power cables
-
కరెంట్ తీగలు తెగిపడి 26 మంది దుర్మరణం
మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోరం జరిగింది. రద్దీ మార్కెట్లో హై వోల్టేజ్ కేబుల్ తెగిపడి 26 మంది దుర్మణం చెందారు. కాంగో రాజధాని కిన్షాసా శివారులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా.. నాలా వ్యవస్థ దెబ్బతిని నీరు రోడ్ల మీదకు చేరుకుంది. ఆ సమయంలో మార్కెట్ దగ్గర్లోని బస్సు కోసం కొందరు ఎదురు చూస్తుండగా.. హఠాత్తుగా వైర్ తెగిపడి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 24 మంది మహిళలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
మూగజీవాలపై యమపాశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని హనుమాన్ బస్తీ, రామవరంలోని చిట్టిరామవరం పొలాల్లో విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. లక్ష్మీదేవిపల్లి, రేగళ్ల, ప్రగతినగర్ కాలనీలో కూడా విద్యుత్ తీగలు భయపెట్టిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేకుండా ప్రధాన రోడ్డుకు దగ్గరగా ఉన్నాయి. 2020–21 సంవత్సరంలో జిల్లాలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో 79 పశువులు, 23 మంది వ్యక్తులు చనిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు పాడి పశువులు, మూగ జీవాల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా వేలాడే విద్యుత్ తీగలు, ఏళ్ల తరబడి మరమ్మతులు, నిర్వహణ లేక గాలివానలకు తెగిపడే తీగలు, పడిపోయే స్తంభాలు, ఎర్తింగ్ లోపాలు, నాసిరకం పరికరాల కారణంగా రాష్ట్రంలో ఏటా వందల సంఖ్యలో మూగజీవాలు విద్యుదాఘాతానికి గురై మరణిస్తు న్నాయి. పెద్ద సంఖ్యలో రైతులు, ఇతరులు కూడా మృత్యువాత పడుతున్నారు. ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్/ ఎస్పీడీసీఎల్)ల అధికారిక లెక్కల ప్రకారం గడిచిన నాలుగేళ్లలో.. అనగా 2017–21 మధ్య కాలంలో రాష్ట్రంలో ఏకంగా 5,400కు పైగా మూగజీవాలు విద్యుత్ ప్రమాదాలకు బలయ్యాయి. ఏటా సగటున 1,300 మూగజీవాలు విద్యుత్ సంబంధిత ప్రమాదాల్లో మరణిస్తున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక అధికారిక లెక్కలకు అందని మూగజీవాల మరణాలు మరో రెండు రెట్లు అధికంగా ఉంటాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. రైతన్నల కుడిఎడమ భుజాలైన కాడెద్దులు పంట పొలాల్లో మేతకు వెళ్లినప్పుడో, మరో సందర్భంలోనో కరెంట్ షాక్‌కు గురై మృత్యు వాత పడటం ఆయా కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోంది. ప్రేమతో పెంచుకునే పాడి పశువులు విద్యుత్ ప్రమాదాల్లో మరణించినప్పుడు ప్రజల ఆవేదన వర్ణనాతీతంగా ఉంటోంది. లక్షల విలువైన పశువులతో పాటు జీవనాధారాన్ని కోల్పోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. 50 శాతం ప్రమాదాలకు శాఖా పరమైన లోపాలే కారణం కావడం విచారకరం. పరిహారం చెల్లింపుల్లో జాప్యం.. శాఖాపరమైన కారణాలతో మనుషులు, మూగ జీవాలు విద్యుదాఘాతానికి గురై మరణిస్తే డిస్కంలు విచారణ జరిపి పరిహారం చెల్లించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. మనుషులకు రూ.5 లక్షలు, ఆవులు, ఎద్దులు, గేదెలు వంటి పాడి పశువులకు రూ.40 వేలు, మేకలు, గొర్రెలకు రూ.7 వేల చొప్పున పరిహారం చెల్లించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) స్పష్టం చేసింది. అయితే ఈ పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. విచారణలు, నివేదికల పేరిట క్షేత్ర స్థాయి అధికారులు తాత్సారం చేస్తున్నారు. కొం త మంది క్షేత్రస్థాయి అధికారులు నెపాన్ని వినియో గదారులపై నెట్టేసి తప్పుడు నివేదికలు ఇచ్చి పరిహారం రాకుండా చేస్తున్నారనే విమర్శ లు న్నాయి. బాగా పాలిచ్చే ఆవులు, గేదెల మార్కెట్ ధర రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండగా, పరిహారం 50 శాతం కూడా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో గతేడాది (2020–21) సంభవించిన విద్యుత్ ప్రమా దాల్లో 175 మంది మనుషులు మరణించగా, 150 బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించారు. 471 మూగజీవాలు బలి కాగా, 377 జీవాల యజమా నులకు పరిహారం చెల్లించారు. ప్రస్తుత 2021–22 లో గత మే నెల నాటికి 21 మంది మనుషులు,75 మూగజీవాలు మరణించగా 19 మందికి, 40 జీవా లకు పరిహారం లభించింది. చాలా ప్రమాదాలు శాఖాపరమైన కారణాలతోనే.. తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు వేలాడటం, ఎర్తింగ్ నిర్వహణ లేకపోవడం, విద్యుత్ స్తంభాలు/వైర్లు తెగిపడడం, 11/6.6 కేవీ జంపర్లు విఫలం కావడం, 11 కేవీ ఏబీ స్విచ్ పైప్/కేబుల్ ఇన్సులేటర్ ఫెయిల్ కావడం, హెచ్‌టీ/ఎల్టీ లైన్ స్నాప్ కావడం, విద్యుత్ స్తంభాలకు సపోర్ట్‌గా ఉండే స్టే–వైర్లకు విద్యుత్ సరఫరా కావడం, చాలాచోట్ల రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టీ లైన్లకు చెట్ల కొమ్మలు తగలడం వంటి శాఖాపర కారణాలతోనే 50 శాతానికి పైగా విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తీగలు వేలాడటం వంటి వాటిపై క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఏళ్ల తరబడి సమస్యలను పరిష్కరించట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల అజాగ్రత్తలు, అవగాహన లోపం, భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణలతో చాలా ప్రమాదాలు సంభవిస్తున్నాయని డిస్కంల అధికారవర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. ‘పవర్ వీక్’ నిర్వహించినా మారని పరిస్థితి.. చాలా సందర్భాల్లో చిన్నచిన్న లోపాలే విద్యుదాఘాతాలకు దారితీసి నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు పవర్ వీక్ నిర్వహించాలని గతేడాది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు డిస్కంలను ఆదేశించారు. ఇకపై ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా ఎస్పీడీసీఎల్ సంస్థ రూ.195 కోట్లు ఖర్చు చేసి తమ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 8,567 గ్రామాల్లో వివిధ రకాల పనులు చేసినట్టు ప్రకటించుకుంది. వంగిన/తుప్పుపట్టిన/పాడైపోయిన 43,486 స్తంభాల మార్పిడి, దెబ్బతిన్న 22,483 స్టే వైర్ల మార్పిడి, 1,24,175 చోట్లలో వదులుగా ఉన్న తీగలను సరి చేయడం తదితర పనులు చేపట్టినట్లు వెల్లడించింది. ఎన్పీడీసీఎల్ సైతం ఇదే తరహాలో పవర్ వీక్ నిర్వహించి మరమ్మతు, నిర్వహణ పనులు చేపట్టినట్లు తెలిపింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ సమస్యలు కొనసాగుతుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుని పెద్ద సంఖ్యలో మూగజీవాలు బలవుతున్నాయి. -
పొలాల్లో హై‘టెన్షన్’
తాడేపల్లి రూరల్: రాజధానికోసం భూములివ్వని రైతులపై ప్రభుత్వ దమనకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం ఉండవల్లిలో రైతుల పంటపొలాల్లోంచి హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమైన విద్యుత్‌శాఖ అధికారులు భారీగా పోలీసులను వెంటపెట్టుకుని వచ్చారు. ఆందోళన చెందిన రైతులు హడావుడిగా పంటపొలాలకు చేరుకుని వైర్లు లాగడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో రైతులు తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ పురుగుమందు డబ్బాలు, పెట్రోలు బాటిళ్లను బయటకు తీయగా.. వారిని పోలీసులు బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైర్లు లాగుతాం.. ఏం చేస్తారు? గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాలను ప్రభుత్వం రాజధానిగా ప్రకటించినప్పటినుంచి భూములివ్వని రైతులను ఏదోవిధంగా బెదిరిస్తూ దమనకాండకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఉండవల్లిలో రైతులకు చెందిన ఎనిమిది ఎకరాల పంటపొలాల్లోంచి హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమైన విద్యుత్‌శాఖ అధికారులు భారీగా పోలీసు బలగాలను వెంటపెట్టుకుని వచ్చారు. ఇది తెలుసుకున్న ఆయా పొలాలకు చెందిన 18 మందికిపైగా రైతులు హడావుడిగా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడుతుండగానే.. కాంట్రాక్టరు హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమవడంతో ఆగ్రహానికి లోనైన రైతులు అడ్డుకున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే.. విద్యుత్ అధికారులు మళ్లీ వైర్లు లాగే ప్రయత్నం చేశారు. అంతేగాక.. వైర్లు లాగుతాం, ఏం చేస్తారో చెయ్యండంటూ రైతులపై విరుచుకుపడ్డారు. దీనిపై రైతులు.. అన్నం పెట్టే అన్నదాతలు మిమ్మల్నేం చేయగలరు. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన తహసీల్దార్.. వారిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. వైర్లు వెళ్లే స్థలాలకు కూడా జిల్లా కలెక్టర్ నష్టపరిహారం ఇస్తారంటూ చెప్పగా.. ఎలా ఇస్తారంటూ రైతులు ప్రశ్నించారు. దానికి అధికారులు సమాధానం చెప్పకుండా వైర్లు లాగుతామంటూ ముందుకెళ్లారు. దాంతో రైతులు తమ జేబుల్లోనుంచి పురుగుమందు డబ్బాలు, పెట్రోలు బాటిళ్లు బయటకు తీశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆరుగురు రైతులను పోలీసులు బలవంతంగా జీపులో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మహిళా రైతులను పంటపొలాలనుంచి బలవంతంగా బయటకు గెంటేశారు. అనంతరం హైటెన్షన్ వైర్లను లాగే ప్రక్రియ చేపట్టారు. అదుపులోకి తీసుకున్న రైతులను గురువారం సాయంత్రం పూచీకత్తుపై వదిలిపెట్టారు. -
ప్రమాదంతోనే స్పందిస్తారా?
కేటీదొడ్డి : మండలంలో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకొని వంగిపోవడం, వాటి తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం వేసిన విద్యుత్ స్తంభాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అవి ఎప్పుడు నేల కూలుతాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరంగా మారిన స్తంభాలను వేలాడుతున్న తీగలను బాగుచేయాలని అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. గతంలో విద్యుత్‌స్తంభాలు నేలకొరిగి ప్రమాదాలు కూడా జరిగాయని, అంతజరిగినా.. అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. తీగలు తెగిపడి.. కొన్ని రోజుల క్రితం ఎర్సందొడ్డిలో విద్యుత్ తీగలు తెగిపడి రెండు ఎద్దులు మృతిచెందాయి. మండలంలోని కొండాపురం, కేటీదొడ్డి, గువ్వలదిన్నె, నందిన్నె, కుచినెర్ల, గ్రామాల శివారులో విద్యుత్ తీగలు వేలాడుతూ విద్యుత్‌స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. గువ్వలదిన్నె స్టేజీ సమీపంలో రోడ్డు పక్కన విద్యుత్‌స్తంభం శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారాయి. స్తంభానికి మధ్యలో ఇనుపచువ్వలు పైకితేలాయి. బలమైన గాలులు వీచినప్పుడు విద్యుత్‌స్తంభం కూలిపోయే అవకాశం ఉందని రైతులు భయాందోళన చెందుతున్నారు. కొండాపురం గ్రామ శివారులో స్తంభాలకు విద్యుత్ తీగలు కింద నిలబడితే చేతికందేలా ఉన్నాయి. బలమైన గాలులు వీచినప్పుడు విద్యుత్‌తీగలు ఒకదానికి ఒకటి తగిలి నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అదికారులు చర్యలు తీసుకుని ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి తీగలను సరిచేయాలని రైతులు కోరుతున్నారు. భయంగా ఉంది... పొలం వద్ద విద్యుత్ తీగలు చేతికందేలా ఉన్నాయి. పొలం పనులు చేసుకునేటప్పుడు భయమేస్తుంది. బలమైన గాలులు వీస్తే వైర్లు ఒకదానికి ఒకటి తగిలి నిప్పురవ్వలు పడుతున్నాయి. పొలం పనులు చేసుకోవాలంటే భయంగా ఉంది. తీగలు సరిచేయాలి. – యాదవరాజు, ఎర్సందొడ్డి సమస్య పరిష్కరిస్తాం.. సమస్య ఉన్న మాట వాస్తవమే. ఎర్సందొడ్డి సర్పంచ్ స్తంభాలు కావాలని మా దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే స్తంభాలు వేయిస్తాం. అలాగే కేటీదొడ్డి, నందిన్నె శివారు పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను మా లైన్మెన్కు చెప్పి తీగలు లాగేలా చూస్తాం. – పరశురాం, విద్యుత్ ఏఈ -
విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు మృతి
నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని తాడిమళ్ల గ్రామ శివారులో 33 కేవీ విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. తాడిమళ్ల దగ్గర పొలం పనుల కోసం మహాలక్ష్మి,(38), వల్లంకి మంగ (23) అనే ఇద్దరు మహిళలు పొలంలో పనులు చేస్తుండగా పైనున్న 33 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ సంఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మహిళల మృతిపై బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
మెళవాయి ఘటనలో మేనేజర్ అరెస్ట్
మడకశిర : అనంతపురం జిల్లా మెళవాయి ఘటనపై అధికారులు స్పందించారు. విద్యుత్ పనులు నిలిపివేయాలని కర్ణాటక సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. (చదవండి : పరిహారమడిగితే వేలాడదీశారు! ) విద్యుత్ తీగలపై రైతులను వేలాడదీసిన కాంట్రాక్ట్ సంస్థ మేనేజర్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పొలంలో చేపట్టిన 220 కేవీ విద్యుత్ స్తంభాల ఏర్పాటును అడ్డుకోబోయిన తండ్రీకొడుకులు నబీరసూల్, వన్నూర్సాబ్పై కాంట్రాక్టర్ అధికారులు అమానుషంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు ఇప్పటికే పూర్తి స్థాయి నివేదిక కోరారు. -
పరిహారమడిగితే వేలాడదీశారు!
ఏపీ రైతుల పట్ల కర్ణాటక విద్యుత్ అధికారుల ఎదుటే కాంట్రాక్టర్ దుశ్చర్య మడకశిర: తగిన నష్టపరిహారం ఇవ్వకుండా తమ పొలంలో చేపట్టిన విద్యుత్ స్తంభాల ఏర్పాటును అడ్డుకోబోయిన ఇద్దరు రైతులను కర్ణాటక విద్యుత్ అధికారుల సమక్షంలోనే తీగలపై వేలాడదీసిన ఓ కాంట్రాక్టర్ దుశ్చర్య ఇది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈ సంఘటన ఆదివారం వెలుగుచూసింది.ఇది కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉంది. ఆ రాష్ట్రం తుమకూరు జిల్లా పావగడ – మధుగిరి మధ్య 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు హైటెన్షన్ విద్యుత్ తీగలు లాగే పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెళవాయి గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులైన నబీరసూల్, వన్నూర్‌సాబ్ తమకు నష్టపరిహారం ఇవ్వాలని తమ భూముల్లో జరుగుతున్న విద్యుత్ లైన్ పనులను శనివారం అడ్డుకున్నారు. విద్యుత్ స్తంభాలకు వైర్లు కట్టి ట్రాక్టర్లతో లాగుతున్నపుడు వారు దాన్ని అడ్డుకున్నారు.ఆ వైర్లను గట్టిగా చేతుల్లో పట్టుకున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ దీన్ని గమనించినా వైర్లను అలాగే లాగారు. దీంతో రైతులిద్దరూ గాల్లో తేలాడారు. పది మీటర్ల ఎత్తుకు వెళ్లగానే నబీరసూల్ భయంతో దూకేయగా...20 మీటర్ల ఎత్తుకు వెళ్లగానే వన్నూర్‌సాబ్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఇద్దరూ గాయపడ్డారు. నష్టపరిహారం ఇవ్వకుంటే తమకు దిక్కెవరని, ఏపీ ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇంత జరిగినా సదరు కాంట్రాక్టర్ దౌర్జన్యంగా పని పూర్తి చేశాడు. -
సంచలనం కలిగిస్తున్న వీడియో దృశ్యాలు!
-
వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి
పులి కళేబరాన్ని గుర్తించిన అటవీ అధికారులు కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో వేటగాళ్ల ఉచ్చుకు పులి మృత్యువాతపడింది. వన్యప్రాణులను హతమార్చేందుకు అమర్చిన తీగకు తగిలి పులి ప్రాణాలు కోల్పోరుుంది. దీన్ని గుర్తించిన వేటగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా దానిని అడవిలోనే ఖననం చేశారు. చెన్నూర్ రేంజ్ పరిధి కోటపల్లి మండలంలోని పిన్నారం, ఎడగట్ట అటవీ ప్రాంతంలో పులిని హత్య చేసి పూడ్చి పెట్టారని శుక్రవారం అజ్ఞాత వ్యక్తి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పిన్నారం, ఎడగట్టల మధ్యలోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. పిన్నారం అటవీ సమీపంలోని లోయలో పులిని చంపి పూడ్చి పెట్టినట్లు గుర్తించారు. పూడ్చిపెట్టిన పులి కళేబరాన్ని బయటికి తీశారు. అక్కడే పంచనామా చేసి, మళ్లీ ఖననం చేశారు. కాగా, ఈ పులి వారం రోజుల క్రితమే వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లకు తగిలి మృతి చెందింది. పులికి సంబంధించి ఎలాంటి అవయవాలను వేటగాళ్లు తీసుకెళ్లలేదు. ఇదిలా ఉంటే.. గత నెల 17న మండలంలోని పంగిడిసోమారం అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాకు చిక్కింది ఈ పులేనని.. పులిని హతమార్చిన వ్యక్తులను గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని ఫారెస్ట్ డివిజనల్ అధికారి తిరుమల్‌రావు తెలిపారు. -
ఓరి దేవుడా..
మాటలకందని విషాదమిది.. చీకలగురికి గ్రామం ఉలిక్కిపడింది.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు.. పైగా ఒకే కుటుంబానికి చెందిన వారు.. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తామని చెప్పి పొలానికి వెళ్లిన వారు ఇక శాశ్వతంగా రారని తెలిస్తే జీర్ణించుకోవడం ఎవరితరమవుతుంది? ఎవరికే అన్యాయం చేయని మాకు ఆ దేవుడు ఎందుకింత పెద్ద శిక్ష వేశాడని ఆ కుటుంబ సభ్యులు పొగిలి పొగిలి ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.. ఘటనా స్థలానికి వచ్చిన వారిలో కంట తడి పెట్టనోళ్లు లేరు. విడపనకల్లు/ఉరవకొండ/ఉరవకొండ రూరల్ : కరెంటు తీగలు మృత్యుపాశాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని వెంటతీసుకెళ్లాయి. ‘జీవితాంతం మాకు తోడుగా ఉంటారనుకున్నాం.. ఇలా చేశావేంటయ్యా భగవంతుడా.. మాపై ఇంత కచ్చకట్టినావా.. ఇంటోళ్లందరినీ తీసుకెళ్లిపోయావే.. ఇంక మాకు దిక్కెవరయ్యా’ అంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. బోరు మరమ్మతు కోసం వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలియగానే వారి రోదన వర్ణణాతీతమైంది. ఎప్పుడూ తమతో హాయిగా ఉండే వాళ్లు ఇక లేరని తెలియగానే ఊరుఊరంతా విషాదంలో నిండిపోయింది. శుక్రవారం విడపనకల్లు మండలం చీమలగురికి గ్రామంలోని పొలంలో బోరు మరమ్మతు చేయడానికి ఇనుప పైపు బయటకు తీస్తుండగా పట్టు తప్పి పైనున్న విద్యుత్ తీగలు తగలడంతో రైతు కురుబ రేవణ్ణ (65), అతడి కుమారులు ఎర్రిస్వామి (36), బ్రహ్మయ్య (30), మనవడు రాజశేఖర్ (18), సమీప బంధువు, వన్నూరుస్వామి-రాజమ్మ దంపతుల కుమారుడు వరేంద్ర (29) అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు కంటతడిపెట్టారు. మృతదేహాలపై పడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ‘మేమేం పాపం సేశామని మాకింత పెద్ద సిచ్చవేశావురా దేవుడా.. మేం ఎలా బతకాలి.. ఇక మాకు దిక్కెవరు’ అంటూ రేవర్ణ భార్య లక్ష్మిదేవి గుండెలవిసేలా రోదించింది. ఇద్దరు కోడళ్లను గట్టిగా పట్టుకుని ‘ఇక మనకెవరు దిక్కమ్మా’ అంటూనే స్పృహ కోల్పోయింది. ‘‘పిల్లలను బాగా సదివిద్దామంటివే.. వాళ్లకి మంచి జీవితాన్నిద్దామని రోజూ సెప్తాంటివి. ఇంతలోనే నీతో పాటు నీ కొడుకునూ తీసుకెళ్తివా అయ్యా.. ఓరి దేవుడా’’ అంటూ ఎర్రిస్వామి భార్య పుష్పావతి భర్త, కొడుకు మృతదేహాల వద్ద విలపించింది. ‘తొందరగా బోరు రిపేరి సేసి బిరీన బువ్వ తీనేకి ఇంటికొత్తానని సెప్తివే.. నీకేమైందయ్యా..లెయ్.. పిల్లలు నిన్ను అడుగుతాండారు.. ఏం సెప్పేది.. అత్తమ్మా.. నాకు, నా పిల్లలకు ఇంక దిక్కెవరమ్మా..’ అంటూ బ్రహ్మయ్య భార్య నాగవేణి అత్తను హత్తుకుని కన్నీరుమున్నీరైంది. ‘పుట్టింటికి పోయిండే నీ పెళ్లాం వచ్చినాక అడిగితే నేనేం సెప్పల్రా కొడకా.. ఇంత ఘోరంగా పోతివే.. పెళ్లై సంవత్సరం దాటేకే లేదు.. ఇంతలోనే పెళ్లాం కొడుక్కి దిక్కు లేకుండా చేశావే’ అంటూ వరేంద్ర తల్లిదండ్రులు కొడుకు మృతదేహంపై పడి విలపిస్తుంటే వారిని ఆపడం అక్కడున్న వారి తరం కాలేదు. ఇక గ్రామస్తులైతే విషాదం నిండిన హృదయంతో సంఘటన స్థలాన్ని చూస్తూ అలాగే ఉండిపోయారు. ఎవర్ని కదిపినా ‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగిందయ్యా.. ఉన్న పొలంలోనే అందరూ కలిసిమెలసి వెవసాయం సేత్తాండ్రి.. కట్టపడి బతికేటోళ్లు. ఎవర్నీ ఏ రోజూ పల్లెత్తు మాట అనేటోళ్లు కాదు.. ఇలాంటి కుటుంబానికి దేవుడు ఇంత శిచ్చ వేశాడు’’ అంటూ భగవంతుడిని నిందించారు. ప్రభుత్వానికి నివేదిక పంపిన కలెక్టర్ అనంతపురం ఎడ్యుకేషన్ : విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామంలో పొలంలో బోరు వేస్తూ ఐదుగురు మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టరు సొలమన్ ఆరోగ్యరాజ్ శుక్రవారం రాత్రి ప్రభుత్వానికి నివేదించారు. ఈ ఘటనపై ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ను నివేదిక కోరడంతో ఆఘమేఘాలమీద సిద్ధం చేసి పంపారు. ఘటన జరగిన తీరు, కారణాలు తదితర అంశాలను సమగ్రంగా నివేదించారు. రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి అనంతపురం సిటీ : మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుదాఘాతంలో ఐదుగురు మృత్యువాత పడడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి అనంతపురం అర్బన్ : మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికి విద్యుత్ శాఖ నుంచి రూ.2.50 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.2.50 లక్షలు పరిహారంగా అందివ్వాలన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని, వైఎస్ఆర్సీపీ తరపున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.