రైతు దీక్షను విరమించిన పొంగులేటి
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల సమస్యలపై రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేపట్టిన ఒక రోజు రైతు దీక్షను విరమించారు. ఆదివారం ఉదయం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో పొంగులేటి రైతు దీక్షను ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పొంగులేటికి దేవ నాయక్, వెంకట్ అనే రైతులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
తెలంగాణలో రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైన సంగతి తెలిసిందే. అందులోభాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామారెడ్డిలో ఒకరోజు రైతు దీక్షకు సన్నద్ధమైయ్యారు. రైతు సమస్యలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని.. ఈ దీక్ష ఆరంభం మాత్రమేనని ఈ సందర్భంగా పొంగులేటి తెలిపారు. ఈ రైతు దీక్షకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో 2014 జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 784 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 140 కాగా, కరీంనగర్‌లో 115, ఆదిలాబాద్‌లో 98 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 50 మందికిపైగా రైతులు తనువు చాలించారు.