raithu deksha
-
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
జహీరాబాద్: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసేలా ఉండాలి కాని, ఇబ్బందులకు గురిచేసేవిగా ఉండరాదని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం టీజేఎస్ జహీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఆశప్ప చేపట్టిన రైతు దీక్షకు కోదండరాం సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో రైతుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదన్నారు. స్వరాష్ట్రంలోనూ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నా రు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సక్రమంగా సాగలేదని, అంతే కాకుండా అర్హులైన వారికి పట్టాదారు పాసు పుస్తకాలు అందని పరిస్థితి ఉందని అన్నారు. తమ భూములపైనే తమకు హక్కు లేకుండా పోయిందనే ఆందోళనలో రైతులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఆశప్ప చేపట్టిన దీక్ష అభినందనీయమన్నారు. వీటిని పరిష్కరించకుండానే సీఎం కేసీఆర్ తన పీఠం కోసమే ముందస్తు ఎన్నికలకు పోతున్నారని విమర్శించారు. భూములను కాపాడుకునేందుకు రైతులు తరతరాలుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారన్నారు. రాజకీయం అంటే ప్రభుత్వాన్ని నడిపి పరిష్కారం చూపడానికే కాని మోసం చేయడానికి కాదన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో వర్షాలు లేవని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. జహీరాబాద్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇందుకోసం మనం కూడా ప్రయత్నిద్దామన్నారు. హక్కుల సాధనకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. -
పొంగులేటి రైతుదీక్ష
-
'వాయిదా పద్ధతిలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు'
నిజామాబాద్: రైతు బిడ్డనని చెప్పుకునే సీఎం కేసీఆర్ కు రైతుల సమస్యలు కనిపించడం లేదా? అని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో పొంగులేటి చేపట్టిన ఒక రోజు రైతు దీక్ష విరమించిన సందర్భంంగా టీఆర్ఎస్ సర్కారు అనుసరిస్తున్న ప్రస్తుత తీరుపై మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్ రైతుల పొట్టకొట్టి పరిశ్రమలకు విద్యుత్ ఇస్తోందన్నారు. వాయిదా పద్దతిలో టీఆర్ఎస్ సర్కార్ రైతులను ఇబ్బందులకు గురి చేస్తొందన్నారు. కేసీఆర్ అధికారంలోకొచ్చి ఏడాది పూర్తైనా రైతు సమస్య ఒక్కటైనా తీర్చారా అని పొంగులేటి నిలదీశారు. వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్రాలు కనీసం ఒక్కరూపాయైనా ఇచ్చి ఆదుకున్నాయా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఒక్క సంతకంతోనే రుణమాఫీ చేసిన విషయాన్ని ఈసందర్భంగా పొంగులేటి గుర్తుచేశారు. పదవుల కోసమో.. ఓట్ల కోసమో ఈ దీక్ష చేయడం లేదని, రైతు సమస్యలపైనే తమ పోరాటమని ఆయన స్పష్టం చేశారు. -
రైతు దీక్షను విరమించిన పొంగులేటి
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల సమస్యలపై రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేపట్టిన ఒక రోజు రైతు దీక్షను విరమించారు. ఆదివారం ఉదయం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో పొంగులేటి రైతు దీక్షను ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పొంగులేటికి దేవ నాయక్, వెంకట్ అనే రైతులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తెలంగాణలో రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైన సంగతి తెలిసిందే. అందులోభాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామారెడ్డిలో ఒకరోజు రైతు దీక్షకు సన్నద్ధమైయ్యారు. రైతు సమస్యలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని.. ఈ దీక్ష ఆరంభం మాత్రమేనని ఈ సందర్భంగా పొంగులేటి తెలిపారు. ఈ రైతు దీక్షకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో 2014 జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 784 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 140 కాగా, కరీంనగర్లో 115, ఆదిలాబాద్‌లో 98 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 50 మందికిపైగా రైతులు తనువు చాలించారు. -
అంతం కాదిది.. ఆరంభం
కామారెడ్డి: రైతుల పక్షాన తాము మొదలు పెట్టిన ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఆయన నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో ఒక రోజు రైతు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేందుకే తాము ఈ దీక్ష చేపట్టామని చెప్పారు. గిట్టుబాటు ధరలు కల్పించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై మాట్లాడటానికి తాను మూడుసార్లు సీఎంను కలిసేందుకు వెళ్లానని, కానీ, ఆయన కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. సమస్యలన్నీ పరిష్కారమయ్యేవరకు తాము రైతుల పక్షాన పోరాడతామని అన్నారు.