విశాఖపట్నం ,నాతవరం (నర్సీపట్నం): జామ తోటల పెంపకంపై ఆదాయం బాగుండటంతో రైతులు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు తాండవ జంక్షన్ జామకాయలకు ప్రసిద్ధి. అప్పటిలో విస్తారంగా సాగు జరిగేది. రానురాను తెగుళ్ల బారిన పడటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. మళ్లీ ఇప్పుడు రైతులు జామతోటల పెంపకంపై దృష్టి సారించారు. మండలంలోబాపన్నపేట, మర్రిపాలెం, వెన్నలపాలెం, డి,యర్రవరం ,ములగపూడి, నాతవరం, మాదంపూడి ప్రాంతాలల్లో సుమారు 80 ఎకరాలు వేశారు. దేశవాళీ రకాలు కాకుండా లక్నో 49, భువనగిరి బత్తాయి తదితర రకాల సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు.
ఎకరాకు రూ.80 వేల ఆదాయం
మండలంలోని బాపన్నపేట గ్రామానికి చెందిన చోడే మోహన్‌రావు చౌదిరి సుమారు 10 ఎకరాల్లో తైవాన్, హైబ్రిడ్ రకాలు వేశారు. నాటిన తరువాత మూడేళ్ల నుంచి దిగుబడి వస్తోందని ఆయన వివరించారు. ఏడాదికి రూ.60 నుంచి రూ.70 వేల మధ్య ఆదాయం వస్తోందని చెప్పారు. యాపిల్‌ను పోలివుండే తైవాన్ జామకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందన్నారు.
జామ కాయల వ్యాపారమే ఆధారం
మర్రిపాలెం శివారు రెల్లి కాలనీకి చెందిన వంద కుటుంబాలు జామ కాయల అమ్మకాలపై ఆధారపడ్డారు. వీరంతా రైతుల నుంచి సేకరించిన జామకాయలను తాండవ జంక్షన్‌లో విక్రయించి ఉపాధి పొందుతున్నారు.
తాండవ వల్లే రుచి : తాండవ జలాశయం వల్లే ఈ ప్రాంతంలో జామకాయలు రుచికరంగా ఉంటాయి. తాండవ నీరు తియ్యదనం వల్ల ఈ ప్రాంతంలో పండించే జామ కాయల రుచికూడా అదేవిధంగా ఉంటుంది. నర్సీపట్నం– తుని మార్గంలో వెళ్లే ప్రతిఒక్కరూ జామకాయలను కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు.
ప్రోత్సాహం కరువు
తాండవ జంక్షన్‌లో జామకాయల వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ముద్ర పథకంలో రుణాలు ఇప్పిస్తే అధిక వడ్డీలనుంచి బయటపడతాం.
– బంగారి అబ్బు, రెల్లి సంఘం అధ్యక్షుడు
జామ ఆరోగ్యకరం
జామకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. జామి కాయలో ‘సి’ విటమిన్ అధికంగా ఉంటుంది, తక్కువ మోతాదులో ‘ఏ’ విటమిను కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యానర్స్ రాకుండా ఉపయోగపడుతుంది.– అనుషరావు, నాతవరం పీహెచ్‌సీ వైద్యాధికారి
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
జామ సాగు చేయడానికి ముందుకు వచ్చె రైతులకు రాయితీపై మొక్కలు అందజేస్తున్నాం. అలాగే ఉపాధి హమీ పథకంలో తోటల పెంపకానికి నిధులు కేటాయిస్తున్నాం. రైతులకు జామసాగు ప్రయోజనాలపై సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. – చెట్టి బిందు, ఉద్యవనశాఖాదికారిణీ
Comments
Please login to add a commentAdd a comment