![A collection of 34 million tons of grain - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/23/TS-4.jpg.webp?itok=Xu10oHXh)
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్‌లో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. దీనికనుగుణంగా 3,140 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. సేకరణలో ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. శనివారం ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఆ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్, జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 1,128 ఐఏపీ సెంటర్లు, 1,799 ప్రాథమిక సహకార సంఘాల కేంద్రాలు, 213 ఇతర కేంద్రాలు కలిపి 3,140 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే సంఖ్య పెంచాలని, ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనడం ఆలస్యం చేయొ ద్దని సూచించారు. గ్రేడ్–1 మద్దతు ధర రూ.1,770, కామన్ వెరైటీకి రూ.1,750 ఇస్తామని, రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని కోరారు. ధాన్యం సేకరణకు 8.59 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని, పాత బ్యాగుల నాణ్యతలో కఠినంగా వ్యవహరించాలన్నా రు. ఈ ఖరీఫ్‌లో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
కేసులున్న మిల్లులకు వద్దు
కేసులున్న రైస్ మిల్లులకు ధాన్యం సరఫరా చేయొద్దని, మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర అవసరాలకు పోనూ 17 లక్షల టన్నుల బియ్యం నిలువ చేయాల్సి వస్తుందని, అందులో 9.69 ఎల్‌ఎంటీ సివిల్ సప్లయ్ శాఖ వద్ద అందుబాటులో ఉందని మంత్రికి కమిషనర్ అకున్ సబర్వాల్ వివరించారు. మిగిలిన స్థలాన్ని ఎఫ్‌సీఐ నుండి తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment