సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ భూములుండి విదేశాల్లో నివసిస్తున్న(ఎన్‌ఆర్‌ఐ) పట్టాదారులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సొమ్ము అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి పేరిట ఉన్న చెక్కులను ఎవరికీ ఇవ్వకపోవడంతో వ్యవసాయశాఖ వద్దే ఉండిపోయాయి. ఒకానొక సందర్భంలో విదేశాల్లో ఉన్నవారికి ‘సొమ్ము ఇవ్వడం అవసరమా’అన్న ధోరణిలో వ్యవసాయ శాఖ వర్గాలున్నట్లు ప్రచారం జరిగింది. ఎన్నికల సమయంలో అనవసరంగా వ్యతిరేకత మూటగట్టుకోవడం అవసరమా అన్న భావనతో ఎన్‌ఆర్‌ఐలకు చెక్కులు ఇచ్చేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం కూడా నిర్వహించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో దాదాపు 61 వేల మంది ఎన్‌ఆర్‌ఐ రైతులకు లబ్ధి కలగనుంది. చనిపోయిన రైతుల పేరుతో ఉన్న చెక్కులు, రాష్ట్రం సహా దేశంలోనే వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పట్టాదారుల చెక్కుల పంపిణీపైనా నిర్ణయం తీసుకోలేదు.
కుటుంబసభ్యులకు సొమ్ము...
ఈ ఖరీఫ్‌లో 1.43 కోట్ల ఎకరాల భూమి కలిగిన 58.33 లక్షల మంది రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం చెక్కులను ముద్రించింది. అందుకోసం రూ. 5,730 కోట్లు బ్యాంకులకు అందజేసింది. అయితే, ఇప్పటివరకు కేవలం 48 లక్షల మంది రైతులే చెక్కులు తీసుకున్నారు. రూ. 5,100 కోట్లు రైతులకిచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఉన్న 61 వేల మంది పట్టాదారులకు ఇప్పుడు ఎలా ఇవ్వాలన్న దానిపై సర్కారు కసరత్తు చేస్తోంది. అత్యధిక మంది బతుకుదెరువు, వ్యాపార, ఉపాధి, ఉద్యోగాల కోసం గల్ఫ్‌సహా వివిధ దేశాల్లో ఉంటున్నారు. రైతుబంధు పథకం నిబంధనల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతే స్వయంగా వచ్చి చెక్కు తీసుకోవాలి. ఈ నిబంధన విదేశాల్లో ఉన్న పట్టాదారులకు ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐల డిక్లరేషన్ మేరకు వారి కుటుంబసభ్యులకు చెక్కులిచ్చే అవకాశాలున్నాయి. అయితే, కుటుంబసభ్యులెవరూ ఇక్కడ లేని పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.
చనిపోయిన రైతుల పేరుతో 90 వేల చెక్కులు
మరో 90 వేల చెక్కులు చనిపోయిన రైతుల పేరుతో ఉన్నాయి. వాటిని సర్దుబాటు చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరోవైపు, రాష్ట్రంలోనూ, దేశంలోనూ వివిధ ప్రాంతాల్లో ఉండే 1.14 లక్షల మంది చెక్కుల అందజేతపైనా మీమాంస కొనసాగుతోంది. చెక్కులను జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో కౌంటర్లు పెట్టి అందజేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పటికీ చెక్కులు జిల్లాల్లోనే ఉన్నాయి. దీంతో గ్రామాలకు వెళ్లడానికి వీలుపడని వారంతా కూడా ఆ చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు.
ఎన్‌ఆర్‌ఐలకు ‘పెట్టుబడి’
Published Sat, Sep 22 2018 1:59 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment