హైకోర్టును ఆశ్రయించిన మల్లన్నసాగర్ బాధితులు
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం బలవంతపు భూ సేకరణకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 123 కింద భూ సేకరణ నిలిపేసి, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మెదక్ జిల్లా తోగుట మండలంలోని మూడు గ్రామాలకు చెందిన రైతులు అడియాల రంగారెడ్డి, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన, పునరావాస కమిషనర్లు, జిల్లా కలెక్టర్, ఆర్‌డీవో తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం విచారించనుంది.
తమ భూములను మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం ఇవ్వాలని బలవంత పెట్టకుండా, తమ భూముల విషయంలో జోక్యం చేసుకోకుండా ప్రతివాదులను ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఒకవేళ భూములు కావాలంటే 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వల్ల తమ మూడు గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని పిటిషనర్లు తెలిపారు. ప్రాజెక్టును ప్రజా ప్రయోజనాల కోసమే నిర్మిస్తున్నప్పటికీ, అధికారులు బలవంతపు భూ సేకరణకు పాల్పడుతున్నారని తెలిపారు. అధికారులు చట్టాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారన్నారు. తమ గ్రామాల్లోకి పోలీసులను తీసుకొచ్చి భూ ఒప్పందపు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని తెలిపారు.
ఒప్పందపు పత్రాలన్నీ ఇంగ్లిష్‌లో ఉన్నాయని, అందువల్ల అందులో ఏమి రాశారో తమకు తెలియడం లేదని వివరించారు. కొన్ని పత్రాలు తెలుగులో ఉన్నాయని, అందులో తమ ఇష్టానుసారం, వ్యక్తిగత కారణాలతో భూములు ఇస్తున్నట్లు రాసి ఉందని, వాటిపై సంతకాలు తీసుకుంటున్నారని వివరించారు. సంతకాలు చేసేందుకు నిరాకరించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోర్టును అభ్యర్థించారు.
బలవంతపు భూ సేకరణ ఆపండి: హైకోర్టు
Published Sun, Jun 26 2016 3:55 AM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
Advertisement