జహీరాబాద్: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసేలా ఉండాలి కాని, ఇబ్బందులకు గురిచేసేవిగా ఉండరాదని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం టీజేఎస్ జహీరాబాద్ నియోజకవర్గం ఇన్‌చార్జి ఆశప్ప చేపట్టిన రైతు దీక్షకు కోదండరాం సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో రైతుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదన్నారు. స్వరాష్ట్రంలోనూ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నా రు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సక్రమంగా సాగలేదని, అంతే కాకుండా అర్హులైన వారికి పట్టాదారు పాసు పుస్తకాలు అందని పరిస్థితి ఉందని అన్నారు. తమ భూములపైనే తమకు హక్కు లేకుండా పోయిందనే ఆందోళనలో రైతులు ఉన్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఆశప్ప చేపట్టిన దీక్ష అభినందనీయమన్నారు. వీటిని పరిష్కరించకుండానే సీఎం కేసీఆర్ తన పీఠం కోసమే ముందస్తు ఎన్నికలకు పోతున్నారని విమర్శించారు. భూములను కాపాడుకునేందుకు రైతులు తరతరాలుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారన్నారు. రాజకీయం అంటే ప్రభుత్వాన్ని నడిపి పరిష్కారం చూపడానికే కాని మోసం చేయడానికి కాదన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో వర్షాలు లేవని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. జహీరాబాద్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇందుకోసం మనం కూడా ప్రయత్నిద్దామన్నారు. హక్కుల సాధనకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment