రైతుల్ని నిండా ముంచారు
* సర్కారు నిర్వాకం రైతులకు శాపమైంది: జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
* గ్రామాల్లోకి ఎవరూ రాలేదు.. వచ్చిన వాళ్లు నష్టాన్ని చూడట్లేదు
* వరుసగా ఆరో రోజు విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు, తుపాను బాధితులు పూర్తిగా నష్టపోయి దిక్కులేని వారైపోయారు. రుణాలు కట్టవద్దని ఎన్నికల ముందు టీడీపీ చెప్పింది. అది నమ్మి రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. కానీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం రుణాలు మాఫీ చేయలేదు. దాంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. పాత రుణాలు రీషెడ్యూల్ కూడా చేయలేదు. ఫలితంగా రైతులకు పంటల బీమా కూడా వర్తించకుండా పోయింది. మరోవైపు రైతులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి పంటలు వేసుకున్నారు. తీరా తుపాను ముంచెత్తి పంటలన్నీ నాశనమయ్యాయి. రీషెడ్యూల్ చేయక పంటల బీమా లేకపోవడంతో రైతులకు బీమా కూడా రాని పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం వల్ల రైతులు, తుపాను బాధితులకు దమ్మిడీ సహాయం అందకుండాపోయింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. హుదూద్ తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా ఆరో రోజు ఆదివారం విశాఖ జిల్లా భీమిలి, తగరపువలసలతో పాటు.. విజయనగరం జిల్లాలోనూ విసృ్తతంగా పర్యటించారు. కూలిన ఇళ్లు, దెబ్బతిన్న వరి, చెరకు, టేకు తోటలను పరిశీలించారు. రైతులు, మహిళలు, వృద్ధులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు.
ప్రభుత్వ సహాయం అందుతోందా లేదా అని వాకబు చేశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా మురపాక వద్ద విలేకరులతో మాట్లాడారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై విరుచుకుపడ్డారు. తుపాను బాధితులకు న్యాయం జరిగేలా చూడటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతామని.. ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. పేదలకు అండగా ఉంటామని ఆయన స్పష్టంచేశారు. తుపాను బాధితుల దుస్థితిని, సర్కారు నిర్లక్ష్య వైఖరిని జగన్ ఎండగట్టారు.
పాతిక రూపాయలతో పబ్లిసిటీ స్టంట్...
‘‘తుపాను దెబ్బకు పూర్తిగా నష్టపోయిన పేదలను ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. ఒక్కసారి గ్రామాల్లోకి వచ్చి చూస్తే ప్రభుత్వం దమ్మిడీ సహాయం చేయలేదనే విషయం తెలుస్తుంది. గ్రామాల్లోకి ఎవ్వరూ రాలేదు. వచ్చిన ఒకరిద్దరు గ్రామానికి నాలుగైదు ఇళ్లు చూసి వెళ్లిపోయారు. అన్ని ఇళ్లు చూడమన్నా చూడనే లేదు. ఇలా అయితే బాధితులకు సక్రమంగా నష్టపరిహారం ఎలా వస్తుంది? కేవలం కిలో రూపాయి బియ్యం 25 కిలోలు ఇచ్చి ఏదో గొప్పగా సహాయం చేశామని ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్ చేస్తోంది. అంటే ప్రభుత్వం ఒక కుటుంబానికి విదిల్చింది కేవలం రూ. 25 మాత్రమే. ఆ మాత్రం ఇచ్చి రూ. 25 డిస్కౌంట్ ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటోంది. ఆ బియ్యం కూడా అందరికీ అందడం లేదు. అందులో పురుగులు ఉంటున్నాయి.
తినలేక పేదలు అవస్థలు పడుతున్నారు.
రైతులను పూర్తిగా గాలికొదిలేసింది...
రైతులను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. గ్రామాల్లోకి వచ్చిన ఒకరిద్దరు అధికారులు కూడా నష్టపోయిన పంటలను చూడలేదు. పంటలు చూడండని రైతులు వేడుకున్నా వినలేదు. గాలికి, వానకు చెరకు పంట పూర్తిగా పోయింది. చెరకు నీటమునిగి అంతటా మట్టి అంటింది. మొలకలు కూడా వచ్చేస్తున్నాయి. దాంతో తూనిక కూడా సరిగా రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం 25 శాతం కూడా దిగుబడి రాని పరిస్థితి నెలకొంది. కానీ ఇంతవరకు చెరకు రైతులను ప్రభుత్వం పట్టించుకోనే లేదు. మరోవైపు సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు రైతులకు గత ఏడాది బకాయిలే ఇంతవరకు చెల్లించ లేదు. గత ఏడాది టన్నుకు రూ. 2,100 చొప్పున ఇవ్వాల్సిందే మూడు వాయిదాల్లో ఇస్తామని చెప్తున్నాయి. తీరా ఇప్పుడు ‘తుపాను వచ్చింది.. మా పంచదార నిల్వలు మునిగిపోయాయి.. కాబట్టి బకాయిలు ఇవ్వలేము’ అని చెప్పేస్తున్నాయి. చక్కెర ఫ్యాక్టరీలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోంది.
సర్కారు వైఫల్యం వల్ల కృత్రిమ కొరత...
తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృత్రిమ కొరత ఏర్పడింది. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఏ నిత్యావసర వస్తువూ కొనలేని పరిస్థితి ఏర్పడింది. పేదల చేతిలో డబ్బుల్లేవు. పనికి వెళ్దామంటే పని లేదు. దాంతో వంట చేసుకోవడానికి సరుకులు కూడా కొనలేని పరస్థితి ఏర్పడింది.ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. రేషన్ సరుకులు కూడా సరిగా ఇవ్వడం లేదు. గతంలో 3 కిలోల పంచదార ఇచ్చేవారు. ఇప్పుడు అరకిలోనే ఇస్తున్నారు. తుపానుకు దెబ్బతిన్న నాలుగు జిల్లాల్లో ప్రతి కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ. 5,000 ఇవ్వాలి. అలా అయితేనే పేద ప్రజలు కనీసం అత్యవస సరుకులు, వంటసామాన్లు, బట్టలు కొనుక్కుంటారు. దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుకు రూ. 50 వేలు చొప్పున సహాయం చేయాలి. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్తవి కట్టించి ఇవ్వాలి.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు...
ఇది ఎవరో ఒక్కరు వ్యక్తిగతంగా చేయలేరు. అది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం దగ్గర రూ. లక్ష కోట్ల బడ్జెట్ ఉంది. కానీ పేదలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధే లేకుండా పోయింది. కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందన్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. తుపాను సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఎన్ని నిధులు తేగలదో సీఎంను అడగాలి.’’