పాముకాటుకు గురైన చిన్నారులు (అంతరచిత్రం) కాలి వేలికి పడిన పాముకాటు గాటు
కృష్ణాజిల్లా, అవనిగడ్డ : ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు పాముకాటుకు గురైన ఘటన లంకమ్మమాన్యంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం స్థానిక పంచాయతీ పరిధిలోని లంకమ్మమాన్యం కాలనీలో నివాసం ఉంటున్న తోట గంగాధర్, భార్య, ఆరేళ్ళ వయస్సున్న వేణుమాధవ్, మూడేళ్ళ నవీన్‌కుమార్ శనివారం ఇంట్లో నేలపై నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో పిల్లలిద్దరూ లేచి బిగ్గరగా ఏడవడంతో తండ్రి లేచి లైట్ వేసి చూశారు. ఇద్దరి పిల్లల కాలి నుంచి రక్తం కారడం, గాట్లు ఉండటంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణదొర గాట్లను పరిశీలించి పాముకాటుకు గురైనట్టు చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితి లేదని, అయినా 24 గంటలు పరిశీలనలో ఉంచాలని వైద్యులు చెప్పినట్టు గంగాధర్ తెలిపారు. కాగా, మరో ఇద్దరు పాముకాటుకు గురవ్వగా స్థానిక ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్టు వైద్యులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment