ప్రతీకాత్మక చిత్రం
హన్మకొండ : రైతు బీమా పథకం గడువును ప్రభుత్వం పెంచింది. ఈనెల 20తో గడువు ముగిసినా ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఆగస్టు 15న బాండ్ పొందాలనుకునే రైతులు ఈనెల చివరి వరకు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ మేరకు బాం డులు జారీ చేసేందుకు జూలై 15 వరకు గడువు విధించగా దరఖాస్తులు సేకరణ పూర్తి కాకపోవడంతో గడువు పెంచుతూ వస్తోంది. ఈ నెలాఖరులోపు రైతుల వివరాలు దరఖాస్తు ఫారంలో నింపి రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపించిన రైతులకు వచ్చే నెల 15న బీమా బాండ్లు చేతికందుతాయి. నిర్ణీత సమయంలో దరఖాస్తు ఫారాలు రైతుల నుంచి రాక పోవడంతో మరో అవకాశం ఇచ్చింది.
రైతులందరికీ అవకాశం..
ప్రతి రైతు బీమా కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకం తీసుకువచ్చింది. దీనికి సంబం ధించిన ప్రీమియం ఒక్కో రైతుకు రూ.2,271లు ప్రభుత్వం చెల్లిస్తుండగా భారతీయ జీవిత బీమా సంస్థ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించేందుకు ముందుకు వచ్చింది. రైతు ఏ కారణంచేత మరణించినా అతడి కుటుంబానికి రూ.5 లక్షలు అం దుతాయి.
18 నుంచి 59 ఏళ్ల వయసు రైతులు అర్హులు. ఈ పథకంలో చేరేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫారాలు రైతుల పేరుతో ముద్రించిన ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా లబ్ధిదారులకు సంబంధించిన సమాచారాన్ని దరఖాస్తు ఫారాల్లో నింపుతున్నారు. ఇందుకు గ్రామ రైతు సమన్వయ సమితులు సహకారం అందిస్తున్నాయి. అయితే వివిధ కారణాలతో నిర్ణీత గడువులోగా దరఖాస్తు పూర్తి చేసి సమర్పించలేక పోయారు.
కొనసాగుతున్న వివరాల సేకరణ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 6,16,266 మంది రైతులున్నారు. ఇప్పటి వరకు 4,65,747 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హత కలిగిన 3,63,323 మంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపారు. వ్యవసాయ విస్తరణాధికారులు రైతుకు సంబంధించిన నామినీ పేరు, ఆధార్ నంబర్, రైతు సంతకం, నామినీ ఆధార్ నంబర్ వివరాలు తీసుకుంటున్నారు.
రైతుబంధు చెక్కు పొందిన వారు అర్హులు..
పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతులతో పాటు, ఏదేని కారణం చేత పట్టాదారు పాసుపుస్తకం అందక రైతుబంధు చెక్కు పొందిన రైతులు కూడా రైతు బీమా పథకానికి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. రైతు బంధు చెక్కు అందుకున్న రైతు బీమాకు ఎందుకు అర్హుడు కాకూడదని ఆలోచించి మళ్లీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మరికొందరు రైతులకు బీమా సౌకర్యం కలుగనుంది.
తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు..
31లోగా దరఖాస్తు చేసుకోలేని రైతుల పరిస్థితి ఏమిటని సంబంధిత అధికారులను వివరణ కోరగా ఆ తర్వాత కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment