రైతులను బలవంతంగా లాక్కెళ్తున్న పోలీసులు
తాడేపల్లి రూరల్: రాజధానికోసం భూములివ్వని రైతులపై ప్రభుత్వ దమనకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం ఉండవల్లిలో రైతుల పంటపొలాల్లోంచి హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమైన విద్యుత్‌శాఖ అధికారులు భారీగా పోలీసులను వెంటపెట్టుకుని వచ్చారు. ఆందోళన చెందిన రైతులు హడావుడిగా పంటపొలాలకు చేరుకుని వైర్లు లాగడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో రైతులు తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ పురుగుమందు డబ్బాలు, పెట్రోలు బాటిళ్లను బయటకు తీయగా.. వారిని పోలీసులు బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వైర్లు లాగుతాం.. ఏం చేస్తారు?
గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాలను ప్రభుత్వం రాజధానిగా ప్రకటించినప్పటినుంచి భూములివ్వని రైతులను ఏదోవిధంగా బెదిరిస్తూ దమనకాండకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఉండవల్లిలో రైతులకు చెందిన ఎనిమిది ఎకరాల పంటపొలాల్లోంచి హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమైన విద్యుత్‌శాఖ అధికారులు భారీగా పోలీసు బలగాలను వెంటపెట్టుకుని వచ్చారు. ఇది తెలుసుకున్న ఆయా పొలాలకు చెందిన 18 మందికిపైగా రైతులు హడావుడిగా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడుతుండగానే.. కాంట్రాక్టరు హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమవడంతో ఆగ్రహానికి లోనైన రైతులు అడ్డుకున్నారు.
వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే.. విద్యుత్ అధికారులు మళ్లీ వైర్లు లాగే ప్రయత్నం చేశారు. అంతేగాక.. వైర్లు లాగుతాం, ఏం చేస్తారో చెయ్యండంటూ రైతులపై విరుచుకుపడ్డారు. దీనిపై రైతులు.. అన్నం పెట్టే అన్నదాతలు మిమ్మల్నేం చేయగలరు. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన తహసీల్దార్.. వారిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. వైర్లు వెళ్లే స్థలాలకు కూడా జిల్లా కలెక్టర్ నష్టపరిహారం ఇస్తారంటూ చెప్పగా.. ఎలా ఇస్తారంటూ రైతులు ప్రశ్నించారు.
దానికి అధికారులు సమాధానం చెప్పకుండా వైర్లు లాగుతామంటూ ముందుకెళ్లారు. దాంతో రైతులు తమ జేబుల్లోనుంచి పురుగుమందు డబ్బాలు, పెట్రోలు బాటిళ్లు బయటకు తీశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆరుగురు రైతులను పోలీసులు బలవంతంగా జీపులో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మహిళా రైతులను పంటపొలాలనుంచి బలవంతంగా బయటకు గెంటేశారు. అనంతరం హైటెన్షన్ వైర్లను లాగే ప్రక్రియ చేపట్టారు. అదుపులోకి తీసుకున్న రైతులను గురువారం సాయంత్రం పూచీకత్తుపై వదిలిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment