అందిన చెక్కులు చూపెడుతున్న పట్టాదారులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ భూములుండీ విదేశాల్లో నివసిస్తున్న పట్టాదారులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సొమ్ము అందజేతపై నీలినీడలు అలుముకున్నాయి. మే నెలలో వారికి ఎలాగైనా అందజేసేందుకు పలు ప్రత్యామ్నాయాలు ఆలోచించిన సర్కారు... ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. విదేశాల్లో ఉన్న వారికి ‘సొమ్ము ఇవ్వడం అవసరమా’అన్న ధోరణిలో ఉన్నట్లు వ్యవసాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చనిపోయిన రైతుల పేరుతో ఉన్న చెక్కులు, దేశంలోనే వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పట్టాదారుల చెక్కుల పంపిణీపైనా సర్కారు నిర్ణయం తీసుకోవడంలేదు. దీంతో 61 వేల మంది ఎన్‌ఆర్‌ఐ, 90 వేల మంది చనిపోయిన రైతుల చెక్కులు మూలనపడి ఉన్నాయి. అలాగే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న రైతులకు చెందిన 1.14 లక్షల విలువైన చెక్కులు కూడా అలాగే ఉండిపోయాయి. ఇలా మొత్తంగా 2.75 లక్షల చెక్కుల సొమ్ము త్రిశంకు స్వర్గంలో తేలియాడుతోంది.
ఆయా కుటుంబాల ఎదురుచూపు...
ఖరీఫ్ సీజన్‌లో 58.33 లక్షల మంది రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వం 58.98 లక్షల చెక్కులను ముద్రించింది. అందుకోసం రూ. 5,730 కోట్లు బ్యాంకులకు అందజేసింది. అయితే గ్రామాలకు పంపిన చెక్కుల్లో ఇప్పటివరకు కేవలం 48 లక్షల మంది రైతులే చెక్కులు తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన సొమ్ములో రూ. 5,100 కోట్లు రైతులు తీసుకున్నారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఉన్న పట్టాదారుల విషయంలో సర్కారు నిర్ణయం తీసుకోకపోవడంపై వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అమెరికా సహా ధనిక దేశాలకు వెళ్లిన వారిలో చాలామంది ఆర్థికంగా శ్రీమంతులే.
కానీ గల్ఫ్ దేశాలకు వెళ్లినవారిలో అధికులు పేదలే. వారి పేరిట ఉన్న చెక్కులను, పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకోవడానికి వారిక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్నవారు, వారి కుటుంబీకులు వాటికోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక 90 వేల చెక్కులు చనిపోయిన రైతుల పేరిట ఉన్నాయి. వాటిని సర్దుబాటు చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందనే ఆరోపణలు న్నాయి. దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ఉండే వారి కోసం చెక్కులను జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి కౌంటర్ల ద్వారా అందజేయాలని అనుకున్నారు. ఆ ప్రయత్నాలేవీ జరగలేదు. దీంతో గ్రామాలకు వెళ్లడానికి వీలుపడని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment