నూజివీడు: వర్షాకాలంలో పొలం పనుల్లో నిమగ్నమయ్యే రైతులు పాముకాటుకు గురవుతున్నారు. జిల్లాలో ఈ పరిస్థితి దివిసీమ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. పదుల సంఖ్యలో రైతులు పాముకాటు బాధితులవుతున్నారు. అవనిగడ్డ ప్రాంతంలో నాలుగు రోజుల వ్యవధిలోనే 40 మంది పాము కాటుకు గురయ్యారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తక్షణం ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్లే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నూజివీడు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.నరేంద్రసింగ్ వెల్లడించిన వివరాలివి....
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి....
రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్లేటపుడు తప్పనిసరిగా మోకాళ్ల వరకు ఉండే గమ్‌బూట్లు వేసుకోవాలి. అలానే టార్చిలైటు, కర్ర తప్పనిసరిగా ఉండాలి. పాములకు చెవులుండవు. శబ్ధ తరంగాలను గ్రహించి అవి అప్రమత్తమవుతాయి. ఈ నేపథ్యంలో రాత్రిపూట వెళ్లేటపుడు చప్పుడు చేసుకుంటూ, శబ్ధం వచ్చేలా అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. అప్పుడు పాములు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఎక్కువ శాతం కాళ్లు, పాదాలపైనే పాముకాట్లు పడుతుంటాయి గనుక పాదం వరకు కప్పి ఉంచే పంచెలు, లుంగీలు, ప్యాంట్లు వేసుకోవడం మంచిది. చెత్తాచెదారంను ఒక్కసారిగా చేత్తో ఎత్తకూడదు. ముందు కర్రతో అటూఇటూ కదిలించి ఆ తరువాత ఎత్తేయాలి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, వర్షాలు కురిసినపుడు పాముల పుట్టలలోకి నీరు చేరడం వల్ల అవి బయటకు వచ్చి చెత్తాచెదారంలోకి చేరి తలదాచుకుంటాయి. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలు, మదుగు ఎక్కువగా ఉన్న చోట సంచరిస్తూ ఉంటాయి. వీటి సమీపంలోకి వెళ్లినపుడు పాము కాటుకు గురవుతుంటారు. గ్రామాలలో ఇచ్చే పసరు మందు, నాటువైద్యులు ఇచ్చే ఆకులు, అలములను ఎట్టి పరిస్థితులలోనూ నమ్ముకోకూడదు. పాము కరిచిన వ్యక్తిని ఏమాత్రం భయపెట్టకూడదు. భయం వల్ల ఆందోళన పెరిగి రక్తం మరింత తొందరగా గుండెకు చేరుతుంది. దీనివల్ల మరణం త్వరగా సంభవిస్తుంది.
కాటును గుర్తించడం ఎలా...
పాము శరీరంపై నేరుగా కాటువేసిందా, వస్త్రాల పై నుంచి వేసిందా అనేది పరిశీలించాలి. శరీరంపై కాటువేస్తే ఎన్ని గాట్లు పడ్డాయనేది ప్రధానంగా గుర్తించాలి. ఎందుకంటే విషం ఉన్న పాములు కాటేస్తే కేవలం రెండు గాట్లు మాత్రమే పడతాయి. సాధారణ పాములు కాటువేస్తే రెండు కంటే ఎక్కువ గాట్లు పడతాయి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాములు కాటేస్తే రెండు గాట్లు మాత్రమే పడతాయి.
వైద్యం అందకేమృత్యువాత....
ఏటా దేశంలో 2 లక్షల మంది పాముకాటుకు గురవుతుండగా, సకాలంలో వీరికి వైద్యం అందక దాదాపు 30 వేల మంది మృత్యువాత పడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 3 వేల రకాలకు పైగా పాములున్నప్పటికీ వాటిలో 350 రకాలు మాత్రమే విషపూరితమైనవని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. విషం ఉన్న పాములలో కూడా కట్లపాము, తాచుపాము, రక్తపింజర ప్రమాదకరం. ఇవి కాటేస్తే వాటి విష ప్రభావం కేంద్ర నాడీ మండలంపై పనిచేస్తుంది. దీంతో మరణం వేగంగా సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంది.
కాటువేసిన వెంటనే ప్రథమ చికిత్స....
పాము కాటువేసిందని తెలిసిన వెంటనే ఏమాత్రం ఆందోళన చెందడం గానీ, అటూఇటూ పరిగెత్తడం గాని చేయకూడదు. పాముకాటు వేసిన వెంటనే నిమిషాల వ్యవధిలో అప్రమత్తం కావాలి. పాముకాటువేసిన శరీరానికి పై భాగంలో తాడుతో గానీ, గుడ్డతో గానీ, రబ్బర్‌తో గానీ గట్టిగా కట్టాలి. ఎందుకంటే విషం రక్తంలో కలసి గుండెకు చేరితే మరణం సంభవించినట్లే లెక్క. పాము కాటేసిన చోట బ్లేడుతో కొద్దిగా గాయం చేసి విషం కలిసిన రక్తాన్ని బయటకు వెళ్లేలా చేయాలి.
విషప్రభావం ఇలా...
మానవ శరీరంపై విషం రెండు రకాలుగా ప్రభావాన్ని చూపుతుంది. నరాలపై చూపే ప్రభావాన్ని న్యూరో టాక్సిన్ పాయిజన్‌గా, నేరుగా గుండెపై చూపే ప్రభావాన్ని కార్డియో టాక్సిన్ పాయిజన్‌గా పిలుస్తారు. ఒక్కోసారి ఏ పాము కరిచిందో సరిగా తెలియని పరిస్థితులలో ఏ పాము విషానికైనా విరుగుడుగా పనిచేసే యాంటీవీనమ్‌ను వేస్తారు. ఈ మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో అందుబాటులో ఉన్నాయి. పాముకాటుకు గురైన బాధితుడిని త్వరితగతిన ఆసుపత్రులకు చేర్చినట్లయితే ప్రాణాపాయం నుంచి బయటవడవచ్చు.
స్పందించడమే ప్రధానం
పాముకాటుకు గురైన వెంటనే స్పందించడమే ప్రధానం. కాటువేసిన భాగానికి పైన తాడుతో కట్టి నూతన బ్లేడుతో కాటువేసిన చోట చిన్న గాయం చేసి రక్తాన్ని బయటకు పిండేయాలి. దీనివల్ల శరీరంలోకి ప్రవేశించిన విషం గుండెకు చేరకుండా ఉంటుంది. తక్షణమే ఆసుపత్రికి వస్తే సకాలంలో చికిత్స అంది ప్రాణాలు నిలుస్తాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో పాముకాటు మందులను 24 గంటలూ అందుబాటులో ఉంచి ఉచితంగానే ఇస్తున్నారు.– డాక్టర్. ఆర్.నరేంద్రసింగ్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, నూజివీడు.
Comments
Please login to add a commentAdd a comment