అవనిగడ్డ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న పాముకాటు బాధితులు
పాముకాట్లతో దివిసీమ వణికిపోతోంది.. వానలు పడుతూ పొలంపనులు ముమ్మరం చేస్తున్న వేళ వరుస పాముకాట్లతో రైతులు, కూలీలు బెంబేలెత్తుతున్నారు. ఏ గట్టు చాటునుంచి ఏ పామొస్తుందో తెలీక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనులు చేసుకోవాల్సిన దుస్థితి. ప్రతీరోజూ పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
అవనిగడ్డ: దివిసీమలో పాముకాటు ఉధృతి తగ్గలేదు. మూడు రోజుల వ్యవధిలో 46 మంది పాముకాటు బారిన పడ్డారు. సోమవారం అవనిగడ్డ ఏరియా వైద్యశాలలో కొత్తగా 11 మంది పాముకాటు బాధితులు చేరారు. కోడూరు పీహెచ్‌సీలో ఇద్దరు చికిత్స తీసుకుంటున్నారు. గత నాలుగు నెలల్లో పాముకాటు బాధితుల సంఖ్య 275కి చేరింది. వర్షాలు పడుతుండటం, వ్యవసాయ పనులు ప్రారంభం కావడం, కృష్ణానదికి వరద రావడం వల్ల కలుగుల్లో ఉన్న పాములు బయటకు రావడంతో ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
సోమవారం 13 కేసులు..
అవనిగడ్డ ఏరియా వైద్యశాలలో సోమవారం కొత్తగా పాముకాటు కేసులు 11 నమోదయ్యాయి. గతంలో చికిత్స తీసుకుంటున్నవారితో కలిపితే మొత్తం 17 మంది వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉండగా, మిగిలిన వారంతా పురుషులు. కోడూరు పీహెచ్‌సీలో సోమవారం ఇద్దరు పాముకాటుకు చికిత్స తీసుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి సోమవారం వరకూ దివిసీమలో పాముకాటుకు గురైన సంఖ్య 272కి చేరింది. పాముకాటు ఉధృతిపై పత్రికలు, చానళ్లలో వరుస కథనాలు రావడంతో శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ ఏరియా వైద్యశాలతో పాటు కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి మండలాల్లోని పీహెచ్‌సీలను ఆకస్మిక తనిఖీ చేసి పాముకాటు చికిత్స, మందుల నిల్వలపై ఆరా తీశారు. డీసీహెచ్‌ఎస్ జ్యోతిర్మయి, డీఎంహెచ్‌ఓ లక్ష్మీబాల దివిసీమలోని పలు పీహెచ్‌సీలను సందర్శించారు. దివిసీమలో పాముకాటు బాధితులు పెరిగిన నేపధ్యంలో అన్ని పీహెచ్‌సీల్లో యాంటీ స్నేక్ వీనం మందును అందుబాటులో ఉంచాలని, పాములను నివారించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
యాంటీవీనమ్ అందుబాటులో ఉంచాలి
శ్రీకాకుళం(ఘంటసాల): నియోజకవర్గంలో పాముకాటు కేసులు అధికంగా ఉంటున్నాయని పీహెచ్‌సీలలో యాంటీవీనమ్ మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి టి.పద్మజరాణి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మండల పరిధిలోని శ్రీకాకుళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పద్మజరాణి సోమవారం ఆకస్మిక తనఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర మందులు, వైద్య సేవలు ఆరా తీయడంతో పాము కాటు, కుక్క కాటు మందుల నిల్వలను తనఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు సీజన్ కావడంతో పాటు వర్షాలకు రైతులకు, కూలీలకు పాము కాట్లు ఎక్కువుగా జరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల మందులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అన్ని పీహెచ్‌సీల్లో పాము కాటు, కుక్కకాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచామని పీహెచ్‌సీ డాక్టర్ కె.శ్రీవిద్యకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment