'వాయిదా పద్ధతిలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు'
నిజామాబాద్: రైతు బిడ్డనని చెప్పుకునే సీఎం కేసీఆర్ కు రైతుల సమస్యలు కనిపించడం లేదా? అని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో పొంగులేటి చేపట్టిన ఒక రోజు రైతు దీక్ష విరమించిన సందర్భంంగా టీఆర్ఎస్ సర్కారు అనుసరిస్తున్న ప్రస్తుత తీరుపై మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్ రైతుల పొట్టకొట్టి పరిశ్రమలకు విద్యుత్ ఇస్తోందన్నారు. వాయిదా పద్దతిలో టీఆర్ఎస్ సర్కార్ రైతులను ఇబ్బందులకు గురి చేస్తొందన్నారు.
కేసీఆర్ అధికారంలోకొచ్చి ఏడాది పూర్తైనా రైతు సమస్య ఒక్కటైనా తీర్చారా అని పొంగులేటి నిలదీశారు. వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్రాలు కనీసం ఒక్కరూపాయైనా ఇచ్చి ఆదుకున్నాయా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఒక్క సంతకంతోనే రుణమాఫీ చేసిన విషయాన్ని ఈసందర్భంగా పొంగులేటి గుర్తుచేశారు. పదవుల కోసమో.. ఓట్ల కోసమో ఈ దీక్ష చేయడం లేదని, రైతు సమస్యలపైనే తమ పోరాటమని ఆయన స్పష్టం చేశారు.