సాక్షి, అమరావతి: వ్యవసాయ పరికరాలు కొనాలంటే ఎమ్మెల్యే సిఫార్సులు తప్పనిసరంటూ వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో తెగేసి చెబుతున్నారు. ఎమ్మెల్యే ఆఫీసు నుంచి చెప్పనిదే చిన్నపాటి పరికరాల కోసం దరఖాస్తు చేసినా తిరస్కరిస్తున్నారు. కనీసం దరఖాస్తులూ తీసుకోవడం లేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పథకం కింద రైతులకు అవసరమైన పరికరాలను వారే కొనుగోలు చేసుకొనే విధానాన్ని ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. దరఖాస్తుతో వెళ్తే ఎమ్మెల్యే సిఫార్సులుండాలని వ్యవసాయ అధికారులు చెబుతుండడంతో, సేద్యం పనులు మానుకొని అటు ఎమ్మెల్యే ఇళ్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగలేక అన్నదాలు అష్టకష్టాలు పడుతున్నారు.
ఏమిటీ డీబీటీ?
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో రైతులకు అవసరమైన పరికరాలను వారే కొనుగోలు చేసుకోవచ్చు. పరికరాలు రాయితీపై తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి డీబీటీ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. రైతులు తమకు అవసరమైన యాంత్రిక పరికరం పొందడానికి వారే స్వయంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు. బిల్లులను వ్యవసాయ శాఖకు అందచేస్తే రాయితీతో కలిపి మొత్తం నగదును రాష్ట్ర ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది. ప్రస్తుత ఖరీఫ్‌కు దాదాపు రూ.400 కోట్లను కేటాయించారు. రైతులు తమకు అవసరమైన ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, రొటోవేటర్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, గ్రాస్ కట్టర్, డిస్క్‌ప్లవ్ వంటి పరికరాలను కొనుగోలు చేసేందుకు వ్యవసాయశాఖ అధికారుల ద్వారా దరఖాస్తు చేయాలి.
సిఫార్సు తప్పనిసరి
గ్రామాల్లో ఎంపీవో (మల్టీపర్పస్ ఎక్స్‌టెన్షన్ అధికారి) నుంచి దరఖాస్తు తీసుకునేందుకు రైతులు వెళితే, ఎమ్మెల్యే ఆఫీసు నుంచి ఫోన్ చేయించుకోవాలని, లేకుంటే అక్కడి నుంచి సిఫార్సు లేఖ తీసుకురావాలని చెబుతున్నారు. పదిరోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితిలో తమకు అవసరమైన చిన్నపాటి పరికరాలను రాయితీపై పొందడానికి రైతులు చేస్తున్న ప్రయత్నాలకు ఎమ్మెల్యేలు పెద్ద అడ్డంకిగా మారారు. రూ.5 లక్షల రాయితీ లభించే వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు, రొటోవేటర్లు వంటి పరికరాలకు గతంలో ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇచ్చేవారని, ఇప్పుడు రూ.5 వేల నుంచి రూ.10 వేల రాయితీ లభించే చిన్నపాటి పరికరం పొందడానికీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు కావాలని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేలు కావాలనే చేస్తున్నారు..
దీనిపై అధికారులు వివరణ ఇస్తూ.. కొందరు రైతులు దరఖాస్తులు పూర్తి చేసుకునే విధానం తెలియక ఎమ్మెల్యేల కార్యాలయాలకు వెళ్తున్నారని, అక్కడి సిబ్బందితో దరఖాస్తులు పూర్తి చేయించుకుని తమకు ఇస్తున్నారని చెబుతున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమకు తెలియకుండా నియోజకవర్గాల్లో ఏమీ జరగకూడదని, ప్రతీ దరఖాస్తును తాము చూడనిదే, సిఫార్సు చేయనిదే ఇవ్వవద్దని ఎమ్మెల్యేలు చెబుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పనిచేయలేమనే భావనతో రైతులను ఎమ్మెల్యేల కార్యాలయాలకు పంపుతున్నామని అధికారులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే సిఫార్సులుంటేనే పరికరాలిస్తాం!
Published Sat, Aug 18 2018 3:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment