రైతు సొమ్ము.. రాబందుల పాలు! | Irregulars mislead the money of Rythu Bandhu Funds | Sakshi
Sakshi News home page

రైతు సొమ్ము.. రాబందుల పాలు!

Published Thu, Sep 6 2018 2:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM

Irregulars mislead the money of Rythu Bandhu Funds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుబంధు సొమ్ముపై రాబందుల కన్ను పడింది. రైతులకు పెట్టుబడి కింద ఇస్తున్న సొమ్మును కొన్నిచోట్ల అక్రమార్కులు కాజేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో పెట్టుబడి మొత్తాన్ని స్వాహా ఘటన వెలుగు చూడటంతో సర్కారు ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఎంతో పకడ్బందీగా పెట్టుబడి చెక్కులను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అక్రమాలు జరగడం ఆగలేదు. ఇందులో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు కీలక సూత్రధారులుగా ఉన్నట్లు తెలిసింది. దీంతో సీరియస్‌ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. పెట్టుబడి సొమ్మును బ్యాంకు, రెవెన్యూ అధికారులతోపాటు బయటి వ్యక్తులు అక్రమంగా కొట్టేసినట్లు ప్రాథమిక విచారణలో ఈ మేరకు వెల్లడైంది. సుమారు రూ.70 లక్షలు కాజేసినట్లు నిర్ధారణ అయింది. వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం కూ డా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయా అన్న కోణంలోనూ ప్రభుత్వం దృష్టి సారించింది. 

మిగిలిన చెక్కులు 7.7 లక్షలు 
గత మేలో ప్రభుత్వం రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 58.16 లక్షల మంది పట్టాదారులకు 58.81 లక్షల చెక్కులు ముద్రించారు. 51.11 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. 7.7 లక్షల చెక్కులు పంపిణీ కాకుండా మిగిలిపోయాయి. ఇందులో చనిపోయిన వారి పేరు మీద, భూమిని మొత్తం అమ్ముకున్న వారి పేర్ల మీద, విస్తీర్ణం ఉన్న దాని కంటే ఎక్కువ, తక్కువగా పడి మరికొందరి పేర్ల మీద చెక్కులు ముద్రితమయ్యాయి. అందులో విదేశాల్లో ఉన్నవారి పేరు మీద దాదాపు 70 వేలు, చనిపోయిన రైతుల పేరు మీద లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. కొన్ని రకా ల చెక్కుల్లో లోపాలున్నందున వాటిని తీసుకొచ్చే రైతులకు సొమ్ము చెల్లించవద్దని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీచేసింది.

వాటిని విత్‌హోల్డ్‌లో పెట్టా లని ఆదేశించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు నల్లగొండలో ‘విత్‌ హోల్డ్‌’లో ఉన్న 551 చెక్కులను నగదుగా మార్చుకుని పంచుకున్నారు. నల్లగొండలోని నాంపల్లి మండలంలో ఎస్‌బీఐ బ్యాం కు క్యాషియర్, ప్రభుత్వాధికారులు, బయటి వారితో కలిసి సొమ్మును కాజేసినట్లు జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెద్ద అడిశెర్లపల్లి, చింతపల్లి, నాంపల్లి, గుర్రంపోడు, దేవర కొండ, చండూరు మండలాలకు చెందిన విత్‌హోల్డ్‌లో ఉన్న రైతుబంధు చెక్కులు డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ సంఘటనలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

రైతు నుంచి ఎలా కొట్టేశారు 
నిబంధనల ప్రకారం సంబంధిత పట్టాదారు రైతు మాత్రమే చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళ్లాలి. నగదు తీసుకునే సమయంలో పట్టాదారు పాసు పుస్తకం చూపించాలి. ఒకవేళ పాసు పుస్తకం రానట్లయితే ఆధార్‌ కార్డు, ఓటరు ధ్రువీకరణ కార్డును చూపించాల్సి ఉంది. కాని ఇవేమీ పట్టించుకోకుండానే నాంపల్లి మండల ఎస్‌బీఐ క్యాషియర్‌.. విత్‌హోల్డ్‌లో ఉంచిన రైతుబంధు చెక్కులను రెవెన్యూ, ఇతర ప్రభుత్వాధికారులతో కలిసి అక్రమంగా నగదులోకి మార్చారు. అయితే రైతుల వద్ద ఉన్న చెక్కులను రెవెన్యూ అధికారులు, బ్యాంకర్లు ఎలా కొట్టేశారో ఇప్పటికీ తేలలేదు. మరోవైపు మిగిలిపోయిన చెక్కులను ప్రభుత్వం ఇంకా జిల్లాల్లోనే ఉంచడంలో అర్థం లేదన్న చర్చ జరుగుతోంది. పైగా విదేశాల్లో ఉన్న పట్టాదారు చెక్కులను పంపిణీ చేయడంలో తాత్సారం చేస్తుండటంపైనా విమర్శలు వస్తున్నాయి. 

కలెక్టర్‌ను ఆదేశించాం
పెట్టుబడి చెక్కుల సొమ్మును కాజేసిన అంశంపై విచారణ చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాం. ఇందులో రెవెన్యూ, బ్యాంకు అధికారులు బాధ్యులుగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. ఇప్పటికే బ్యాంక్‌ క్యాషియర్‌పై కేసు నమోదైంది. కలెక్టర్‌ నుంచి రెండు, మూడు రోజుల్లో నివేదిక రానుంది.
పార్థసారథి, ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement