పులిగడ్డ వద్ద తాచుపాముని పట్టుకుని చూపిస్తున్న సొసైటీ సభ్యుడు కిరణ్‌కుమార్
అవనిగడ్డ : దివిసీమలో పాముకాట్లు బెడద తగ్గలేదు. మంగళవారం అవనిగడ్డ, కోడూరు వైద్యశాలల్లో 12 కేసులు నమోదయ్యాయి. అవనిగడ్డ ఏరియా వైద్యశాలలో 5, కోడూరు పీహెచ్‌సీలో 7 కేసులు నమోదవ్వగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వ్యవసాయశాఖ, అటవీశాఖ, మండల ప్రత్యేక అధికారులు పొలాలకు వెళ్లి పాములు, పాముకాటు వేసినపుడు తీసుకోవాల్సిన చర్యలను కూలీలు, రైతులకు వివరిస్తున్నారు. దివిసీమలో పాముల బెడద ఇంకా తగ్గలేదు. విశ్వనాధపల్లిలో ఓ రైతు పొలంలోని నారుమడిలో రెండు పాములను చంపడంతో కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. నాగాయలంక పీహెచ్‌సీ పరిధిలో ఇద్దరు పాముకాటు బాధితులు రాగా విషసర్పాలు కాకపోవడంతో ప్రాధమిక చికిత్స చేసి పంపించేశారు.
స్నేక్ ఫేవర్ సొసైటీ సభ్యులు రాక
అడిషనల్ ఏసీపీ దేవానంద్, ఏపీ చాంబర్ ప్రెసిడెంట్ సాంబశివరావు ఇచ్చిన సమాచారం మేరకు విశాఖపట్నంకు చెందిన స్నేక్ పేవర్ సొసైటీ అధ్యక్షుడు రొక్కం కిరణ్‌కుమార్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులు మంగళవారం దివిసీమకు వచ్చారు. తొలుత స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలను సందర్శించి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణదొరతో పాముకాట్లు పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యశాలలో చికిత్స పొందుతున్న పాముకాటు బాధితులను పరామర్శించి మనోధైర్యం నింపారు. అన్ని పాములు విషసర్పాలు కాదని, పాముకాటుకు గురైనపుడు ఆందోళన పడకుండా సమీపంలోని వైద్యశాలకు వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బృందం నాయకుడు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఒకేరోజు 24 మందిని పాములు కాటేశాయని చెబితే పట్టుకోవడానికి వచ్చామని, దివిసీమలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినట్టు ఇక్కడకు వచ్చాక తెలిసిందన్నారు. తిరిగి వెళుతున్నామని, రెండు మూడు రోజుల్లో పలు రకాల పాములను దివిసీమకు తీసుకొచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. పాములు కనబడినపుడు కాటు వేయకుండా పట్టుకునే విధానం, పాముకాటుకు గురైనపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. వారు తిరిగు వెళుతూ పులిగడ్డ వద్ద ఓ నల్లత్రాచు పాముని, రెండు జర్రిపాములను పట్టుకునితీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment