సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి విమర్శించారు. రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం మూడు పంటలు పండే భూములను దౌర్జనంగా లాక్కుందని విమర్శించారు. రైతుల భూములు లాక్కొని వెయ్యిగజాలు ఇవ్వడం, భూసేకరణ చేసుకొని రైతులను బిక్షగాళ్లుగా మార్చుతున్నారని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియా సమావేశంతో మాట్లాడారు. రైతులు భూములు ఇవ్వమంటే అరెస్టు చేస్తున్నారని, పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ధ్వజమెత్తారు. మీరా ప్రసాద్ అనే రైతును వేధించారని వెన్నపూస గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు మొసలి కన్నీరు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.
‘రాజధానిలో భూములివ్వని రైతులను రకరకాలుగా వేధిస్తున్నారు. రాత్రికి రాత్రే భూములివ్వని రైతుల పొలాల్లో రోడ్లు వేస్తున్నారు. గతంలో వ్యవసాయం దండగన్న చంద్రబాబుకు అకస్మాత్తుగా రైతులపై ప్రేమ పుట్టుకొచ్చింది. చంద్రబాబు జీవితమంతా షో చేయడమే, లేచింది మొదలు అబద్ధాలే. అనంతపురం జిల్లాలో కరువుతో రైతులు అల్లాడుతుంటే రెయిన్ గన్‌ల పేరుతో షో చేశారు. ఆ తర్వాత అనంతపురం వైపు చంద్రబాబు కన్నెత్తి కూడా చూడలేదు. రైతులపై మొసలి కన్నీరు కార్చడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. చంద్రబాబు దుష్టపాలనకు చరమగీతం పాడాలి.’ అని పిలుపునిచ్చారు.
టీచర్లు ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు
రాష్ట్రంలో టీచర్లు ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేకుండా చేశారని వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. పిల్లలు కాపీ కొడితే ఉపాధ్యాయులకు ఐదేళ్లు జైలు శిక్షానా?. విద్యార్థులు పొరపాటున జేబులో పేపర్ పెట్టుకొని వస్తే ఆ బాధ్యత ఉపాధ్యాయుడిదా అని మండిపడ్డారు. టీచర్లను హింసించడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడాలేని చట్టాలను చంద్రబాబు ఏపీలో ప్రవేశపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఫ్యూడలిస్టు పాలన కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment