రైతు కోరేది అలాంటి భరోసా! | dr.y.sivaji writes on farmers | Sakshi
Sakshi News home page

రైతు కోరేది అలాంటి భరోసా!

Published Wed, Aug 31 2016 1:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

రైతు కోరేది అలాంటి భరోసా! - Sakshi

రైతు కోరేది అలాంటి భరోసా!

విశ్లేషణ

ఈ అంశం మీద పునరాలోచించాలని శేషన్, గిల్, జీవీజీలకు కార్యాచరణ సమితి లేఖలు రాసింది. ఈసీ స్పందించలేదు. దీని మీదనే కార్యాచరణ సమితి తరఫున నేను నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభాశంకర్‌ మిశ్రాకు ఒక లేఖ రాశాను.

రాజధాని భూసేకరణ వివాదం మీద ప్రముఖ పత్రికా రచయిత ఏబీకే ప్రసాద్‌ తదితరులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం గురించి ఇటీవల జరిగిన చర్చను చదివాను. నిజమే, ‘ఈ వ్యాజ్యం దాఖలు చేయడానికి మీరేౖ మెనా భూమిని కోల్పోయారా?’ అంటూ అత్యున్నత న్యాయస్థాన ధర్మా సనం ప్రశ్నించడం ఒక రైతు జన పక్షపాతిగా నన్ను బాధించింది. కానీ అందులో ఉన్న రెండు అంశాలు – ప్రజాప్రయోజన వ్యాజ్యా లకు ఉన్న గతం, రైతాంగ ప్రయోజనం– నన్ను ఇరవయ్యేళ్ల నాటి ఒక ఉద్యమ జ్ఞాపకం దగ్గరకు తీసుకువెళ్లాయి. ప్రజాప్రయోజ నాల వ్యాజ్యాలకు ఉన్న ప్రాధాన్యం, ప్రయోజనాల పరిధి ఎంత విస్తృతమో చెప్పే ఘటన అది. పాలనా వ్యవహారాలలో ఎలక్షన్‌ కమిషన్‌ తలదూర్చడం తగదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించిన సందర్భమది. పేరుకు పోయిన పత్తి నిల్వలు చూసుకుని గుండె చెదిరిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాస్తవాన్ని చూసి, హైకోర్టు తనకు తానుగా ఒక లేఖను పిల్‌గా స్వీకరించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం అద్భుతమనిపిస్తుంది. ఈ కేసు, ఈ పరి ణామాల పూర్వాపరాలను న్యాయశాస్త్ర చరిత్రలోనే ప్రత్యేకత కలి గిన అంశాలుగా నాడు పలు పత్రికలు వ్యాఖ్యానించడం మరో అపురూప సన్నివేశం.


1996 మార్చి ఆరంభానికి పత్తి సాగు సంక్షోభం పరాకాష్టకు చేరింది. తెలుగు ప్రాంతాలలో ఏడు లక్షల ఎకరాలలో పత్తి పంట ఉంది. మరో పక్క బేళ్ల కొద్దీ నిల్వలు పడి ఉన్నాయి. దీనికి తోడు ధరల పతనం మరొకటి. ఆ సంవత్సరారంభంలో క్వింటాల్‌ పత్తి రూ. 2,000 ఉండగా, మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాలలో రూ. 1,400 పడిపోయింది. దేశవ్యాప్తంగా మార్కెట్‌ మందకొడి ధోర ణులతో కుంగిపోయింది. హరియాణ, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులలో కూడా ఇలాంటి సంక్షోభమే నెల కొన్నది.  అప్పుడు అంతర్జాతీయంగా పత్తి ధర లు పెరిగితే, దేశీ యంగా పతనమైనాయి. 1996కు ముందు పదిహేను సంవత్స రాలను పరిశీలిస్తే, అందులో ఒక పుష్కరం పాటు కపాస్‌ (ముడి పత్తి) ధర అంతర్జాతీయ మార్కెట్‌ ధర కంటే కనీసం 20 శాతం తక్కువగా ఉన్నట్టు గమనిస్తాం. ఇలాంటి పరిణామాల నేపథ్యం లోనే తెలుగు ప్రాంతంలో నాడు పత్తి రైతుల బలవన్మరణాలు ఆరంభమయ్యాయి. అప్పటికి మేడిసెట్టి కోదండరామయ్య (గుంటూరు జిల్లా), నరసప్ప (కరీంనగర్‌ జిల్లా), గాలి కొమ రయ్య (నల్లగొండ జిల్లా)ల ఆత్మహత్యల వార్తలు తెలుగువారిని కలవరపరిచాయి. 1986–1988 మధ్య తెలుగు ప్రాంతాలలో పత్తి రైతుల ఆత్మహత్యలు ఎడతెరిపి లేకుండా జరిగాయి. ఒక ఆంగ్ల పక్షపత్రిక ఈ బలవన్మరణాల కథనాలకు ‘కిల్లింగ్‌ ఫీల్డ్స్‌’ అని శీర్షిక పెట్టింది.


ఇలాంటి నేపథ్యంలోనే రాజకీయాలకు అతీతంగా పత్తి రైతు ప్రయోజనాలను, ప్రాణాలను రక్షించడానికి ఆవిర్భవించినదే కార్యాచరణ సమితి. నేను, మరికొందరు ఉద్యమానికి పిలుపు నిచ్చాం. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో, ఇతర తెలుగు ప్రాంతా లలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను దృష్టిలో ఉంచుకుని పత్తి ఎగుమతులకు అనుమతించాలని కేంద్ర జౌళిశాఖకు విన్న వించాం. జాతీయ రహదారుల మీద దాదాపు 50 వేల బళ్లు నిలిపారు. మార్చి 5న అక్కడ జరిగిన నాటి సీఎం చంద్రబాబు సభలో కూడా రైతు ఉద్యమ వేడి ప్రతిబింబించింది. మొత్తానికి ఉన్నతస్థాయి అధికారుల సంఘాన్ని నియమించారు. నాటి టుబాకో బోర్డ్‌ చైర్మన్, పి. రమాకాంత్‌రెడ్డి, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాయింట్‌ కమిషనర్‌ ఎన్‌.సి. సక్సేనా, కాటన్‌ కార్పొరేషన్‌ ప్రాంతీయ మేనేజర్‌ టి. భానోజీరావు ఇందులో సభ్యులు. వీరు గుంటూరు, ప్రకాశం జిల్లాలలో పర్యటించి నివేదిక సమర్పించారు. దీనితో కేంద్ర జౌళిశాఖ వెంటనే స్పందించి రెండు లక్షల బేళ్ల పత్తి ఎగుమతికి అనుమతించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను సంబంధిత వర్గాలన్నిటికీ పంపుతూ, అప్పటికి ఎన్నికలు ప్రకటించి ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక ప్రతిని పంపింది. ఈ మలుపులోనే రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు స్పందిం చిన తీరు చరిత్రాత్మకమైనది. ఈ పరిణామాలన్నీ 1996, మార్చిæ5–17 మధ్యనే జరిగాయి.


పత్తి ఎగుమతులకు అనుమతించడం ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చవచ్చునంటూ నాటి ఎన్నికల కమిషన్‌ జౌళి శాఖ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ అంశం మీద పునరాలోచిం చాలని శేషన్, గిల్, జీవీజీలకు కార్యాచరణ సమితి లేఖలు రాసింది. ఈసీ స్పందించలేదు. దీని మీదనే కార్యాచరణ సమితి తరఫున నేను నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభాశంకర్‌ మిశ్రాకు ఒక లేఖ రాశాను. ఇంతటి సంక్షోభంలో కూడా ఎన్నికల పేరుతో, నిబంధనల పేరుతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ పత్తి ఎగుమతికి నిరాకరించడం రైతాంగ సంక్షోభాన్ని మరింత ఉధృ తం చేయడానికే ఉపకరిస్తుందని రాశాను. దానినే న్యాయమూర్తి పిల్‌ (7952/ 1996)గా స్వీకరించారు. పైగా జస్టిస్‌ మిశ్రా, జస్టిస్‌ ఎమ్‌హెచ్‌ఎస్‌ అన్సారీలతో కూడిన ధర్మాసనానికి ఈ కేసును పోస్టు చేశారు. పత్తి ఎగుమతికి అనుమతించడానికి అభ్యంతరం ఉండనక్కరలేదని ఆగమేఘాల మీద మధ్యంతర ఉత్తర్వులు వెలు వరించారు. ఏప్రిల్‌ 30, 1996న తీర్పును వెల్లడించారు.


ఎన్నికల ప్రక్రియ మీద  పర్యవేక్షణ, నియంత్రణ పేరుతో ఎన్నికల సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రోజు వారి పరిపాలనా వ్యవహారాలలో తలదూర్చడం సరికాదని హైకోర్టు చెప్పింది. పత్తి ఎగుమతికి అనుమతించరాదంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు చెల్లవని, పత్తి ఎగుమతికి ఆంధ్రప్రదేశ్‌ సహా కొన్ని రాష్ట్రాలను అనుమతించడానికి కేంద్రం సమ్మతించాలని కూడా స్పష్టం చేసింది. సర్వం కోల్పోయిన రైతు వెనుక కొండంత అండగా కోర్టు నిలబడుతుంది అని భరోసా కల్పించిన గొప్ప సందర్భం అది. అలాంటి అండ ప్రస్తుత నేపథ్యంలో మరింత అవ సరమని మాలాంటి రైతు బాంధవులం అంతా భావిస్తున్నాం.

డా. వై. శివాజీ
వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యుడు - 98663 76735

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement