ప్రధానోపాధ్యాయులకు విత్తన బ్యాగులను అందజేస్తున్న కలెక్టర్ దివ్య
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ మరో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలోనే ఆమె కౌలు రైతులు, ఆదివాసీల కోసం చేపట్టిన చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం విదితమే. తాజాగా ఆమె ఆలోచనల నుంచి వచ్చిందే ‘మా బడి తోట’. ఆదిలాబాద్ జిల్లా సర్కారు బడుల్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీ బడిలో సేంద్రియ పద్ధతిలో కిచెన్ గార్డెన్‌ను సాగు చేయాలి. తద్వారా విద్యార్థులకు మేలైన పోషకాహారం అందించడంతోపాటు వ్యవసాయం, పోషక విలువలపై ఈ పాఠశాలల్లో సాగు ద్వారా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు.
కూరగాయల విత్తన రకాలు అందజేత
జిల్లాలో కేజీబీవీ, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్, ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలతోపాటు వసతిగృహాలు కలిపి 1400లకు పైగా ఉన్నాయి. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో కూరగాయల విత్తన రకాలకు సంబంధించి తయారుచేసిన ప్యాకెట్లను కలెక్టర్ అందజేశారు. ఒక్కో రకం కూరగాయల పంటకు ఇద్దరు ముగ్గురు విద్యార్థులు గ్రూపుగా కలసి దత్తత తీసుకోవాలి. బడి ఆవరణలో ఎంపిక చేసిన ప్రదేశంలో ఆయా రకాల విత్తనాలను ఆయా గ్రూపు విద్యార్థులతో నాటించాలి.
నారు పెంపకంలో అటు కలుపు తీయడమే కాకుండా నీళ్లందించి వాటిని సంరక్షించే బాధ్యత ఆ దత్తత తీసుకున్న గ్రూపు పిల్లలే వహించేలా చూడాలి. కూరగాయలు అందించడం ద్వారా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మేలు జరుగుతున్నందునా ఈ నారు పెంపకంలో వారిని భాగస్వాములు చేసి తోటను వృద్ధి చేయాలి. దీనికి సంబంధించి మాబడి తోట పెంపకానికి సూచనలను ఇస్తూ నాలుగు పేజీల నోట్‌ను తయారుచేసి ప్రతి పాఠశాలకు అందజేశారు. టమాటా మినహా ఇతర కూరగాయ గింజలన్ని నాటిన మొక్కల నుంచి తీసుకొని తర్వాత సంవత్సరంలో నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు.
స్థలం లేనిచోట..
ఆదిలాబాద్ జిల్లాలో 1400లకు పైగా పాఠశాలలు ఉంటే ఓ పది శాతం పాఠశాలల్లో స్థలం కొరత కారణంగా కిచెన్‌గార్డెన్ ఇబ్బందిగా ఉంటుందని కొంతమంది ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటిచోట తీగజాతి సొరకాయ, బీరకాయ వంటివి పెంచాలని కలెక్టర్ సూచించారు. గోడల మీదా పెరిగేలా వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రహరీలు లేని పాఠశాలల్లో ముళ్ల కంచెలను ఏర్పాటు చేసుకోవాలి. నీటి వసతిలేని దగ్గర నీళ్లు వృథా కాకుండా విద్యార్థుల భోజనం తర్వాత చేతులు శుభ్రం చేసే దగ్గరి నుంచి కూరగాయల నారు వరకు నీళ్లు వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలా మాబడితోట కార్యక్రమం విషయంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ‘దివ్య’మైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment