
సాక్షి, హైదరాబాద్: రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పోరుబాటకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారంలో ముందుండేలా ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు ఎన్నికల ఆలోచనల నేపథ్యంలో పార్టీని వీలైనంతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించింది. ఆ తరువాత జిల్లాల్లో బస్సుయాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నా.. కలసి వచ్చే పక్షాలనూ కలుపుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే ముందు సొం త కార్యాచరణే చేపట్టాలని ఇటీవల ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీజేఎస్ అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
సకల జనుల సమ్మె రోజునే..
పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను ఎత్తిచూపుతూ వాటి సవరణ కోసం మండల కేంద్రాల్లో రైతులతో విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి చేపట్టాలని టీజేఎస్ నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి వారం రోజులు.. రైతు బంధులో జరుగుతున్న అవకతవకలు, నష్టపోయిన రైతులతో మండల అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యాచరణను అమలు చేయనుంది. ఆ బాధ్యతలను టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డికి అప్పగించింది. రైతులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై వచ్చేనెల 12న హైదరాబాద్‌లో దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. సకల జనుల సమ్మె చేపట్టిన సెప్టెంబర్ 12వ తేదీనే ఈ దీక్ష చేపట్టాలని తీర్మానించింది.
రాజీవ్ లేదా విజయవాడ రహదారిపై
భూములు తీసుకున్న వివిధ కంపెనీలను పరిశీలించి ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారో ఈ నెల 27 నుంచి 31 వరకు కార్యక్రమం నిర్వహించి చర్చించాలని టీజేఎస్ నిర్ణయించింది. భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో నిరుద్యోగుల నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30న రాజీవ్ రహదారి, విజయవాడ హైవేపై సడక్ బంద్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యాచరణ విజయవంతం కోసం అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. తరువాత పార్టీ అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో ప్రజల్లోకి వెళ్లాలని, జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది.