ఓరి దేవుడా.. | God ori .. | Sakshi
Sakshi News home page

ఓరి దేవుడా..

Published Sat, Nov 29 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

ఓరి దేవుడా..

ఓరి దేవుడా..

మాటలకందని విషాదమిది..
చీకలగురికి గ్రామం ఉలిక్కిపడింది.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు.. పైగా ఒకే కుటుంబానికి చెందిన వారు.. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తామని చెప్పి పొలానికి వెళ్లిన వారు ఇక శాశ్వతంగా రారని తెలిస్తే జీర్ణించుకోవడం ఎవరితరమవుతుంది? ఎవరికే అన్యాయం చేయని మాకు ఆ దేవుడు ఎందుకింత పెద్ద శిక్ష వేశాడని ఆ కుటుంబ సభ్యులు పొగిలి పొగిలి ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.. ఘటనా స్థలానికి వచ్చిన వారిలో కంట తడి పెట్టనోళ్లు లేరు.

 
విడపనకల్లు/ఉరవకొండ/ఉరవకొండ రూరల్ : కరెంటు తీగలు మృత్యుపాశాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని వెంటతీసుకెళ్లాయి. ‘జీవితాంతం మాకు తోడుగా ఉంటారనుకున్నాం.. ఇలా చేశావేంటయ్యా భగవంతుడా.. మాపై ఇంత కచ్చకట్టినావా.. ఇంటోళ్లందరినీ తీసుకెళ్లిపోయావే.. ఇంక మాకు దిక్కెవరయ్యా’ అంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది.

బోరు మరమ్మతు కోసం వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలియగానే వారి రోదన వర్ణణాతీతమైంది. ఎప్పుడూ తమతో హాయిగా ఉండే వాళ్లు ఇక లేరని తెలియగానే ఊరుఊరంతా విషాదంలో నిండిపోయింది. శుక్రవారం విడపనకల్లు మండలం చీమలగురికి గ్రామంలోని పొలంలో బోరు మరమ్మతు చేయడానికి ఇనుప పైపు బయటకు తీస్తుండగా పట్టు తప్పి పైనున్న విద్యుత్ తీగలు తగలడంతో రైతు కురుబ రేవణ్ణ (65), అతడి కుమారులు ఎర్రిస్వామి (36), బ్రహ్మయ్య (30), మనవడు రాజశేఖర్ (18), సమీప బంధువు, వన్నూరుస్వామి-రాజమ్మ దంపతుల కుమారుడు వరేంద్ర (29) అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు కంటతడిపెట్టారు. మృతదేహాలపై పడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ‘మేమేం పాపం సేశామని మాకింత పెద్ద సిచ్చవేశావురా దేవుడా.. మేం ఎలా బతకాలి.. ఇక మాకు దిక్కెవరు’ అంటూ రేవర్ణ భార్య లక్ష్మిదేవి గుండెలవిసేలా రోదించింది. ఇద్దరు కోడళ్లను గట్టిగా పట్టుకుని ‘ఇక మనకెవరు దిక్కమ్మా’ అంటూనే స్పృహ కోల్పోయింది.

‘‘పిల్లలను బాగా సదివిద్దామంటివే.. వాళ్లకి మంచి జీవితాన్నిద్దామని రోజూ సెప్తాంటివి. ఇంతలోనే నీతో పాటు నీ కొడుకునూ తీసుకెళ్తివా అయ్యా.. ఓరి దేవుడా’’ అంటూ ఎర్రిస్వామి భార్య పుష్పావతి భర్త, కొడుకు మృతదేహాల వద్ద విలపించింది. ‘తొందరగా బోరు రిపేరి సేసి బిరీన బువ్వ తీనేకి ఇంటికొత్తానని సెప్తివే.. నీకేమైందయ్యా..లెయ్.. పిల్లలు నిన్ను అడుగుతాండారు.. ఏం సెప్పేది.. అత్తమ్మా.. నాకు, నా పిల్లలకు ఇంక దిక్కెవరమ్మా..’ అంటూ బ్రహ్మయ్య భార్య నాగవేణి అత్తను హత్తుకుని కన్నీరుమున్నీరైంది.

‘పుట్టింటికి పోయిండే నీ పెళ్లాం వచ్చినాక అడిగితే నేనేం సెప్పల్రా కొడకా.. ఇంత ఘోరంగా పోతివే.. పెళ్లై సంవత్సరం దాటేకే లేదు.. ఇంతలోనే పెళ్లాం కొడుక్కి దిక్కు లేకుండా చేశావే’ అంటూ వరేంద్ర తల్లిదండ్రులు కొడుకు మృతదేహంపై పడి విలపిస్తుంటే వారిని ఆపడం అక్కడున్న వారి తరం కాలేదు.

ఇక గ్రామస్తులైతే విషాదం నిండిన హృదయంతో సంఘటన స్థలాన్ని చూస్తూ అలాగే ఉండిపోయారు. ఎవర్ని కదిపినా ‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగిందయ్యా.. ఉన్న పొలంలోనే అందరూ కలిసిమెలసి వెవసాయం సేత్తాండ్రి.. కట్టపడి బతికేటోళ్లు. ఎవర్నీ ఏ రోజూ పల్లెత్తు మాట అనేటోళ్లు కాదు.. ఇలాంటి కుటుంబానికి దేవుడు ఇంత శిచ్చ వేశాడు’’ అంటూ భగవంతుడిని నిందించారు.  

 ప్రభుత్వానికి నివేదిక పంపిన కలెక్టర్   
 అనంతపురం ఎడ్యుకేషన్ : విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామంలో పొలంలో బోరు వేస్తూ ఐదుగురు మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టరు సొలమన్ ఆరోగ్యరాజ్ శుక్రవారం రాత్రి ప్రభుత్వానికి నివేదించారు. ఈ ఘటనపై ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ను నివేదిక కోరడంతో ఆఘమేఘాలమీద సిద్ధం చేసి పంపారు. ఘటన జరగిన తీరు, కారణాలు తదితర అంశాలను సమగ్రంగా నివేదించారు.    

 రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
 అనంతపురం సిటీ : మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుదాఘాతంలో ఐదుగురు మృత్యువాత పడడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.    

 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
 అనంతపురం అర్బన్ : మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికి విద్యుత్ శాఖ నుంచి రూ.2.50 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.2.50 లక్షలు పరిహారంగా అందివ్వాలన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని, వైఎస్‌ఆర్‌సీపీ తరపున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement