్షల పరిహారం ఇచ్చి పక్షపాతం చూపిందని వెల్లడించారు. పోలవరం జలాశయంలో ముంపునకు గురయ్యే భూమికి ఎకరానికి రూ.10.50 లక్షలు ఇస్తున్నారని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహాలో పరిహారం ఇస్తూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. -
తప్పకుండా వస్తాం తప్పులన్నీ సరిచేస్తాం
వంశధార నిర్వాసితులకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా - 2013 చట్టం ప్రకారం అందరికీ న్యాయం చేస్తాం.. - వైఎస్ హయాంలోనే వంశధార పనులు 90శాతం పూర్తి - నిర్వాసితులందరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.. - ఏడాదిన్నరలో వచ్చేది మనందరి ప్రభుత్వమే.. ధైర్యంగా ఉండండి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘‘వంశధార ఫేజ్–2, స్టేజ్–2 ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వం మూడేళ్లలో చేసిందేమీ లేదు. తన బినామీలుగా ఉన్న కాంట్రాక్టర్ల కోసం నిర్మాణ వ్యయం పెంచుకొని 30 శాతం కమిషన్లు దండుకో వడం తప్ప. లక్షలాది మంది రైతుల విశాల ప్రయోజ నాల కోసం నిర్వాసితులు చేసిన త్యాగం వెలకట్టలేని ది. అధైర్య పడవద్దు. చంద్రబాబు పాలన ఎంతో కాలం కొనసాగదు. మరో ఏడాదీ ఏడాదిన్నరలోగా మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. భూసేకరణ చట్టం –2013 ప్రకారం వంశధార నిర్వాసిత కుటుంబాలన్నింటికీ పూర్తి న్యాయం జరిగేలా చేద్దాం. ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులన్నీ సరిచేస్తాం. అందరికీ అండగా నిలబడతాం’’ అని శ్రీకాకుళం జిల్లా హిరమండలం లో శుక్రవారం సాయంత్రం జరిగిన ‘వంశధార నిర్వా సితులతో ముఖాముఖి’ కార్యక్రమంలో ప్రతి పక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం జగన్ శుక్రవారం ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు రణస్థలం వచ్చారు. సాయంత్రం ఆరు గంటలకు హిరమండలంలో వరలక్ష్మి థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. వంశధార నిర్వాసితులతో నిర్వహిం చిన ముఖాముఖిలో జగన్ వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. కమీషన్లు దండుకోవడం కోసమే.. ‘‘జిల్లాను సస్యశ్యామలం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా వంశధార ప్రాజెక్టును రూ.934 కోట్లతో నిర్మించేందుకు సంకల్పించారు. ఆ మహానేత హయాంలోనే ప్రాజెక్టు పనులను దాదాపుగా 90 శాతం వరకు పూర్తి చేశారు. మిగిలిన పది శాతం పనులు సుమారు రూ.53 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవి. ఏ ముఖ్యమంత్రికైనా రైతులంటే కొంచెం ప్రేమ ఉన్నా ఒక్క ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేసేవారు. కానీ మన ముఖ్యమంత్రికి మాత్రం రైతుల మీద ప్రేమ లేదు. ఆయనకు కాంట్రాక్టర్ల మీద మాత్రం వ్యామోహం ఉంది. అందుకే ఈపీసీ విధానంతో పూర్తి స్థాయిగా పనులు పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్‌కు మేలు జరిగేలా వ్యవహరించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా వ్యయాన్ని ఏకంగా 400 కోట్ల రూపాయలకు చంద్రబాబు పెంచేశారు. ఆయన అధికారంలోకి వచ్చేసరికి వంశధార ప్రాజెక్టు పనులకు రూ.875 కోట్లు ఖర్చు కాగా, కేవలం 53 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. ఈపీసీ విధానం ద్వారా పూర్తి స్థాయిగా ఖచ్చితంగా పనులు చేయాల్సిన కాంట్రాక్టర్ ఈ పది శాతం పనులను వదిలేసినప్పుడు ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. కేసులు నమోదు చేయించాల్సి ఉంది. అయితే అలా కాకుండా...ఈ పనులను తన అనుయాయుడు, రాజ్యసభ ఎంపి సిఎం రమేష్‌కు ఇప్పించారు. అలాగే ఈ కాంట్రాక్ట్ పనుల అంచనా లను భారీగా పెంచి లాభాలు తెచ్చేలా ప్రత్యేక జీవో కూడా జారీ చేసారు. ఈ వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు ఓ వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే అన్ని ప్రా జెక్టులు పూర్తయ్యేవి కదా...! ఈ జిల్లాలో వంశధార, తోటపల్లి ప్రాజెక్టులు ఎవరైనా చేసారా.. అంటే అది కేవలం దివంగత నేత వైఎస్ఆర్ మాత్రమే. యువతను బుజ్జగించడానికే ప్యాకేజీ.. గట్టిగా డిమాండ్ వస్తుండడంతో యూత్ ప్యాకేజీ అని యువతను బుజ్జగించడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు అవకతవకలకు పాల్పడుతున్నారు. 