సాక్షి, విశాఖపట్నం/శృంగవరపుకోట: ప్రాంతీయ అసమానతలపై ప్రశ్నిస్తే విద్వేషాలు రెచ్చగొడుతున్నానంటూ వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లా శృంగవరపుకోట దేవీ జంక్షన్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘పట్టిసీమకు రూ.2వేల కోట్లు ఇవ్వగలిగినపుడు ఈ నియోజకవర్గంలో 8 లక్షల ఎకరాలకు నీరిచ్చే బాబూ జగ్జీవన్‌రామ్ ఎత్తిపోతల పథకానికి డబ్బులు లేవంటే ప్రాంతీయ అసమానతలు రావా? మీరు అసమానతలు సృష్టించి మమ్మల్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నామనడం ఏమిటి?’ అని ప్రభుత్వ పెద్దలను నిలదీశారు. ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా నిరుద్యోగమే కనిపిస్తోందన్నారు.
బాబు వస్తే జాబు అన్నారనీ, కానీ ముఖ్యమంత్రి గారి బాబుకే జాబు వచ్చింది తప్ప ఎవ్వరికీ రాలేదని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం వచ్చి పోరాటం ప్రారంభిస్తే నిరుద్యోగ భృతి ప్రకటించారని, కానీ వారికి కావాల్సింది ఉద్యోగమని గుర్తుంచుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రతి ఉద్యోగాన్ని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ చేసి, దేశం నేతల నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకూ రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు అమ్ముకుని వసూళ్లు చేసుకున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ఎంపీలంతా కనీసం ఒక్క కొత్తవలస రైల్వేబ్రిడ్జి సాధించలేకపోయారని విమర్శించారు. ఓ ఎంపీ ఏకంగా జోన్ లేదూ గీనూ లేదూ అంటారు.. ఇదేం తీరని పవన్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు చెందిన 23 కులాల వారు హైదరాబాద్‌లో స్థిరపడినా, తెలంగాణలో బీసీ జాబితాలో వారు లేరని, దీనిపై మన రాష్ట్ర సీఎం ఎలాగూ పట్టించుకోరు కాబట్టి తానే తెలంగాణ సీఎంతో మాట్లాడతానన్నారు.
నేడు తుమ్మపాల సుగర్స్‌కు పవన్
శృంగవరపుకోట పర్యటన అనంతరం విశాఖ–విజయనగరం జిల్లా సరిహద్దులోని తాటిపూడి జలాశయాన్ని పవన్ కల్యాణ్ సందర్శించారు. అక్కడ స్థానికులతో ముచ్చటించారు. అక్కడ నుంచి రాత్రి విశాఖలోని సాయిప్రియ రిసార్ట్స్‌కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు విశాఖ నగరంలోని టీపీటీ కాలనీలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అక్కడ నుంచి 10.30 గంటలకు అనకాపల్లిలోని తుమ్మపాల సుగర్స్‌కు వెళ్తారు. అక్కడ కార్మికులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం 12 గంటలకు అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 2.30 గంటలకు తాడి గ్రామాన్ని సందర్శిస్తారు. అక్కడ ఫార్మా కంపెనీ ప్రభావిత గ్రామాల ప్రజలతో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు జిల్లాలోని చోడవరం చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి విశాఖ చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment