tiger killed
-
మహారాష్ట్ర చంద్రపూర్‌లో పులులు పంజా
-
ఇంట్లోకొచ్చి బాలుడిని లాక్కెళ్లిన పులి.. రెండ్రోజుల్లో రెండో ఘటన
ముంబై: మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో పులులు పంజా విసురుతున్నాయి. వరుసగా రెండ్రోజుల్లో ఓ యువకుడితో పాటు బాలుడు పులి బారినపడి మరణించారు. సిందేవాహిని గ్రామంలో పులి ఇంట్లోకి వచ్చి మరి బాలుడిని లాక్కెళ్లి చంపేసింది. ఇంటిలోంచి బాలుడిని లక్కెళ్లిన క్రమంలో గ్రామస్థులు కోపోద్రిక్తులయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీలైనంత త్వరగా పులలను బంధించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. అంతకు ముందు రోజు ఓ యువకుడిని పొట్టనపెట్టుకుంది పులి. తల్లిదండ్రులు జాతరకు వెళ్లిన క్రమంలో పంటపొలానికి వెళ్లిన యువకుడిపై పులి దాడి చేసి చంపేసింది. శివాని అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో తరుచుగా పులులు పంజా విసురుతున్నాయని.. ఆ ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి పులుల బారినుంచి తమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదీ చదవండి: మాస్కో- గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
మంత్రుల మధ్య ‘అవని’ చిచ్చు
న్యూఢిల్లీ/ముంబై: మ్యాన్ఈటర్ పులి అవనిని చంపిన ఉదంతంలో మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మధ్య వివాదం మరింత ముదిరింది. సుధీర్ ముంగంతివార్‌ను కేబినెట్ నుంచి తొలగించే విషయాన్ని పరిశీలించాలని మేనకా గాంధీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు మంగళవారం లేఖ రాశారు. దీనికి ధీటుగా స్పందించిన ముంగంటివార్..పోషకాహార లోపంలో పిల్లలు చనిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మేనకా గాంధీనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వన్యప్రాణులను కాపాడాల్సిన అటవీ మంత్రే వాటిని సంహరిస్తూ విధుల నిర్వహణలో విఫలమయ్యారని మేనక ఆరోపించారు. పులి అవని గురించి రెండు నెలలుగా ఆయనతో మాట్లాడుతున్నానని, దానికి మత్తు సూది ఇచ్చి పట్టుకోవాలని సూచించానని అన్నారు. మంత్రి కొంత ఓపిక, సున్నితత్వం వహిస్తే పులిని ప్రాణాలతోనే పట్టుకునే వాళ్లమని తెలిపారు. మరోవైపు, అవని హత్యతో తనకేం సంబంధం లేకున్నా మేనకా గాంధీ తనని రాజీనామా చేయాలంటున్నారని ముంగంటివార్ అన్నారు. ‘నాకు సంబంధంలేని దానికి నేను నైతిక బాధ్యత తీసుకోవాలనుకుంటే ఒక షరతు. పోషకాహారం లోపంతో చిన్నారులు చనిపోతున్న ఉదంతాలకు కేంద్ర మంత్రి రాజీనామా చేసి ఆదర్శంగా నిలవాలి’ అని వ్యాఖ్యానించారు. చంపడం పరిష్కారం కాదు.. భారత్‌లో వరసగా జరిగిన రెండు పులుల హత్యపై వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ ఆందోళన వ్యక్తం చేసింది. వన్య మృగాలతో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించేందుకు వాటిని హతమార్చడం పరిష్కారం కాదని పేర్కొంది. ‘మానవుడు–జంతువుల మధ్య ఘర్షణ తలెత్తిన సందర్భాల్లో మానవీయ, ప్రొఫెషనల్ విధానాలు ఆచరించాలి. అన్ని ప్రభుత్వ విభాగాల మధ్య చక్కటి సమన్వయం రాబట్టి, స్థానికంగా నివసించే ప్రజల్లో వన్యప్రాణుల పట్ల సున్నితత్వం పెంచాలి. ఇలాంటి సందర్భాల్లో మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని భారత్‌లో డబ్ల్యూఏపీ డైరెక్టర్ గజేందర్ కె.శర్మ అన్నారు. -
పులిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు
లఖిమ్‌పూర్‌ఖేరీ: ఓ వ్యక్తిపై ఆడపులి దాడిచేయడంతో రెచ్చిపోయిన గ్రామస్తులు ఆ క్రూర జంతువును ట్రాక్టర్‌తో తొక్కించి హతమార్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని దుధ్వా టైగర్ రిజర్వు ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. లఖిమ్‌పూర్‌ఖేరీ జిల్లాలోని చైతువా గ్రామానికి చెందిన దేవానంద్(50) ఆడపులి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇది జంతువు దాడేనని ధ్రువీకరించుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. అటవీప్రాంతంలో ఆడపులిని చుట్టుముట్టి కిరాతకంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు.. పులి మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నామనీ, నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. -
‘అవని’ అంతంపై ఆరోపణలు
మ్యాన్ ఈటర్‌గా మారిన ఆడపులి ‘అవని’ అలియాస్ టీ–1 ని కాల్చి చంపడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంతిమ ప్రయత్నంగా మాత్రమే ఆ పులిని చంపాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టి, ఎలాంటి నిబంధనలను పాటించకుండా వేటగాడి తూటాలకు బలివ్వడంపై వన్యప్రాణుల హక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి మేనకా గాంధీ ఈ ఘటనపై తీవ్ర నిరసన తెలిపారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా బొరాటి అటవీ ప్రాంతంలో ఉండే ఆడపులి ‘అవని’, అధికారులు పెట్టిన పేరు టీ–1, గత రెండేళ్లలో సమీపంలోని పొలాలు, గ్రామాల్లో ఉండే 13 మంది రైతులు, ఆదివాసీలను నరమాంస భక్షణకు అలవాటైన ఆ పులి చంపేసిందని భావిస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ పులిని పట్టుకునేందుకు గత మూడు నెలలుగా సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మహారాష్ట్ర అటవీ శాఖ ఈ పులిని చంపేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన షార్ప్‌షూటర్ అస్ఘర్ అలీని రంగంలోకి దించింది. ఆయన శుక్రవారం రాత్రి అడవిలో ఉన్న ‘అవని’ని వేటాడి కాల్చి చంపారు. మత్తు ఇచ్చేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడటంతో వారి ప్రాణాలను కాపాడేందుకే అవనిని కాల్చి చంపాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఉత్తర్వులు ఇచ్చినట్లు అటవీ మంత్రి సుధీర్ మునగంటి వార్ తెలిపారు. అవనికి ఉన్న పది నెలల రెండు పిల్లలకు తమను తాము పోషించుకోగల శక్తి ఉందన్నారు. వాటి పోషణ బాధ్యతను తమ శాఖ తీసుకుంటుందని తెలిపారు. అధికారులు ఏం చేయాలి? మ్యాన్ ఈటర్లను చంపాల్సిన సందర్భాల్లో అధికారులు ప్రామాణిక నిర్వహణ విధానం ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారినా, జబ్బు పడినా, అవయవాలు పనిచేయని స్థితిలో ఉన్నా అదీ దానిని పట్టుకోలేని పరిస్థితుల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణులను చంపేందుకు అనుమతివ్వవచ్చు. దీంతోపాటు ఆ పులిని వేటగాడు స్పష్టంగా గుర్తించాలి. కెమెరా ట్రాప్‌లు లేక చారల తీరును బట్టి అది మ్యాన్ ఈటరేనని ధ్రువీకరించుకోవాలి. మ్యాన్ ఈటర్‌ను చంపిన వారికి అవార్డులు/రివార్డులు ఇవ్వడం కూడా నిషిద్ధం. విశాలమైన ప్రాంతంలో దానిని వేటాడేప్పుడు వెంట వన్యప్రాణుల నిపుణులు, బయోలజిస్టులు, పశువైద్యుడు, మత్తుమందు నిపుణులతో కూడిన బృందం ఉండాలి. ప్రభుత్వ ప్రతినిధిగా ఒక వైద్యుడు కూడా ఉండాలి. ఇవేమీ లేకపోవడం ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. వేటగాడు, ఆ పక్కన అవని కళేబరం ఉన్న ఫొటోలు మీడియాలో యథాతధంగా ప్రసారమయ్యాయి. ఇలా చేయడం 2016 నాటి ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పునకు విరుద్ధం. షార్ప్ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్‌తోపాటు అతడి కొడుకు అస్ఘర్ అలీఖాన్ ప్రభుత్వం అవనిని చంపటానికి పురమాయించింది. అస్ఘర్‌కు పులిని వేటాడేందుకు అనుమతి ఉందీ లేనిదీ తెలియదు. చంపడం అంతిమ యత్నమే కావాలి అవనిని చంపాలన్న ప్రతిపాదన కొన్ని నెలల క్రితమే వెలుగులోకి రాగా కొందరు వ్యతిరేకించారు. కొందరు అనుకూలంగా మాట్లాడారు. ఇది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టుకు చేరగా.. అవనిని మత్తు మందు ఇచ్చి బంధించడంలో విఫలమైన సందర్భాల్లో ఆఖరి యత్నంగా మాత్రమే కాల్చి చంపాలని ఆదేశించింది. అటవీ మంత్రే కారకుడు: మేనక ‘జంతువుల పట్ల ఎవరికీ సహానుభూతి లేదు. 1972 వన్యప్రాణుల చట్టం ప్రకారం అడవి జంతువులను కాల్చి చంపడం నేరం. మహారాష్ట్ర ప్రభుత్వం పులిని దారుణంగా చంపించింది. అటవీ మంత్రే దీనికి కారకుడు. ఈ విషయమై సీఎం ఫడ్నవిస్‌తో మాట్లాడతా. మ్యాన్ ఈటర్‌ను చంపేందుకు అస్ఘర్ అలీకి ఎటువంటి అధికారమూ లేదు’ అని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. జంతు హక్కుల సంస్థ ‘పెటా’ ఈ ఘటనను ఖండించింది. -
‘అవని’ని కాల్చి చంపేశారు
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో సుమారు 13 మంది మృతికి కారణమైన ఆడ పులి అవని(T1) ని శుక్రవారం రాత్రి అంతమొందించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. యవత్మాల్ ప్రాంతంలో సంచరిస్తూ.. మనుషుల మాంసానికి రుచి మరిగిన అవని వల్ల ప్రమాదం పొంచి ఉన్నందున కనిపించిన వెంటనే కాల్చిపారేయలని సుప్రీం కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అవనిని ప్రాణాలతోనే పట్టుకోవాలంటూ చేంజ్. ఆర్గ్ అనే సంస్థ వేసిన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. కాగా గత రెండేళ్లుగా అధికారులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ తమ ప్రాణాలకు ప్రమాదంగా పరిణమించిన పులిని మట్టుబెట్టినందుకు యవత్మాల్ పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సగానికి పైగా మన దేశంలోనే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల మొత్తం జనాభాలో సగానికి పైగా భారత్‌లోనే ఉందని 2014 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మన దేశంలోని వివిధ అరణ్యాల్లో సుమారు 2,226 పులులు ఉన్నట్లుగా గుర్తించారు. కాగా ప్రతీ ఏడాది దాదాపు 12 పులులు చనిపోతున్నాయని, ఇలా అయితే భవిష్యత్తులో పులుల ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని జంతు హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి
పులి కళేబరాన్ని గుర్తించిన అటవీ అధికారులు కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో వేటగాళ్ల ఉచ్చుకు పులి మృత్యువాతపడింది. వన్యప్రాణులను హతమార్చేందుకు అమర్చిన తీగకు తగిలి పులి ప్రాణాలు కోల్పోరుుంది. దీన్ని గుర్తించిన వేటగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా దానిని అడవిలోనే ఖననం చేశారు. చెన్నూర్ రేంజ్ పరిధి కోటపల్లి మండలంలోని పిన్నారం, ఎడగట్ట అటవీ ప్రాంతంలో పులిని హత్య చేసి పూడ్చి పెట్టారని శుక్రవారం అజ్ఞాత వ్యక్తి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పిన్నారం, ఎడగట్టల మధ్యలోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. పిన్నారం అటవీ సమీపంలోని లోయలో పులిని చంపి పూడ్చి పెట్టినట్లు గుర్తించారు. పూడ్చిపెట్టిన పులి కళేబరాన్ని బయటికి తీశారు. అక్కడే పంచనామా చేసి, మళ్లీ ఖననం చేశారు. కాగా, ఈ పులి వారం రోజుల క్రితమే వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లకు తగిలి మృతి చెందింది. పులికి సంబంధించి ఎలాంటి అవయవాలను వేటగాళ్లు తీసుకెళ్లలేదు. ఇదిలా ఉంటే.. గత నెల 17న మండలంలోని పంగిడిసోమారం అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాకు చిక్కింది ఈ పులేనని.. పులిని హతమార్చిన వ్యక్తులను గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని ఫారెస్ట్ డివిజనల్ అధికారి తిరుమల్‌రావు తెలిపారు. -
ఊటీలో నరభక్షక పులి కాల్చివేత
పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన ఊటీ జిల్లాలో గ్రామస్థులకు నరభక్షక పులి బాధ ఎట్టకేలకు తీరింది. ముగ్గురు వ్యక్తులతో పాటు.. రెండు ఆవులు, మరో రెండు మేకలను కూడా చంపి తిన్న ఆ పులిని అటవీ శాఖాధికారులు, పోలీసులు కలిసి కాల్చిచంపారు. తొలిసారి ఈ పులి ఈనెల 5వ తేదీన కనిపించింది. అప్పటినుంచి రెండు వారాల పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ నరకం చూపించింది. కుండచప్పాయ్ గ్రామ సమీపంలో అటవీ శాఖాధికారులు ఎట్టకేలకు కాల్చిచంపారని, తుపాకి గుళ్లు తగిలిన తర్వాత కనిపించకుండా పోయిన పులి మృతదేహాన్ని దాదాపు గంట తర్వాత స్వాధీనం చేసుకున్నారని నీలగిరి జిల్లా కలెక్టర్ పి.శంకర్ తెలిపారు. అంతకు ముందు ఈ పులి ముగ్గురు వ్యక్తులను చంపి తినేసింది. ఈ పులి కారణంగా ఆ ప్రాంతంలోని పాఠశాలలన్నింటినీ మూసేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. సాయంత్రం కావడానికి ముందే జనమంతా ఇళ్లకు పరుగులు తీశారు. టీ ఎస్టేట్లు, పండ్లు, కూరగాయల తోటల్లో కూడా పనివేళలను తగ్గించారు. అటవీ శాఖాధికారులు ఎంతకూ దాన్ని వేటాడేందుకు ముందుకు రాకపోవడంతో బుధవారం నాడు దాదాపు 600 మంది గ్రామస్థులు కత్తులు, కొడవళ్లు పట్టుకుని అడవిలోకి బయల్దేరారు. అయితే, వాళ్లుంటే వేటకు ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్పారు. శిక్షణ పొందిన ఏనుగులను తీసుకుని పులివేటకు బయల్దేరారు. కెమెరా ట్రాప్‌లు పులి ఆనవాళ్లను గుర్తించగలిగామని డీఎఫ్ఓ తెలిపారు. తిండిలేక అది నీరసంగా కనిపించిందని, గాయాలు కూడా కావడంతో రక్తపు మరకలు కూడా కనిపించాయని అధికారులు చెప్పారు.