2015 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఇంటి స్థలం ఇవ్వాలనేది ప్రభుత్వ హామీ. కానీ ఇల్లు లేదా ఇంటి స్థలం ఇవ్వలేమంటూ ఇపుడు రూ. 5 లక్షలు ఇస్తామని చెబుతున్నారు. రకరకాల షరతులతో అదీ అందరికీ దక్కకుండా చేస్తున్నారు. అసలు నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వడానికి ఈ షరతులేమిటి? యూత్ లేకపోవడం ఆ కుటుంబాలు చేసిన నేరమా? యువత ధర్నాలు చేస్తారు కాబట్టి వాళ్లను మంచి చేసుకోవడానికి ఏదో ఇస్తామన్నారు గానీ అవి కూడా సరిగా ఇవ్వడం లేదు. మొత్తం 11 వేల నిర్వాసిత కుటుంబాలకు యూత్ ప్యాకేజీ అమలు చేయాలి. నిర్వాసితులకు పూర్తి స్థాయి న్యాయం చేస్తా.. వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలు ప్రత్యక్షంగా 19, పాక్షికంగా 14 గ్రామాల్లో మొత్తం 11 వేల మంది బాధితులున్నారు. గత పదేళ్ల క్రితం ఎకరా భూమికి లక్షో, లక్షా ఇరవై వేల రూపాయలే ఇచ్చి వదిలేసారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయండని ప్రభుత్వాన్ని నిర్వాసితులు డిమాండ్ చేస్తుంటే మాత్రం పోలీసులు, అధికారులతో బెదిరింపులకు దిగుతున్నారు. జిల్లాలో కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి భూసేకరణలో భాగంగా ఎకరాకు రూ.18 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, అదే జిల్లాలో ఉన్న వంశధార నిర్వాసితులకు మాత్రం ఈ విధానం, చట్టం అమలు చేయడం లేదు. గట్టిగా డిమాండ్ వస్తుండడంతో యూత్ ప్యాకేజీ అని యువతను బుజ్జగించడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు అవకతవకలకు పాల్పడుతున్నారు. కేవలం అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీల సిఫారసులున్న వారికి మాత్రమే ప్యాకేజిలు అందేలా చేస్తున్నారు. అందులో కూడా ఎమ్మెల్యేకి కూడా కమీషన్ ఇవ్వాలి. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తాయి. ఈసారి ఖచ్చితంగా మన వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. రాగానే ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి స్థాయి న్యాయం చేస్తాం. ధైర్యంగా ఉండండి. మరో ఏడాదిన్నర లోగానే ఎన్నికలు వస్తాయి. మీ అందరి ఉసురుతో టీడీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసి పోతుంది’’ అని జగన్మోహన్రెడ్డి నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. -
బలవంతపు భూ సేకరణ ఆపండి: హైకోర్టు
హైకోర్టును ఆశ్రయించిన మల్లన్నసాగర్ బాధితులు సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం బలవంతపు భూ సేకరణకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 123 కింద భూ సేకరణ నిలిపేసి, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మెదక్ జిల్లా తోగుట మండలంలోని మూడు గ్రామాలకు చెందిన రైతులు అడియాల రంగారెడ్డి, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన, పునరావాస కమిషనర్లు, జిల్లా కలెక్టర్, ఆర్డీవో తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం విచారించనుంది. తమ భూములను మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం ఇవ్వాలని బలవంత పెట్టకుండా, తమ భూముల విషయంలో జోక్యం చేసుకోకుండా ప్రతివాదులను ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఒకవేళ భూములు కావాలంటే 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వల్ల తమ మూడు గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని పిటిషనర్లు తెలిపారు. ప్రాజెక్టును ప్రజా ప్రయోజనాల కోసమే నిర్మిస్తున్నప్పటికీ, అధికారులు బలవంతపు భూ సేకరణకు పాల్పడుతున్నారని తెలిపారు. అధికారులు చట్టాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారన్నారు. తమ గ్రామాల్లోకి పోలీసులను తీసుకొచ్చి భూ ఒప్పందపు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని తెలిపారు. ఒప్పందపు పత్రాలన్నీ ఇంగ్లిష్‌లో ఉన్నాయని, అందువల్ల అందులో ఏమి రాశారో తమకు తెలియడం లేదని వివరించారు. కొన్ని పత్రాలు తెలుగులో ఉన్నాయని, అందులో తమ ఇష్టానుసారం, వ్యక్తిగత కారణాలతో భూములు ఇస్తున్నట్లు రాసి ఉందని, వాటిపై సంతకాలు తీసుకుంటున్నారని వివరించారు. సంతకాలు చేసేందుకు నిరాకరించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోర్టును అభ్యర్థించారు.