
సాక్షి, విశాఖపట్నం: మహారాష్ట్ర తరహాలో ఏపీలోనూ రైతులు తమ హక్కుల సాధన కోసం సమష్టిగా ఉద్యమించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. పోరాటాన్ని రాజధాని ప్రాంతమైన ఉండవల్లి నుంచే మొదలు పెడతామన్నారు. ఇందుకోసం అన్ని ప్రాజెక్టుల భూ నిర్వాసితులతో జేఏసీ ఏర్పాటు చేద్దామన్నారు. శుక్రవారం ఉదయం అమరావతి, కాకినాడ సెజ్, పోలవరం, సోంపేట, వంశధార ప్రాజెక్టులు, భావనపాడు పోర్టు, కొవ్వాడ అణు విద్యుత్కేంద్రం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు భూ నిర్వాసితులతో కలిసి విశాఖలో ఏపీ భూ నిర్వాసితుల జనసభ నిర్వహించారు.
ఈ సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ పురాణాల్లో హిరణ్యకశ్యపుడి మాదిరిగానే నేటి పాలకులు భూములు లాక్కొని రైతును, రైతు కుటుంబాలను రోడ్డు పాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రాజధాని కన్పించదు. పరిశ్రమలు రావు. ఉద్యోగాలు ఇవ్వరు. కానీ వాటి పేరు చెప్పి వేల ఎకరాలను బలవంతంగా లాక్కుంటూ.. రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని’ ఆరోపించారు. విశాఖలో ఇన్నో సొల్యూషన్స్, ప్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలకు ఎకరా రూ.35 లక్షలకే కట్టబెట్టారని, బయట వాళ్లకైతే ఎకరా రూ.3.5 కోట్లు అంటున్నారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేసే వరకు, భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలన్నారు.
నీకు కన్పించకపోతే..నీ కొడుకును పంపు..
ఉత్తరాంధ్రలో సమస్యలు మీ కంటికి కన్పించకపోతే మీ కొడుకు లోకేష్‌ను పంపితే ఆయనకు చూపిస్తానని పవన్‌కల్యాణ్ చంద్రబాబుకు సూచించారు. జూట్ మిల్లును సందర్శించిన అనంతరం తగరపువలస జంక్షన్‌లో జరిగిన బహిరంగçసభలో 2019 ఎన్నికల్లో టీడీపీ గూండాలు పేట్రేగిపోయి దౌర్జన్యంగా ఓట్లు వేయించుకుంటారని ఆరోపించారు. ‘మంత్రి గంటా, ఎంపీ అవంతి గెలుపొందడానికి నేనే కారణం.. కానీ వాళ్లు ఈ ప్రాంతానికి ఏం చేశారని’ ఆయన ప్రశ్నించారు. ‘వైఎస్సార్‌సీపీ నుంచి లాక్కున్న ఎంపీలతో కలిసి మీకు 19 మంది ఉన్నా కనీసం రైల్వే జోన్ కూడా ఎందుకు సాధించలేకపోతున్నారని’ నిలదీశారు.
నేడు నిరసన కవాతు..
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయానికి నిరసనగా విశాఖలో శనివారం నిరసన కవాతు జరపనున్నట్టు జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటలకు బీచ్‌రోడ్‌లోని ప్రారంభం కానున్న నిరసన కవాతుకు పవన్ సారథ్యం వహిస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment