సొంతూరికి వెళ్లేందుకు గుర్తింపుకార్డులా?
పోలీసులపై హైకోర్టు మండిపాటు
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ఆందోళన నేపథ్యం లో మెదక్ జిల్లా వేములఘాట్ గ్రామంలోకి వెళ్లేందుకు పోలీసులు గుర్తింపు కార్డులు చూపాలని కోరుతుండటంపై హైకోర్టు మండిపడింది. తమ సొంత ఊర్లోకి వెళ్లడానికి గ్రామస్తులను గుర్తింపుకార్డులు కోరడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది. వేములఘాట్‌లో 144 సెక్షన్ విధింపు వ్యవహారంలో నిర్ణయాన్ని 26కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేములఘాట్‌లో 144 సెక్షన్ విధించడాన్ని సవాలు చేస్తూ వై.సంతోశ్‌రెడ్డి, మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయమూర్తి శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, గ్రామంలో శాంతి యుత వాతావరణం ఉన్నప్పటికీ 144 సెక్షన్ ఎత్తివేయడం లేదన్నారు. గ్రామస్తులను గుర్తింపు కార్డుల కోసం పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. సొంత గ్రామంలోకి వెళ్లేందుకు కూడా గుర్తింపు కార్డులు చూపాలా? ఇదేం పద్ధతి..? అంటూ నిలదీశారు. అయితే గ్రామంలో శాంతి యుత వాతావరణం నెలకొనలేదని, అందువల్లే 144 సెక్షన్ కొనసాగిస్తున్నామని హోంశాఖ తరఫు న్యాయవాది తెలిపారు.