వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి
కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో వేటగాళ్ల ఉచ్చుకు పులి మృత్యువాతపడింది. వన్యప్రాణులను హతమార్చేందుకు అమర్చిన తీగకు తగిలి పులి ప్రాణాలు కోల్పోరుుంది. దీన్ని గుర్తించిన వేటగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా దానిని అడవిలోనే ఖననం చేశారు. చెన్నూర్ రేంజ్ పరిధి కోటపల్లి మండలంలోని పిన్నారం, ఎడగట్ట అటవీ ప్రాంతంలో పులిని హత్య చేసి పూడ్చి పెట్టారని శుక్రవారం అజ్ఞాత వ్యక్తి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పిన్నారం, ఎడగట్టల మధ్యలోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. పిన్నారం అటవీ సమీపంలోని లోయలో పులిని చంపి పూడ్చి పెట్టినట్లు గుర్తించారు.
పూడ్చిపెట్టిన పులి కళేబరాన్ని బయటికి తీశారు. అక్కడే పంచనామా చేసి, మళ్లీ ఖననం చేశారు. కాగా, ఈ పులి వారం రోజుల క్రితమే వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లకు తగిలి మృతి చెందింది. పులికి సంబంధించి ఎలాంటి అవయవాలను వేటగాళ్లు తీసుకెళ్లలేదు. ఇదిలా ఉంటే.. గత నెల 17న మండలంలోని పంగిడిసోమారం అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాకు చిక్కింది ఈ పులేనని.. పులిని హతమార్చిన వ్యక్తులను గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని ఫారెస్ట్ డివిజనల్ అధికారి తిరుమల్‌రావు తెలిపారు.