ఆస్పత్రిలో పులి ‘అవని’ కళేబరం
మ్యాన్ ఈటర్‌గా మారిన ఆడపులి ‘అవని’ అలియాస్ టీ–1 ని కాల్చి చంపడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంతిమ ప్రయత్నంగా మాత్రమే ఆ పులిని చంపాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టి, ఎలాంటి నిబంధనలను పాటించకుండా వేటగాడి తూటాలకు బలివ్వడంపై వన్యప్రాణుల హక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి మేనకా గాంధీ ఈ ఘటనపై తీవ్ర నిరసన తెలిపారు.
మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా బొరాటి అటవీ ప్రాంతంలో ఉండే ఆడపులి ‘అవని’, అధికారులు పెట్టిన పేరు టీ–1, గత రెండేళ్లలో సమీపంలోని పొలాలు, గ్రామాల్లో ఉండే 13 మంది రైతులు, ఆదివాసీలను నరమాంస భక్షణకు అలవాటైన ఆ పులి చంపేసిందని భావిస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ పులిని పట్టుకునేందుకు గత మూడు నెలలుగా సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మహారాష్ట్ర అటవీ శాఖ ఈ పులిని చంపేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన షార్ప్‌షూటర్ అస్ఘర్ అలీని రంగంలోకి దించింది.
ఆయన శుక్రవారం రాత్రి అడవిలో ఉన్న ‘అవని’ని వేటాడి కాల్చి చంపారు. మత్తు ఇచ్చేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడటంతో వారి ప్రాణాలను కాపాడేందుకే అవనిని కాల్చి చంపాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఉత్తర్వులు ఇచ్చినట్లు అటవీ మంత్రి సుధీర్ మునగంటి వార్ తెలిపారు. అవనికి ఉన్న పది నెలల రెండు పిల్లలకు తమను తాము పోషించుకోగల శక్తి ఉందన్నారు. వాటి పోషణ బాధ్యతను తమ శాఖ తీసుకుంటుందని తెలిపారు.
అధికారులు ఏం చేయాలి?
మ్యాన్ ఈటర్‌లను చంపాల్సిన సందర్భాల్లో అధికారులు ప్రామాణిక నిర్వహణ విధానం ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారినా, జబ్బు పడినా, అవయవాలు పనిచేయని స్థితిలో ఉన్నా అదీ దానిని పట్టుకోలేని పరిస్థితుల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణులను చంపేందుకు అనుమతివ్వవచ్చు. దీంతోపాటు ఆ పులిని వేటగాడు స్పష్టంగా గుర్తించాలి. కెమెరా ట్రాప్‌లు లేక చారల తీరును బట్టి అది మ్యాన్ ఈటరేనని ధ్రువీకరించుకోవాలి. మ్యాన్ ఈటర్‌ను చంపిన వారికి అవార్డులు/రివార్డులు ఇవ్వడం కూడా నిషిద్ధం.
విశాలమైన ప్రాంతంలో దానిని వేటాడేప్పుడు వెంట వన్యప్రాణుల నిపుణులు, బయోలజిస్టులు, పశువైద్యుడు, మత్తుమందు నిపుణులతో కూడిన బృందం ఉండాలి. ప్రభుత్వ ప్రతినిధిగా ఒక వైద్యుడు కూడా ఉండాలి. ఇవేమీ లేకపోవడం ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. వేటగాడు, ఆ పక్కన అవని కళేబరం ఉన్న ఫొటోలు మీడియాలో యథాతధంగా ప్రసారమయ్యాయి. ఇలా చేయడం 2016 నాటి ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పునకు విరుద్ధం. షార్ప్ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్‌తోపాటు అతడి కొడుకు అస్ఘర్ అలీఖాన్ ప్రభుత్వం అవనిని చంపటానికి పురమాయించింది. అస్ఘర్‌కు పులిని వేటాడేందుకు అనుమతి ఉందీ లేనిదీ తెలియదు.
చంపడం అంతిమ యత్నమే కావాలి
అవనిని చంపాలన్న ప్రతిపాదన కొన్ని నెలల క్రితమే వెలుగులోకి రాగా కొందరు వ్యతిరేకించారు. కొందరు అనుకూలంగా మాట్లాడారు. ఇది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టుకు చేరగా.. అవనిని మత్తు మందు ఇచ్చి బంధించడంలో విఫలమైన సందర్భాల్లో ఆఖరి యత్నంగా మాత్రమే కాల్చి చంపాలని ఆదేశించింది.
అటవీ మంత్రే కారకుడు: మేనక
‘జంతువుల పట్ల ఎవరికీ సహానుభూతి లేదు. 1972 వన్యప్రాణుల చట్టం ప్రకారం అడవి జంతువులను కాల్చి చంపడం నేరం. మహారాష్ట్ర ప్రభుత్వం పులిని దారుణంగా చంపించింది. అటవీ మంత్రే దీనికి కారకుడు. ఈ విషయమై సీఎం ఫడ్నవిస్‌తో మాట్లాడతా. మ్యాన్ ఈటర్‌ను చంపేందుకు అస్ఘర్ అలీకి ఎటువంటి అధికారమూ లేదు’ అని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. జంతు హక్కుల సంస్థ ‘పెటా’ ఈ ఘటనను ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment